logo

డిపోలకు తాళాలు నదుల్లో తవ్వకాలు!

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడం కోసం ఏర్పాటు చేసిన డిపోలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.

Published : 06 Jun 2023 05:58 IST

రెచ్చిపోతున్న ఇసుక అక్రమార్కులు
అధికారం అండగా జలవనరులకు తూట్లు
ఈనాడు డిజిటల్‌ అనకాపల్లి, నక్కపల్లి, న్యూస్‌టుడే  

శారదా నదిలో పొక్లెయిన్‌తో ఇసుక తవ్వకాలు (పాత చిత్రం)

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడం కోసం ఏర్పాటు చేసిన డిపోలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. మొదట్లో అయిదుచోట్ల ఇసుక డిపోలు తెరిచారు. వాటిలో అనకాపల్లి, చోడవరం, అచ్యుతాపురం డిపోలు ఇప్పటికే మూతపడ్డాయి. తాజాగా నక్కపల్లి డిపోలో కూడా రెండు వారాలుగా ఇసుక దొరకడం లేదు. నర్సీపట్నం డిపోలో నిల్వలు అడుగంటి పోయాయి. ఇక్కడికి ఏరోజు వచ్చిన ఇసుక ఆరోజే ఖాళీ అయిపోతోంది. డిపోల్లో ఇసుక లభ్యం కాకపోవడంతో స్థానిక నదులు, గెడ్డలపైనే అందరూ వాలిపోతున్నారు. ప్రభుత్వ నిర్మాణాల పేరిట గుల్ల చేసేస్తున్నారు. రాత్రి పగలు తేడాలేకుండా పొక్లెయిన్లు పెట్టి మరీ ఇసుక తవ్వి తరలించుకుపోతున్నారు. వాటిని ఎక్కడైనా అడ్డుకుంటే అధికార పార్టీ నేతలతో ఫోన్లు చేయించి పట్టుకుపోతున్నారు. శారదా, పెద్దేరు, వరహా నదులకు గుండె కోత మిగుల్చుతున్నారు. మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఇటీవలే శారదా నదిలో ఇసుక తవ్వకాల గురించి ‘మా ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక అందించాం.. మరి మీరు అందినకాడికి అమ్మేసుకుంటున్నారంటూ’ సెల్ఫీదిగి ఆరోపించారు. ‘ప్రభుత్వ నిర్మాణాలు, జగనన్న కాలనీల కోసం నదులు, గెడ్డల నుంచి తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్థానిక అధికారులు అడ్డుకోవద్దని చెప్పండి. వారి దగ్గర కూపన్‌ ఉందా లేదా పరిశీలించి రవాణాకు అనుమతించండి. వారు చెప్పిన చోటకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారిపై చర్యలు తీసుకోండి.’ అంటూ ఇటీవల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సంయుక్త కలెక్టరుకు చేసిన ఆదేశాలిచ్చారు. అంతే కానీ జిల్లాలో గాడి తప్పిన ఇసుక డిపోల నిర్వహణ గురించి ఊసెత్తలేదు.

అచ్యుతాపురం వద్ద మూతపడిన ఇసుక డిపో

వాటాలు.. కోటాలు..

మాడుగుల నియోజకవర్గంలోని శారదా, పెద్దేరు, బొడ్డేరు నదుల పొడవునా ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పేరుకే ప్రభుత్వ నిర్మాణాలు.. తవ్విన ఇసుకలో మెజార్టీ భాగం విజయనగరం, విశాఖ జిల్లాలకు తరలించేస్తున్నారు. అధికార పార్టీ సర్పంచులు, చోట నాయకులే దందా నడిపిస్తున్నారు. ఒకటి రెండు చోట్ల ఏకంగా గ్రామవసరాల పేరుతో వేలం పాటలు వేసి మరీ ఇసుక వ్యాపారం నిర్వహించారు. తర్వాత పంపకాల్లో తేడాలొచ్చి వేలం పాటలు రద్దుచేసుని గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ నుంచి సుమారు రూ. వెయ్యి పోలీసులు, రెవెన్యూ వారికి ముట్టచెప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇసుక మేట్ల పేరిట వ్యాపారం..: గతంలో శారదా నది ఒడ్డున కొంతమంది దళితులకు సాగు కోసం భూములిచ్చారు. కాలక్రమంలో వరదల కారణంగా ఆ భూముల్లో ఇసుక మేటలు వేశాయి. ఇప్పుడు ఆ భూముల్లో ఇసుక వ్యాపారానికి అధికార పార్టీ నేతలు తెరలేపారు. రైతుకు ఎకరాకు ఇంతని చేతిలో పెట్టి పొక్లెయిన్లు పెట్టి తవ్వేసి అమ్మేసుకుంటున్నారు. కలిగొట్ల వద్ద వంతెనకు సమీపంలోనే తవ్వకాలు చేపడుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. బోయిల కింతాడ, తమర్బ, తెనుగుపూడిలో ఎక్కువగా తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిలో కొంతే ప్రభుత్వ నిర్మాణాలకు వెళ్తోంది.మిగతా అంతా దళారులకు అప్పగించేస్తున్నారు. ఈ వ్యాపారంలో ఉన్నదంతా అధికార పార్టీ వారే కావడంతో తవ్వకాలు అడ్డుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు.

ఇసుక లేక నక్కపల్లి డిపో వద్ద అడ్డంగా పెట్టిన యంత్రం

కూపన్లున్నా ఫలితం సున్నా

నక్కపల్లి డిపోలో ఇసుక నిండుకుని నెల రోజులు కావస్తోంది. నిర్మాణ భవనాల యజమానులు నిల్వల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. గోదావరి రేవుల నుంచి ఇక్కడకు ఇసుకను భారీ లారీల్లో తెచ్చి నిల్వ చేసేవారు. ప్రస్తుతం వేసవి కావడంతో ఉన్నంతలో కాస్త నిర్మాణాలు జోరుగా చేపడుతున్నారు. ఇందులో జగనన్న కాలనీతోపాటు, సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటున్నవారు ఉన్నారు. మూడు వారాల కిందట ఇక్కడ సరకు అయిపోవడంతో రాజమహేంద్రవరం నుంచి వస్తుందని వారాల తరబడి నిర్వాహకులు, కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. నక్కపల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట, కోటవురట్ల, ఎలమంచిలి మండలాలకు చెందిన వారు ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంటారు. చాలామందికి కూపన్లు జారీ చేసినా, ఇసుక లేకపోవడంతో కూపన్లు రద్దయిపోతున్నాయి. దీంతో ఇంజినీరింగ్‌ అధికారులు వీటి జారీని ఆపేశారు. ఇసుక వచ్చిన తర్వాతే ఇస్తామని అంటున్నారు.


డిపోల నిర్వహణపై సమీక్షిస్తా..
- జాహ్నవి, సంయుక్త కలెక్టర్‌, అనకాపల్లి

ఇసుక డిపోలు ఎందుకు మూతపడ్డాయో ముందుగా సమీక్షించి వాటి నిర్వహణపై ఆలోచన చేస్తాం. ప్రభుత్వ నిర్మాణాలు, కాలనీలకు కాకుండా వ్యాపార అవసరాల కోసం నది ఇసుకను తరలిస్తే వారిపై చర్యలుంటాయి. జిల్లా పరిషత్తు సమావేశంలో మంత్రి కూడా అదే చెప్పారు. ఇసుక డిమాండ్‌, లభ్యతపై సంబంధిత అధికారులతో చర్చించి అక్రమ తవ్వకాలను నిరోధానికి చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు