logo

ఆదివాసీ హక్కులు హరించే కుట్రలు తిప్పికొట్టాలి

ఆదివాసీ హక్కులు, చట్టాలను హరించే కుట్రలను ఆదివాసీ సమాజం కలిసికట్టుగా తిప్పికొట్టాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ఛైర్మన్‌, మాజీ ఎంపీ డా. మిడియం బాబూరావు అన్నారు.

Published : 09 Jun 2023 06:26 IST

మాట్లాడుతున్న బాబూరావు, వేదికపై గిరిజన సంఘం నాయకులు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: ఆదివాసీ హక్కులు, చట్టాలను హరించే కుట్రలను ఆదివాసీ సమాజం కలిసికట్టుగా తిప్పికొట్టాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ఛైర్మన్‌, మాజీ ఎంపీ డా. మిడియం బాబూరావు అన్నారు. అరకులోయలో గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు గురువారం ఆరంభమయ్యాయి. సంఘం నాయకులు బాలదేవ్‌, రామకృష్ణ, కౌసల్య అధ్యక్షతన జరుగుతున్న మహాసభలను తొలిరోజు మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ జిల్లాలో చింతపల్లి, అనంతగిరి మండలాల్లో, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో అదాని, ప్రైవేటు సంస్థకు హైడ్రోపవర్‌,  తుపాకీ తయారీ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అటవీ, పర్యావరణ నియమాలు సవరించి ఆదివాసీ ప్రాంత హక్కులైన 5, 6వ షెడ్యూల్డ్‌ అధికారాలను తొలగించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన అటవీ, భూమి, సహజ వనరులు, గ్రామ సభ అధికారాలను తొలగిస్తూ ప్రైవేటు సంస్థలకు ప్రవేశం కల్పించడాన్ని గిరిజన సంఘం తిప్పికొడుతుందన్నారు. ఐటీడీఏలకు నిధుల కోతతో పాలన అస్తవ్యస్తంగా అవుతుందని, తక్షణం నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి గిరిజనుల్ని ఆదుకోవాలన్నారు. 1/70 చట్టం, పీసా, అటవీ హక్కుల చట్టాల అధికారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడాన్ని గిరిజన ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో మతోన్మాద భావాలను తిప్పికొట్టి ఆదివాసీలంతా గిరిజన హక్కులు, చట్టాలు కాపాడాలని పిలుపునిచ్చారు. అఖిల భారత గిరిజన సంఘం నాయకులు అప్పలనర్సయ్య, కిల్లో సురేంద్ర, బాలదేవ్‌, పలు జిల్లాల గిరిజన ప్రతినిధులు హాజరయ్యారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు