logo

ఎండకు ఎండుతూ.. గుండెలు మండుతూ..

మండుటెండల్లో బతుకు బండినిలాగే ఉపాధి కూలీల వేతనాలకు కోతపడింది. ఒకపూట పనిచేస్తే అందే కూలీ డబ్బే ఇప్పుడు రెండుపూటలా చేస్తే తప్ప అందే పరిస్థితి కనిపించడం లేదు.

Published : 09 Jun 2023 06:28 IST

ఉపాధి హామీ కూలీల వెతలు
ఈనాడు, పాడేరు- న్యూస్‌టుడే, అచ్యుతాపురం

పూడిక పనులు చేస్తున్న ఉపాధి కూలీలు

మండుటెండల్లో బతుకు బండినిలాగే ఉపాధి కూలీల వేతనాలకు కోతపడింది. ఒకపూట పనిచేస్తే అందే కూలీ డబ్బే ఇప్పుడు రెండుపూటలా చేస్తే తప్ప అందే పరిస్థితి కనిపించడం లేదు. భానుడి భగభగల్లో అల్లాడుతూ పలుగు, పారా పట్టుకొని పనులు చేస్తున్నా కడుపునిండే పరిస్థితులు కనిపించడం లేదు.

ఉమ్మడి విశాఖలో రోజుకు 2.50 లక్షల మంది కూలీలు పనిచేయగా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఇది లక్షన్నరకు పరిమితమైంది. ఇప్పటివరకు ఒక పూట పని చేస్తే సరిపోయేది. రెండు పూటలూ పనిచేయాలని నిబంధన తీసుకురావడంతో మండుటెండల్లో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 11 గంటలోగా ఒక ఫొటో, సాయంత్రం 5 గంటల్లోగా మరో ఫొటో తీసి యాప్‌లో ఆఫ్‌లోడ్‌ చేసే విధంగా నిబంధనలు సవరించారు. దీని వల్ల మండుటెండల్లో పనిచేయలేక ఇబ్బంది పడుతున్నారు.

వేసవి అలవెన్స్‌ల్లో కోత....

* గతంలో వేసవి అలవెన్స్‌లు అందించేవారు. మార్చి నుంచి జూన్‌  వరకు అందించే ఈ అలవెన్స్‌లను గత ఏడాది నుంచి నిలిపివేశారు.  మార్చిలో 30 శాతం, ఏప్రిల్‌ 40, మే నెలలో 50, జూన్‌లో 20 శాతం కూలీలకు అదనంగా అందించేవారు. వీటినీ ఎత్తేశారు.

* గతంలో 10 మంది కలిసి పనిచేసినా ఉపాధి వేతనాలు అందించేలా ఉన్న నిబంధనలు ఇప్పుడు 50 మంది తప్పనిసరిగా ఉండేలా మార్చారు.

* 100 రోజులు పని పూర్తి చేసిన కూలీలకు అందించే పలుగు, పారలు ఇవ్వడంలేదు. పనిచేస్తున్న చోట టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో కూలీలు సొమ్మసిల్లిపడిపోయినా సేదతీరే అవకాశం లేకుండాపోతోంది.

దాహం తీరే దారేది?

గతంలో దాహం తీర్చుకోవడానికి కొంత నగదును అందించేవారు. ఇప్పుడు దీనిని పూర్తిగా తొలగించారు. 5 కిలోమీటర్ల దాటి ప్రయాణం చేస్తే చెల్లించాల్సిన రవాణా ఛార్జీలను సైతం ఈ ఏడాది నుంచి మొండిచెయ్యి చూపించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపాధి కూలీలకు ఎక్కడా కనీస వేతనం రూ.257 అందుతున్న సందర్భాలు లేవు.


కన్నీరు పెట్టిస్తున్నారు..!

ఉపాధి కూలీల కష్టాలను ఎవరూ పట్టించుకోవడంలేదు. గతంలో ఒక పూట పనిచేస్తే వచ్చే డబ్బులు ఇప్పుడు రెండుపూటలు చేసినా రావడంలేదు. మండుతున్న ఎండల్లో పనులు చేయలేక, కుటుంబాలను ఆకలితో ఉంచలేక ఉపాధి పనులు చేస్తున్నాం. కష్టపడే వారిని ఆదుకోవాల్సిన వారే కన్నీరు పెట్టిస్తున్నాయి. పనిప్రదేశంలో గతంలో కల్పించిన సౌకర్యాలు ఇప్పుడు లేకపోవడం అన్యాయం.

పీలా లక్ష్మి, ఉపాధి కూలీ, హరిపాలెం


200 రోజుల పని కల్పించాలి : ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహస్య అజెండాతో పనిచేస్తున్నాయి.  వేసవి అలవెన్స్‌లు ఎత్తేశారు. ఉపాధి పనులు ఏడాదికి 200 రోజులు నిర్వహిస్తే అందరికీ ప్రయోజనం ఉంటుంది. కొలతలతో సంబంధం లేకుండా రోజుకు రూ.600 కూలీ గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

రొంగలి రాము,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు


వేసవి అలవెన్స్‌లు ఇవ్వాలి :   గతంలో ఉపాధి కూలీలకు పరికరాలతోపాటు నీటికి, వేసవి కాలంలో ప్రత్యేక అలవెన్స్‌లు ఇచ్చేవారు. రెండేళ్లగా వీటిని పూర్తిగా తొలగించారు. రోజులో రెండుపూటలా పనిచేయాలని నింబధన తీసుకొచ్చారు. ఎండలు మండుతున్న టెంట్లు వేయడం, తాగునీరు అందివ్వడం వంటి కనీస అవసరాలను తీర్చడంలేదు.

 పోలేటి సముద్రాలు,  పెదపాడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని