logo

మిరప విత్తులు.. వ్యాపారుల ఎత్తులు

మార్కెట్లో మిరప విత్తనాలకు రెక్కలొచ్చాయి. నల్లతామర పురుగును తట్టుకొని అధిక దిగుబడులు వస్తాయనే ప్రచారం జరగడంతో కొన్ని కంపెనీల విత్తనాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.

Published : 09 Jun 2023 06:34 IST

ఎటపాక, న్యూస్‌టుడే

కల్లంలో మిరప కాయల కుప్ప

ముందస్తు విత్తనం కావాలని రైతుల డిమాండ్‌ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఆర్బీకేలకు పది గ్రాముల విత్తనాలు సరఫరా కాలేదు.  విత్తనాల కోసం 8-10 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అధికారులు    చెబుతున్నారు.

మార్కెట్లో మిరప విత్తనాలకు రెక్కలొచ్చాయి. నల్లతామర పురుగును తట్టుకొని అధిక దిగుబడులు వస్తాయనే ప్రచారం జరగడంతో కొన్ని కంపెనీల విత్తనాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని వ్యాపారులు ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. విత్తన పంపిణీదారులు ఎమ్మార్పీకి మించి సరఫరా చేస్తే... వ్యాపారులు మరికొంత కలిపి అమ్మేస్తున్నారు. పది గ్రాముల విత్తన సంచి గరిష్ఠ ధర రూ.1300 ఉంటే రూ.1800 వసూలు చేస్తున్నారు. బిల్లు మాత్రం రూ.1300కే ఇస్తున్నారు. అదీ తెలిసిన వారెవరైనా ఉన్నా... సిఫార్సులు తెచ్చిన వారెవరైనా ఉంటేనే బిల్లు ఇవ్వడం గమనార్హం.

గతేడాది మిరపకు తెగుళ్లు సోకాయి. అంచనాల కంటే తక్కువగా దిగుబడులొచ్చాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో సాగు కలిసొచ్చింది. పత్తి సాగు చేసిన రైతులకు పూర్తిగా నష్టం వచ్చింది. దీంతో వారంతా మిరప వైపు దృష్టి సారించారు. దీని సాగు విస్తీర్ణం 15-25శాతం పెరగొచ్చని అంచనా. దీనికి విత్తనాన్ని సరఫరా చేస్తున్న విత్తనాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఆర్బీకేల్లో కనిపించని వైనం : బీ ఆర్బీకేల్లో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నట్లు పాలకులు, అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

* అల్లూరి సీˆతారామరాజు జిల్లాలో 197 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అందులో రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలోనే 82 ఉన్నాయి. వాటి పరిధిలో 4500 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. దీనికోసం సుమారుగా 550 కేజీల విత్తనం అవసరం ఉంది. ఓ కంపెనీకి చెందిన విత్తనమే 400 కేజీలు కావాలని రైతులు డిమాండ్‌ చేస్తుండటం గమనార్హం.

మన్యంలో ఇదీ పరిస్థితి....

జిల్లాలో అధిక విసీˆ్తర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో మిరప ఒకటి. చింతూరు డివిజన్‌లోని ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురం, చింతూరు మండలాల్లో 4500 ఎకరాల విసీˆ్తర్ణంలో మిరప సాగు చేస్తున్నారు. సకాలంలో విత్తు అందుబాటులో లేకపోతే నష్టపోతామని రైతులు ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు.

కౌలుకు రెక్కలు.....

మిరప పంటకు ధర అధికంగా ఉండడంతో కౌలు భూములకు రెక్కలొచ్చాయి. గోదావరి పరివాహకంలో ఉన్న భూములకు ఎకరాకు రూ.40వేలు నుంచి రూ.50వేల వరకు కౌలు ఉంటుంది. సాధారణ ఏరియాలో భూములున్న రైతులు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు అడుగుతున్నారు.  ఈ ఏడాది దిగుబడి లేకపోయినా ధర అధికంగా పెరగడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.


అందుబాటులోకి తేవాలి: సకాలంలో మిరప విత్తనం ఆర్బీకేల్లో అందుబాటులో ఉంటే రైతులకు మేలు కలుగుతుంది. నారుమడి వేసే నాటికి విత్తనం అందుబాటులో రావాలి. అధికారులు చర్యలు తీసుకుంటేనే రైతులకు ప్రయోజనం. ఇప్పటికే పొలాలు దుక్కులు పూర్తి చేసుకుంటున్నాం. విత్తనం ముందస్తుగా కొనుగోలు చేయకపోతే ఆ సమయానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది.

 మడకం నర్సింహారావు, రైతు, గౌరిదేవిపేట


జులైలో అందుబాటులోకి..: మిరప విత్తుకోవడానికి సమయం ఉంది. ముందస్తుగా ఆయా కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. జులైలో అందుబాటులోకి తెస్తాం. నారుమడికి 45రోజుల సమయం ఉంటుంది. అంతవరకు విత్తనం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

కాశీవిశ్వనాథ చౌదరి, వ్యవసాయశాఖ ఏడీఏ, రంపచోడవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని