logo

పెద్దపులి దాడిలో దున్నపోతు హతం

చింతూరు అటవీ డివిజన్‌ లక్కవరం రేంజ్‌ పరిధిలోని సుకుమామిడి సమీప పొలాల్లో పెద్దపులి సంచారం గిరిజనులను కలవరానికి గురిచేసింది.

Published : 10 Jun 2023 02:13 IST

పులి పాదముద్రలు

మోతుగూడెం, న్యూన్‌టుడే: చింతూరు అటవీ డివిజన్‌ లక్కవరం రేంజ్‌ పరిధిలోని సుకుమామిడి సమీప పొలాల్లో పెద్దపులి సంచారం గిరిజనులను కలవరానికి గురిచేసింది. సుకుమామిడి పెద్దవాగు సమీపంలో మోతుగూడెం గ్రామ రైతు వి.నాగేశ్వరరావుకు చెందిన దున్నపోతుపై పెద్దపులి దాడిచేసి హతమార్చింది. వివరాల్లోకి వెళ్తే. మేత కోసం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లిన దున్నపోతు సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో యజమాని అటవీ ప్రాంతంలో వెతకగా పెద్దపులి చంపినట్లు గుర్తించి, లక్కవరం రేంజ్‌ అటవీ క్షేత్రాధికారి వెంకట నానాజీకి ఫిర్యాదు చేశారు. ఆయన చింతూరు డీఎఫ్‌వో పుష్ప సౌజన్యకు సమాచారం ఇవ్వగా, ఆమె హుటాహుటిన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ పాద ముద్రలను గుర్తించి దాడి చేసింది పెద్ద పులేనని తేల్చారు. దాని కదలికలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్ద పులి సంచరించిందని తెలియటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో డీఎఫ్‌వో సమీప గిరిజన గ్రామాల్లోని గిరిజనులతో సమావేశమై వారిని అప్రమత్తం చేశారు.

అప్రమత్తంగా ఉండాలి

మోతుగూడెం, న్యూస్‌టుడే: లక్కవరం రేంజ్‌లోని అభయారణ్యంలో పెద్ద పులి సంచారిస్తోందని, సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌వో జె.పుష్ప సౌజన్య హెచ్చరించారు. పశువుల యజమానులు తమ పశువులను గ్రామ సమీప పొలాల్లో మేపుకోవాలని సూచించారు. మనుషులపై కూడా దాడి చేసే అవకాశాలున్నాయన్నారు. దాని సంచారం ఎటు అని అంచనా వేయడం కష్టమన్నారు. గ్రామాల్లో టముకు ప్రచారంతో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. పులి సంచారంపై ఎటువంటి సమాచారం మీకు తెలిసిన తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని