logo

రూ. 20 లక్షలతో దుకాణాల ఏర్పాటు

గిరిజన ప్రాంతాల్లో వారపు సంతలే గిరిజనులకు సూపర్‌మార్కెట్లు. ఇక్కడ దొరకని వస్తువు, సామగ్రి ఉండదు. ప్రతిరోజూ మన్యంలో ఎక్కడో ఒక చోట వారపు సంతలు జరుగుతూనే ఉంటాయి. చింతపల్లిలో ప్రతి బుధవారం సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక మైదాన ప్రాంత మండలాల నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులు ఇక్కడకు వస్తుంటారు.

Published : 10 Jun 2023 02:13 IST

చింతపల్లి సంతలో నిర్మిస్తున్న షెడ్‌, అటవీ ఉత్పత్తులు
దాచుకునేందుకు  గోదాము

చింతపల్లి, న్యూస్‌టుడే ;- గిరిజన ప్రాంతాల్లో వారపు సంతలే గిరిజనులకు సూపర్‌మార్కెట్లు. ఇక్కడ దొరకని వస్తువు, సామగ్రి ఉండదు. ప్రతిరోజూ మన్యంలో ఎక్కడో ఒక చోట వారపు సంతలు జరుగుతూనే ఉంటాయి. చింతపల్లిలో ప్రతి బుధవారం సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక మైదాన ప్రాంత మండలాల నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతి వారం రూ. లక్షల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. గిరిజనులు పండించిన వ్యవసాయోత్పత్తులు, సేకరించిన అటవీ ఉత్పత్తులను వారపు సంతలకు తీసుకొచ్చి వ్యాపారులకు, జీసీసీకి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో గిట్టుబాటు ధరలు రాక ఒక్కోసారి రైతులు తాము తీసుకువచ్చిన ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయించుకోవాల్సిన పరిస్థితి. ధరలు వచ్చేంత వరకూ ఈ ఉత్పత్తులను దాచుకునే మార్గం ఉండదు. దీంతో రైతులు వ్యాపారులు అడిగిన తక్కువ ధరలకే తాము తీసుకువచ్చిన ఉత్పత్తులను విక్రయించుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఉండేది.

*గిరిజన రైతులు వారపు సంతలకు తీసుకొచ్చిన ఉత్పత్తులు అమ్ముకోవడంతోపాటు అవసరమైతే వాటిని కొద్దిరోజులపాటు నిల్వ చేసుకునేందుకు వీలుగా సంతల్లో విలేజ్‌ హట్స్‌ నిర్మించాలని 2009లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరక్రాంతి పథం (ఐకేపీ) ద్వారా రూ. 15 లక్షలను ఇందుకోసం కేటాయించారు. మన్యంవ్యాప్తంగా సుమారు 45 చోట్ల వీటిని నిర్మించాలని భావించారు. ఒక్కో నిర్మాణానికి తొలి విడతగా రూ. 5 లక్షల నిధులు కేటాయించారు. ఆ నిధులతో పునాదులు నిర్మించారు. ఇక అప్పటి నుంచి అవి నిరుపయోగంగానే ఉన్నాయి. మంచి ఆలోచనతోనే వీటిని నిర్మించ తలపెట్టినా అమలుకు నోచుకోకపోవడంతో రైతులు ఎప్పటిలాగానే తాము తీసుకొచ్చిన ఉత్పత్తులను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ధరలు రాకపోతే రైతులు తాము తీసుకొచ్చిన ఉత్పత్తులను దాచుకునే మార్గం లేదు. దీనిపై గత ఏడాది నవంబరు 18న ‘దాచుకునేందుకు చోటేదీ’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనిపై గిరిజన వికాస్‌ స్వచ్ఛంద సంస్థ స్పందించింది. సంస్థ కార్యదర్శి సత్యనారాయణ పంచాయతీ పాలకవర్గంతోపాటు నాబార్డు అధికారులతో చర్చించి చింతపల్లి సంతలో శాశ్వత షెడ్ల నిర్మాణంతోపాటు గిరిజన ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు గోదాము నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం నాబార్డు రూ.15 లక్షల నిధులను కేటాయించింది. పంచాయతీ తరఫున రూ.5 లక్షలు నిధులు ఇచ్చేందుకు సర్పంచి పుష్పలత అంగీకరించారు. దీంతో ఎట్టకేలకు వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. సంతషెడ్లతోపాటు గోదాము నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో వీటిని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి వినియోగంలోకి వస్తే వారపు సంతలో దుకాణాల ఏర్పాటుతోపాటు ప్రత్యేకంగా గిరిజన ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సంతకు వచ్చే గిరిజనులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటితోపాటు మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు సర్పంచి పుష్పలత, ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌ తెలిపారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు