logo

బాబు రాక కోసం వెయ్యికళ్లతో ఎదురుచూపులు

జైలు నుంచి చంద్రబాబు ఎప్పుడు బయటికొస్తారా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు..

Updated : 21 Sep 2023 04:54 IST

అనకాపల్లి గాంధీ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శనలో బుద్ద నాగజగదీశ్వరరావు, తెదేపా నాయకులు

జైలు నుంచి చంద్రబాబు ఎప్పుడు బయటికొస్తారా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు..

అనకాపల్లి, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అనకాపల్లిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జిల్లా తెదేపా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావుతో కలిసి పార్టీ కార్యాలయంలో మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. అనంతరం రింగ్‌రోడ్డులో రాస్తారోకో చేశారు. అక్కడి నుంచి బెల్లం మార్కెట్‌లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ‘బాబుతో నేను’ ఫ్లకార్డులు ప్రదర్శించారు. బుద్ధ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ గాడితప్పిందన్నారు. సీఐడీ అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.  నాయకులు మాదంశెట్టి నీలిబాబు, బొలిశెట్టి శ్రీనివాసరావు, నడిపల్లి గణేష్‌, సురే సతీష్‌, కోట్ని రామకృష్ణ, బోడి వెంకటరావు, పొలిమేర నాయుడు పాల్గొన్నారు.

ఓటమి భయంతోనే తప్పుడు కేసులు ఈశ్వరి ధ్వజం

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో రిలే దీక్షశిబిరంలో మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, తెదేపా నాయకులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ ఓటమి భయంతోనే తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయించారని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో తెదేపా నాయకులు చేపట్టిన రిలేదీక్షలను బుధవారం జోరువానలోనూ కొనసాగించారు. ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఈశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటివరకు కూల్చివేతలు, అణచివేతలు, దౌర్జన్యాలతోనే పాలన సాగించారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సింహాచలం, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్‌ నాయుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్‌కుమార్‌, అరకు పార్లమెంటరీ అధికార ప్రతినిధి శివకుమార్‌, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు వెంకటరావు, శ్రీనివాసరావు, రాధాకృష్ణం నాయుడు, జ్యోతికిరణ్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుపై కేసులు ఎత్తేసే వరకు పోరాటం

అరకులోయలో రిలే దీక్షలో తెదేపా నాయకులు శ్రావణ్‌, అబ్రహం తదితరులు

అరకులోయ, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై కేసులు ఎత్తేసే వరకు తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. అరకులోయలో నిర్వహిస్తున్న రిలే దీక్ష శిబిరంలో బుధవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడుపై లేనిపోని కేసులు పెట్టి తెదేపా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతియ్యాలని వైకాపా ప్రభుత్వం చూస్తోందన్నారు. కేసులను చూసి భయపడేది లేదన్నారు. ప్రజల మద్దతు తెదేపాకే ఉందన్నారు. కొత్త కేసులను తోడి తెదేపాని నిర్వీర్యం చేయాలని వైకాపా చూస్తోందన్నారు. పాలకుల కుటిల నీతికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పూర్వ సభ్యుడు సీవేరి అబ్రహం, తెదేపా నాయకులు బూర్జ లక్ష్మి, శెట్టి బాబూరావు, శెట్టి లక్ష్మణుడు, అమ్మన్న తదితరులు పాల్గొన్నారు.

స్కామ్‌ల జగన్‌ సర్కార్‌కి ప్రజలే బుద్ధి చెప్తారు..: స్కామ్‌ల జగన్‌ సర్కార్‌కి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పూర్వ సభ్యుడు సీవేరి అబ్రహం అన్నారు. అరకులోయలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ మోహన్‌ రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. వైకాపా ప్రభుత్వ వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. గ్రామస్థాయి నుంచి వైకాపా అక్రమాలను...తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై పెట్టిన అక్రమ కేసులను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేస్తామన్నారు.  తెదేపా నాయకులు కమ్మిడి సుబ్బారావు, కామేశ్వరరావు, అప్పలస్వామి, పాంగి రాజు, ఈశ్వరరావు, సురేష్‌, సూర్య తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష

చింతూరు, న్యూస్‌టుడే: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చింతూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం పార్టీ కార్యాలయం ఎదుట ఎటపాక, చింతూరు మండలాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ఈ దీక్షలు నిర్వహించారు. తెదేపా మండల అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి, పుట్టి రమేశ్‌, వరరామచంద్రపురం జడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి, నాయకులు నలజాల మధు, కానుమూరి బుల్లయ్య, మాచినేని రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

వెంటనే విడుదల చేయాలి

రంపచోడవరం శిబిరంలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు

రంపచోడవరం, న్యూస్‌టుడే:  చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్‌లు డిమాండ్‌ చేశారు. పార్టీ ఇన్‌ఛార్జి రాజేశ్వరి ఆధ్వర్యంలో రంపచోడవరంలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు బుధవారం 8వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మారేడుమిల్లి మండలానికి చెందిన అధ్యక్షుడు గురుకు శేషుకుమార్‌తో పాటు రాష్ట్ర నాయకులు పల్లాల రాజ్‌కుమార్‌రెడ్డి, దూడ ప్రణీత్‌, దూడ సువర్ణకుమార్‌, పొడియం శ్రీనుబాబు తదితరులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్రంలో తెదేపాకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తెదేపా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గొర్లె సునీత, నాయకులు అడబాల బాపిరాజు, కారం సురేష్‌, వై.నిరంజనీదేవి, శేషాయమ్మ, పాము అర్జున్‌, మెహర్‌బాబాగౌడ్‌, సుభానీ, బాబూరావు, తీగల ప్రభ, మచ్చు నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

‘రాజకీయ కక్షతోనే అరెస్టు’

చింతలూరు వద్ద కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయ కక్షతోనే అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా సీనియర్‌ నాయకుడు బేరా సత్యనారాయణ అన్నారు. మండలంలోని చింతలూరు వద్ద బుధవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. జగన్‌ను నమ్మి అధికారాన్ని అప్పగిస్తే అన్నివర్గాల ప్రజలకు ఆయన తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులను పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో తెదేపా మండల ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య, శ్యామ్‌సుందర్‌, మల్లేశ్వరరావు, బెన్నలింగేశ్వరరావు, సోమలింగం పడాల్‌, పార్వతి
తదితరులు పాల్గొన్నారు.

‘చీడలా పట్టిన జగన్‌’

కశింకోట, కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: చంద్రబాబునాయుడు అనే మహావృక్షానికి పట్టిన చీడపురుగు జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ, త్వరగా బయటకు రావాలని కోరుతూ కశింకోట అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం పూజలు చేశారు. అనంతరం కోనేరు గట్టుపై మొక్కలు నాటారు. కొత్తూరు కళాశాల కూడలిలో దీక్ష శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనలు, యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక సీఎం జగన్‌ తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుపాల్జేశారన్నారు. చంద్రబాబు రాక కోసం వేయి కళ్లతో ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. తెదేపా, జనసేన పొత్తు ఖరారు కావడంతో వైకాపాకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. నాయకులు కందాళ జగన్నాథరావు, కాయల మురళీధô్, పెంటకోట రాము, సతీష్‌, కృష్ణ, వేగి సాయి, రెడ్డి త్రినాëÇ్, రాము, మేడిశెట్టి రాధ, స్వరూప, కోన కుమారి, నాగరాజు, వనుము శ్రీనివాసరావు, కట్టా మాణిక్యం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని