logo

మిత్రాలు దూరం.. సేవలు భారం!

అనకాపల్లి, విశాఖ జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో కొంతవరకు ఆరోగ్యశ్రీ కేసులు నమోదు చేస్తున్నా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ పథకం అమలు అంతంతమాత్రంగానే ఉంటోంది.

Updated : 21 Sep 2023 04:53 IST

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, నక్కపల్లి

గ్రామాల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న సచివాలయ ఏఎన్‌ఎం

అనకాపల్లి, విశాఖ జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో కొంతవరకు ఆరోగ్యశ్రీ కేసులు నమోదు చేస్తున్నా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ పథకం అమలు అంతంతమాత్రంగానే ఉంటోంది.

వైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యసేవలను బలోపేతం చేస్తున్నామని సర్కారు చెబుతోంది. మరోవైపు పీహెచ్‌సీల్లో పనిచేసే ఆరోగ్యశ్రీ సిబ్బందిని తొలగించి సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో సర్దుబాటు చేసేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవల బాధ్యతను స్టాఫ్‌నర్స్‌, జూనియర్‌ అసిస్టెంట్లకు అదనంగా అప్పగించారు. దీనివల్ల పీహెచ్‌సీ స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందడం లేదు. ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమవుతున్న స్టాఫ్‌నర్స్‌, సచివాలయ ఏఎన్‌ఎంలు ఆరోగ్యశ్రీ జోలికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఎవరైనా అడిగితేనే ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నారు. లేకుంటే సాధారణ పద్ధతిలోనే సేవలందించి పంపించేస్తున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం అందించేందుకు వీలుగా ఆరోగ్య మిత్రాలు సేవలు అందిస్తుంటారు. వీరు ఆసుపత్రికి వచ్చే రోగులు, ప్రసవానికి వచ్చే గర్భిణుల సమాచారాన్ని ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి ట్రస్ట్‌కు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా అందాల్సిన అన్ని వసతులను సమకూర్చుతారు. మందుల ఖర్చులు, నాణ్యమైన భోజనం, ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యేటప్పుడు రవాణా ఖర్చులు, ఆసరా కింద ఆర్థిక సాయం అందుతుంది. ఈ ప్రక్రియలో ఆరోగ్య మిత్రాలే కీలకంగా పనిచేస్తుంటారు. ఇదివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రి వరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా నియమితులైన ఆరోగ్య మిత్రాలుండేవారు. కొన్ని నెలల క్రితం ఉమ్మడి జిల్లాలోని 115 పీహెచ్‌సీల నుంచి వీరిని తప్పించేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో శస్త్రచికిత్సలు జరగవు కాబట్టి వీరిని ఇతర ఆసుపత్రులకు సర్దుబాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పీహెచ్‌సీలన్నింటినీ 24 గంటలు వైద్యసేవలు అందించేలా ఉన్నతీకరిస్తూనే ఆరోగ్య మిత్రాలను తొలగించడం విశేషం. గ్రామీణులకు చేరువగా ఉంటే ఈ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు జరగకున్నా ప్రసవాలు బాగానే జరుగుతున్నాయి. వీటిని ఆరోగ్యశ్రీలో చేర్చితే గర్భిణులకు మంచి పౌష్ఠికాహారంతోపాటు రూ.5 వేల ఆసరా సాయం అందుతుంది. అయితే వీరి వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయడంతోపాటు వారు డిశ్ఛార్జి అయిన తర్వాత కొన్నిరోజుల పాటు అనుశీలన చేయాల్సి ఉంటుంది. ఉన్న పనే సరిపోతోంది, ఈ శ్రమంతా ఎందుకని కొన్నిచోట్ల స్టాఫ్‌నర్స్‌లు ఆరోగ్యశ్రీలో నమోదు చేయకుండా సాధారణ ప్రసవాలు చేసి పంపించేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ సేవలు గర్భిణులకు అందడం లేదు.

  • విశాఖ, అనకాపల్లిలో లక్ష్యం కంటే తక్కువ సంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నాయి. ఆరోగ్య కేంద్రాలకు సమీపంలోనే సామాజిక, ప్రైవేటు ఆసుపత్రులు ఉండడంతో అక్కడకు వెళ్లిపోతున్నారు. అదే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పీహెచ్‌సీల్లో ఇచ్చిన లక్ష్యాలను మించి ప్రసవాలు జరుగుతున్నాయి. ఒక్కో ఆరోగ్య కేంద్రంలో సగటున నెలకు 11 కాన్పులు చేస్తున్నారు. ఏజెన్సీలో గిరిజనులకు అందుబాటులో ఉన్నవి పీహెచ్‌సీలే కావడంతో అక్కడే ఎక్కువ ప్రసవాలు జరుగుతున్నాయి. ఆరోగ్య మిత్రాలు లేకపోవడంతో వీటిలో 50 శాతం కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు.  

పెరిగిన ఒత్తిడి..

ఆరోగ్యమిత్రలను తొలగించడంతో ఆ పనిభారం పీహెచ్‌సీల్లోని స్టాఫ్‌నర్సు, సచివాలయాల్లోని ఏఎన్‌ఎంలపై పడింది. స్టాఫ్‌ నర్సులు ఆసుపత్రుల్లో కాన్పులు, రోగుల బాగోగులతోపాటు ఇతర పనులను పర్యవేక్షించాల్సి ఉంది. ఏఎన్‌ఎంలు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. దీనికి తోడు ఇప్పటికే 72 యాప్‌ల్లో వైద్యారోగ్య శాఖ కోరిన వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు నమోదు చేయిస్తున్నారు. తాజాగా జగనన్న సురక్ష కార్యక్రమానికి సంబంధించి ఇంటింటి సర్వే చేపట్టాలని ఆదేశాలు వచ్చాయి. దీనిపైనా కుస్తీలు పడుతున్నారు. ఆరోగ్య మిత్రాలు ఉంటే ఈ పనిభారం చాలా వరకు తగ్గేది, రోగులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉండేదని సంబంధిత అధికారులే చెబుతున్నారు.

అయిదు నిమిషాల పనే

  • పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ కేసులను స్టాఫ్‌నర్స్‌లు బాగానే నమోదు చేస్తున్నారని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల జిల్లా సమన్వయకర్త రాజేష్‌ అన్నారు. ‘ఈ అదనపు పని వారికి పెద్ద భారం కాదు. అయిదు నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంద’న్నారు. ప్రసవాలన్నింటినీ ఆరోగ్యశ్రీలో నమోదు చేయాలని సూచించామన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని