logo

బైకు దొంగల ముఠా ఆటకట్టు

ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పట్టుకుని వారి నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌ తెలిపారు.

Published : 21 Sep 2023 02:44 IST

20 వాహనాల స్వాధీనం

నిందితులను అరెస్టు చూపిస్తున్న పోలీసులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పట్టుకుని వారి నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ గతనెల 25న ద్విచక్ర వాహనం చోరీకి గురవడంపై ఈనెల 14న కొయ్యూరు ఎస్సై రాజారావుకు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి రోజూ వాహనాల తనిఖీ చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో దొడ్డవరం వద్ద బైక్‌పై వెళుతున్న మాకవరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన ఆకేటి దుర్గా ప్రసాద్‌, చింతపల్లి మండలం వంట్లమామిడి గ్రామానికి చెందిన వంతల సోమరాజులను ఆపి ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పారన్నారు. దీనికితోడు వారి బైక్‌కు నంబరు ప్లేట్‌ లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. తరవాత చేపట్టిన విచారణలో ఈ ఇద్దరూ రెండేళ్ల నుంచి విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు గుర్తించామని చెప్పారు. దొంగిలించిన బైకులను చింతపల్లి మండలం అన్నవరానికి చెందిన పాంగి ప్రకాష్‌, పోతురాజు గుమ్మల గ్రామానికి చెందిన వంతల నాగేంద్ర, నిమ్మపాడు గ్రామానికి చెందిన గెమ్మెల సన్యాసిరావుకు అమ్మేవారన్నారు. వీటిని నిమ్మపాడు గ్రామానికి సమీపంలోనున్న పొదల్లో దాచి ఉంచారని చెప్పారు. సమయం చూసుకుని గంజాయి రవాణాదారులకు అమ్మేసేవారని చెప్పారు. మొత్తం ముఠాను అరెస్ట్‌ చేసి వారి నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గెమ్మెల సన్యాసిరావును ఇప్పటికే వేరే కేసుల్లో అరెస్ట్‌ చేశామన్నారు. మిగిలిన నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించామన్నారు. కొయ్యూరు సీఐ స్వామినాయుడు, ఎస్సై రాజారావు, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీను, శంకర్‌, మాణిక్యం, గోవిందులకు అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌ రివార్డులను ప్రకటించారు. చింతపల్లి సీఐ రమేష్‌, ఎస్సై అరుణ్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని