logo

ఆసుపత్రుల్లో నాణ్యత మదింపు బృందం తనిఖీలు

నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రులను జాతీయ నాణ్యత ప్రమాణాల మదింపు బృందం గురువారం సందర్శించింది.

Published : 22 Sep 2023 01:57 IST

నర్సీపట్నం ఆసుపత్రిలో బృంద సభ్యులు

నర్సీపట్నం అర్బన్‌, అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రులను జాతీయ నాణ్యత ప్రమాణాల మదింపు బృందం గురువారం సందర్శించింది. డాక్టర్‌ యోగీంద్రబాబు (కర్ణాటక), సంతోష్‌బాబు (తమిళనాడు) ఆధ్వర్యంలో పలువురు కమిటీ సభ్యులు తొలుత నర్సీపట్నం ఆసుపత్రి పర్యవేక్షకురాలితో సమావేశమయ్యారు. విభాగాల వారీగా తాము తీసుకుంటున్న శ్రద్ధని ఆమె కమిటీకి వివరించారు. అనంతరం బయోవ్యర్థాలు నిల్వ చేసే గదిని బృందం పరిశీలించింది. ఎన్ని రోజులకోసారి వ్యర్థాలు బయటకు తరలిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. నిర్మాణంలో ఉన్న పోస్టుమార్టం గదిని, అత్యవసర వైద్య సేవల విభాగం, ప్రసూతి గది పరిశీలించారు. శస్త్రచికిత్సల థియేటర్‌లో ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు. మందుల నిల్వలను తనిఖీ చేశారు. మరో రెండు రోజులపాటు కమిటీ ఇక్కడ పరిశీలన చేయనుంది. అనకాపల్లి ఆసుపత్రిని సందర్శించిన బృందంలో వైద్యులు వై.రమణ, టి.శ్రీనివాస్‌ ఉన్నారు.

  •   నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి సందర్శనకు నాణ్యత మదింపు బృందం రానున్న నేపథ్యంలో హడావుడిగా ఏర్పాట్లు చేశారు. ప్రవేశ మార్గాల వద్ద పూలకుండీలను ఉంచారు. రోగులు, సహాయకులు వేచి ఉండాల్సిన విభాగాల వద్ద అదనంగా కొత్త కుర్చీలు వేశారు. ఎక్కడికక్కడ శుద్ధజలం అందుబాటులో ఉంచారు. చెత్త వేయడానికి అవసరమైన డబ్బాలు ఎటు చూసినా కనిపించేలా అమర్చారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచారు. సువాసన వెదజల్లే ఫినాయిల్‌తో ఆవరణంతా తుడిపించారు. వార్డుల్లోకి రోగుల బంధువులు గుంపుగా వెళ్లకుండా సిబ్బంది నియంత్రించారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ కనిపించింది. ద్విచక్ర వాహనాలను లోపలకు రానివ్వలేదు. సిబ్బంది అంతా ఏకరూప దుస్తుల్లో విధులు నిర్వహిస్తూ కనిపించారు. ఈ మాదిరి శ్రద్ధ రోజూ ఉంటే కార్పొరేట్‌ ఆసుపత్రులను ప్రాంతీయ ఆసుపత్రి మరిపిస్తుందనడంలో సందేహమే లేదని రోగుల సహాయకులు పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని