logo

‘సింహాద్రి’ భూముల్లోకి వారసుడొచ్చాడు!

పంచదార కర్మాగారం ఏర్పాటుకు భూములిచ్చిన రైతులు, వారి వారసులకు ఉపాధి అవకాశాలు చూపుతామన్నారు.

Published : 22 Sep 2023 01:57 IST

130 ఎకరాల విలువ రూ.32.5 కోట్లు

కర్మాగారం పేరు మార్చి తన పేరిట పట్టాలు
 సమగ్ర భూసర్వేతో వెలుగులోకి..

రోలుగుంట (చోడవరం), న్యూస్‌టుడే: పంచదార కర్మాగారం ఏర్పాటుకు భూములిచ్చిన రైతులు, వారి వారసులకు ఉపాధి అవకాశాలు చూపుతామన్నారు. కర్మాగారం పేరుతో రిజిస్ట్రేషన్‌ అయిన భూములకు హక్కుదారుగా వ్యక్తి పేరును వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఈ వ్యవహారం సమగ్ర భూసర్వేతో వెలుగులోకి రావడంతో భూములిచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గోవాడ చక్కెర కర్మాగారానికి అనుబంధంగా రావికమతం, రోలుగుంట మండలాల్లో సుగర్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని పాతికేళ్ల కిందట కొంతమంది ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన యాజమాన్యాలు ముందుకొచ్చాయి. అనువైన భూములను పరిశీలించాయి. చిత్తూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త దాలవాయి కృష్ణస్వామినాయుడు ఆదికేశవులు (డీకే ఆదికేశవులనాయుడు) రోలుగుంట మండలం కొంతలం, కంచుగుమ్మల రెవెన్యూ పరిధిలో సుమారు 140 మంది రైతులకు చెందిన వేర్వేరు సర్వే నంబర్లలోని 130 ఎకరాలను 1996లో కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లించడంతోపాటు భూములిచ్చిన రైతు కుటుంబానికి ఫ్యాక్టరీలో ఉపాధి కల్పిస్తామన్నారు. ‘సింహాద్రి సుగర్స్‌, కొత్తకోట’ పేరుతో భూములను రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ భూములను నాటి నుంచి సంబంధిత రైతులే సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. ఫ్యాక్టరీ ఏర్పాటు కాకపోవడంతో భూములను తిరిగి అప్పగించాలని చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజుతో కలిసి రైతులు పలుమార్లు ఆదికేశవులనాయుడిని కోరారు. ఆయన మరణానంతరం కుమారుడు శ్రీనివాసు ఈ ప్రాంత నాయకుల ద్వారా 2018 సెప్టెంబరులో నాటి ఆర్డీఓ, తహసీల్దార్లను కలిసి ‘సింహాద్రి సుగర్స్‌’ పేరుతో ఉన్న భూములను తన పేరున ఆన్‌లైన్‌ చేయించున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు కోరుతూ దరఖాస్తు చేయగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెవెన్యూ అధికారులు డిజిటల్‌ సంతకం చేసి ఆమోదించారు. ప్రస్తుతం ఈ భూముల విలువ ఎకరా రూ.25 లక్షల చొప్పున 130 ఎకరాలు రూ.32.5 కోట్ల వరకు ఉంది. ఈ భూముల్లో 13 ఎకరాలు కంచుగుమ్మల, 14 ఎకరాలు భోగాపురం రైతులకు చెందినవి కాగా.. మిగతావి కొంతలం గ్రామానికి రైతులకు చెందినదే ఉన్నాయి.


ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తేనే..

ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుతో రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం, నర్సీపట్నం మండలాల్లోని చెరకు రైతులకు ప్రయోజనం ఉంటుందని భూములిచ్చాం. ఆ భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తామంటే అంగీకరించం.

సుంకర కృష్ణారావు, రైతు, కొంతలం


సాగుదారులుగా రైతుల పేర్లు

ఫ్యాక్టరీ ఏర్పాటుకు కొనుగోలు చేసిన భూములు సమగ్ర సర్వేలో ఏళ్ల తరబడి రైతుల అనుభవంలోనే ఉన్నాయని తేలింది. భూ పట్టాలు ఫ్యాక్టరీ యజమాని పేరుతో ఉన్నప్పటికీ సాగులో ఈ ప్రాంతాలకు చెందిన రైతులే ఉన్నారు. రీ-సర్వేలో వారి పేర్లనే నమోదు చేశాం.

 వరహాలు, తహసీల్దార్‌, రోలుగుంట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని