logo

రాక్షస పాలనకు అంతం పలకాలి

రాష్ట్రంలో  రాక్షస పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు.

Updated : 22 Sep 2023 03:44 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు

దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో  రాక్షస పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎంవీపీ కాలనీలో తూర్పునియోజకవర్గ నాయకులు చేపట్టిన నిరసన దీక్షా శిబిరంలో గురువారం ప్రసంగిస్తూ.. రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్యాలను అందించేందుకు తెదేపా హయంలో సీమెన్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఏపీఎస్‌ఎస్‌డీసీ సంస్థను నెలకొల్పిందన్నారు. దీని ద్వారా ఎంతో మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో ఉన్నత ఉద్యోగాలు సంపాదించారన్నారు. ఇందులో అవినీతి జరిగిందని చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. ఈ చర్యను రాష్ట్ర ప్రజలు ఆక్షేపిస్తున్నారని, అందుకే అనేక వర్గాల వారి మద్దతు చంద్రబాబుకు ఉందన్నారు. అధికారులు సైతం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే చేస్తున్నారు తప్ప, మరొక ఆలోచన చేయట్లేదన్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు ఉద్యమం ఆగదన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పట్టాభిరామ్‌, నాయకులు ఒమ్మి సన్యాసిరావు, అప్పలరాజు, బుడుమూరి గోవింద్‌,  రామచంద్రరావు, రమణి,  సత్యం, కార్పొరేటర్‌ మంగవేణి, ఉమారాణి, రాజశేఖర్‌, వెంకటరమణ, కాళ్ల శంకర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబుతో మేము అంటూ పలువురు ముస్లిం మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి  మద్దతు ప్రకటించారు.  

మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు

చంద్రబాబును అరెస్టు చేసి, తెదేపా నాయకులు, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని సీఎం జగన్‌ ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. జీవీఎంసీ 93వ వార్డు పరిధి ప్రహ్లాదపురంలో చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు.


కనకమహాలక్ష్మికి న్యాయవాదుల పూజలు

చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, కేసుల నుంచి క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తూ తెదేపా న్యాయ విభాగానికి చెందిన న్యాయవాదులు కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మోకాళ్లపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. 116 కొబ్బరికాయలు కొట్టడంతో పాటు పంచామృతాలతో అభిషేకం జరిపారు. లీగల్‌ సెల్‌ అధ్యక్షులు కె.వి.స్వామి మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబుపై కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. చివరకు న్యాయమే గెలుస్తుందని, త్వరలోనే చంద్రబాబు బయటకొస్తారన్నారు. న్యాయ పోరాటం చేస్తూనే భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. ప్రధాన కార్యదర్శి గిరిధర్‌, రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ, నాయకులు పార్థసారథి, శోభన్‌బాబు, జనసేన లీగల్‌ సెల్‌ ప్రతినిధులు కళావతి, పలక శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.


అనకాపల్లి పట్టణం: అనకాపల్లి సాయిబాబా ఆలయంలో తెదేపా రాష్ట్ర బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో  పూజలు చేశారు. త్రినాథ్‌, ప్రసాద్‌, పిట్లరాజు, పొలిమేర ఆనంద్‌, ఆకుల నానాజీ పాల్గొన్నారు.

దివ్యాంగుల దీక్షలు

విశాఖపటం: తెదేపా అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసి, జైలు నుంచి  విడుదల చేయాలని తెదేపా కార్యాలయంలో విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులు ఈసరపు వాసు ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసన తెలిపారు. మేము సైతం బాబు కోసమంటూ సంతకాలు చేసి దీక్షల్లో పాల్గొన్నారు. అనుబంధ విభాగాల బాధ్యులు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ నజీర్‌ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, అటువంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేసి కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించిన వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టడం అన్యాయమన్నారు. వాసు మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలంతా జగన్‌ నిర్ణయాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి  మూర్తియాదవ్‌,  తాతాజీ, శ్రీనివాస్‌,  త్రినాథ్‌,  వెంకటేశ్‌, ఈశ్వరి, రమాదేవి, భాగ్యలక్ష్మి, సురేశ్‌, మోహన్‌రంగా, అప్పలరాజు, లింగబాబు, నర్సింహమూర్తి పాల్గొన్నారు.


జగన్‌ను సాగనంపేందుకు ఐక్యంగా పనిచేద్దాం

అచ్యుతాపురం, రాంబిల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇంటికి పంపించడానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్‌కుమార్‌ కోరారు. జనసేన, తెదేపా కలిసిపోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో గురువారం విశాఖలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ లాలం భవానీలను మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు పార్టీలు కలిసి జగన్‌ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు.  జడ్పీటీసీ మాజీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకులు బైలపూడి రాందాసు, లాలం చందు, కరెడ్ల ప్రకాశ్‌, రుత్తల పండు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని