logo

అలజడి లేకపోయినా అడవుల జల్లెడ

ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ ఏవోబీ ఎస్‌జడ్‌సీ కార్యదర్శి గణేష్‌ ఇటీవల ఒక లేఖలో పిలుపునిచ్చారు.

Published : 22 Sep 2023 02:16 IST

చింతపల్లి/గ్రామీణం, న్యూస్‌టుడే: ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ ఏవోబీ ఎస్‌జడ్‌సీ కార్యదర్శి గణేష్‌ ఇటీవల ఒక లేఖలో పిలుపునిచ్చారు. దీంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ తెలిపారు. గురువారం రాళ్లగెడ్డ పోలీసు అవుట్‌ పోస్టును సందర్శించారు. అవుట్‌పోస్టు నుంచి అత్యాధునిక డ్రోన్‌ కెమెరాలతో చుట్టు పక్కల గ్రామాలను పరిశీలించారు. బలపం, కోరుకొండ, కుడుముల తదితర గ్రామాలపై డ్రోన్‌ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఐ రమేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

జిల్లాలో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు బాగా తగ్గినట్టు పోలీసు అధికారులే చెబుతున్నారు. రంపచోడవరం పరిధిలోని చింతూరు, కుంట తదితర ప్రాంతాల్లో కొంతమేర మావోయిస్టు కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. అయినా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ముద్రపడిన బలపం పంచాయతీపై దృష్టి పెట్టారు. ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

ఎటపాకలో అప్రమత్తం

ఎటపాక, న్యూస్‌టుడే: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఎటపాకలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటపాక నుంచి చింతూరు, కూనవరం మండలాలకు వెళ్లే రహదారిలో బండిరేవు, తోటపల్లి, గన్నవరం, నందిగామ గ్రామాల సమీపంలో మావోయిస్టు పోస్టర్లు, బ్యానర్లు వెలిసిన సంగతి తెలిసిందే. వాటిని పోలీసులు వెంటనే తొలగించారు. అప్పటి నుంచి ఎటపాక సీఐ గజేంద్రకుమార్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐ పార్థసారథి నేతృత్వంలో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావటంతో భద్రాచలం-చింతూరు, కూనవరం, చర్ల రహదారుల సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల రహదారుల మధ]్య వాహన రాకపోకలను రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నియంత్రిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని