logo

జగన్‌ను ఇంటికి పంపే రోజు దగ్గర్లోనే..

అక్రమ కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్టు చేయించిన జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు

Updated : 22 Sep 2023 06:04 IST

పాడేరులో దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, నారాయణ తదితరులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: అక్రమ కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్టు చేయించిన జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పాడేరులో చేపడుతున్న రిలే దీక్షలు గురువారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. చంద్రబాబును విడుదల చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి అంటూ నినాదాలు చేశారు. శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేలపై సభాపతి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబును ఎన్నికల వరకు జైల్లో ఉంచాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు రాజమండ్రి నారాయణ, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు చిట్టిబాబు, రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి సింహాచలం, నేతలు రమేష్‌నాయుడు, సురేష్‌కుమార్‌, శివకుమార్‌, జ్యోతికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఓటమి భయంతోనే  అరెస్టు

హుకుంపేట, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబును సీఎం జగన్‌ అక్రమంగా అరెస్టు చేయించారని అరకు పార్లమెంట్‌ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు, అండిభ సర్పంచు సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ అండిభ గెడ్డలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ కేసులో చంద్రబాబునాయుడి పేరు లేకపోయినా ఆయన్ను అన్యాయంగా అరెస్టు చేయించారన్నారు. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని చెప్పారు. నిజాయతీకి నిలువెత్తు రూపమైన చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎన్‌ఎస్‌ఫ్‌ సభ్యులు శివ, రాము, విశ్వనాథం, రవి తదితరులు పాల్గొన్నారు.


అరాచక పాలనకు  త్వరలోనే ముగింపు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే:  రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన త్వరలోనే ముగియనుందని తెదేపా అరకు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి అన్నారు. చింతపల్లిలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. తెదేపాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. జనసేన, తెదేపా పొత్తుతో వైకాపా కొట్టుకుపోతుందన్నారు. త్వరలో బాబు బయటకు వస్తారని, న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ పార్టీలకు అతీతంగా పలువురు బయటకు వచ్చి తమ గళం వినిపిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు చల్లంగి లక్ష్మణరావు, శ్రీధర్‌, రాము, సోమేష్‌, హరి తదితరులు పాల్గొన్నారు.


ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు

అరకులోయ, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు తీసుకొస్తున్నాయని తెదేపా ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నుదొర అన్నారు. అరకులోయలో జరుగుతున్న రిలే దీక్ష శిబిరంలో గురువారం తెదేపా ఎస్టీ సెల్‌ నాయకులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఒక పార్టీని అణిచి వేయాలన్న ధోరణి తగదన్నారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంలో అప్పటి తెదేపా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేవారేనా అని ప్రశ్నించారు. ప్రజలంతా వైకాపా ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడిపై కేసులు ఎత్తేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, నాయకులు సివేరి అబ్రహం, బాబూరావు, అమ్మన్న, ఇచ్ఛావతి, బూర్జ లక్ష్మి, నిర్మల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


చంద్రబాబుపై  వైకాపా కక్ష

అరకులోయ, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు క్షేమంగా ఉండాలని కోరుతూ అరకులోయలోని మసీదులో తెదేపా నాయకులు గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న చంద్రబాబునాయుడిపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీని అణచివేయాలని చూస్తే ఉప్పెనలా మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులకు భంగం కలిగేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ఓటుతోనే ప్రజల మనసులు గెలుచుకోవాలి తప్ప.. భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. తెదేపా నాయకులు రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.


తొమ్మిదో రోజుకు  చేరిన నిరాహార దీక్షలు

రంపచోడవరం, ఎటపాక, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై పెట్టిన కేసులను నిరసిస్తూ రంపచోడవరంలో తెదేపా శ్రేణులు చేస్తున్న రిలేనిరాహార దీక్షలు గురువారం 9వ రోజుకు చేరాయి. మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరితో పాటు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్‌ తదితర నాయకులు దీక్షలో కూర్చున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీ నాయకులు అడబాల బాపిరాజు, వై.నిరంజనీదేవి, గురుకు శేషుకుమార్‌, సాదల సత్య, మఠం భాస్కర్‌, అనంతమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు ఆధ్వర్యంలో విలీన మండలాల తెలుగు యువత నాయకులు. ఎటపాక నుంచి దీక్షకు ర్యాలీగా తరలివెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు