logo

బాబు బయటకు.. జగన్‌ జైలుకు..

తెదేపాకు పెరుగుతున్న ఆదరణ చూసి వైకాపాలో వణుకు మొదలైందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు.

Updated : 24 Sep 2023 06:33 IST

నిరాహార దీక్షల్లో తెదేపా నేతలు

పాడేరులో నిరసన దీక్ష చేస్తున్న తెదేపా నాయకులు

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: తెదేపాకు పెరుగుతున్న ఆదరణ చూసి వైకాపాలో వణుకు మొదలైందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు. చంద్రబాబుకు బెయిల్‌ రాకుండా అనేక కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద చేపడుతున్న రిలే దీక్షలు శనివారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. ఈశ్వరి మాట్లాడుతూ.. త్వరలో బాబు బయటకు రావడం, సైకో జగన్‌ జైలుకు పోవడం ఖాయమన్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు రాజమండ్రి నారాయణ, నాయకులు వంజంగి కాంతమ్మ, బొర్రా విజయరాణి, సింహాచలం, రమేష్‌నాయుడు, సురేష్‌కుమార్‌, శివకుమార్‌, వెంకటరమణ, జ్యోతికిరణ్‌, శ్రీధర్‌, అప్పారావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యానికి తూట్లు

హుకుంపేటలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శన

హుకుంపేట, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ సీఎం జగన్‌ అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అరకు పార్లమెంట్‌ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు సత్యనారాయణ విమర్శించారు. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం పోలీసులను పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటోందని ఆరోపించారు. 16 నెలలు జైల్లో గడిపిన జగన్‌.. చంద్రబాబునాయుడిని కక్షపూరితంగా అరెస్టు చేయించారన్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు రాము, శివ, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వైకాపా పాలనలో విధ్వంసకాండ

రంపచోడవరం నిరాహార దీక్ష శిబిరంలో మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వరి, వెంకటేశ్వరరావు, నాయకులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: చంద్రబాబు   అరెస్టు కుట్రపూరితమని మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆరోపించారు. స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద తెదేపా శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 11వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా చేస్తున్న విధ్వంసకాండకు ప్రజల చరమగీతం పాడతారన్నారు. సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే సీఐడీ, పోలీసు అధికారులు నడుచుకుంటున్నారన్నారు. తెదేపా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గొర్లె సునీత, నాయకులు తీగల ప్రభ, వై.నిరంజనీదేవి, కారం సురేష్‌, అనంతమోహన్‌, మాగాపు బాబూరావు, లంక హరి, జొన్నల నాని, కోసు నాగన్నదొర, మడకం పండు, తైలం గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

అధినేత వెన్నంటే మేమంతా...

అరకులోయ రిలే దీక్ష శిబిరంలో తెదేపా నాయకులు

అరకులోయ, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వెన్నంటే తామంతా ఉన్నామని ఆ పార్టీ మహిళా నాయకురాలు బూర్జ లక్ష్మి అన్నారు. అరకులోయలో శనివారం రిలే దీక్ష శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలన్న వైకాపా కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. లక్షలాది మంది కార్యకర్తలమంతా చంద్రబాబునాయుడి కోసం పోరాడతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన చంద్రబాబునాయుడిపై అక్రమ కేసులు బనాయించడం బాధాకరమని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం రౌడీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తెదేపా నాయకులు నాగేశ్వరరావు, ప్రసాద్‌, సురేష్‌, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కిడారి అడుగుజాడల్లో నడుద్దాం

పాడేరులోని కిడారి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌, తెదేపా నాయకులు

అరకులోయ, పాడేరు, డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అడుగుజాడల్లో నడిచి గిరిజన ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సర్వేశ్వరరావు అయిదో వర్ధంతిని పాడేరులోని ఆయన సమాధి వద్ద నిర్వహించారు. శ్రావణ్‌కుమార్‌, తెదేపా నేతలు సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అరకులోయలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేశారు. శ్రావణ్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి, గిరిజనుల సమస్యల పరిష్కారానికే వెళ్తూ మావోల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సర్వేశ్వరరావు ఆదర్శనీయుడన్నారు. వక్తలు మాట్లాడుతూ కిడారి సర్వేశ్వరరావు సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అరకు పార్లమెంట్‌ టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి స్వామి తదితరులు రక్తదానం చేశారు. తెదేపా నాయకులు దొన్నుదొర, శెట్టి బాబూరావు, బాకూరి వెంకటరమణ, పాండురంగస్వామి, సుబ్బారావు, సాయిరాం, అమ్మన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజకీయ కక్షతోనే బాబు అరెస్టు

చౌడుపల్లిలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించాలని తెదేపా అరకు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి కోరారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శనివారం పార్టీ నాయకులతో కలసి చౌడుపల్లి వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. వైకాపా ఎన్ని కుట్రలు పన్నినా అవినీతి మచ్చ లేకుండా చంద్రబాబు బయటకు వస్తారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు లేకుండా ఆయన్ను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందన్నారు. ప్రతిపక్షాలను అణగదొక్కుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. తెదేపా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు, పాంగి రాము, శ్రీధర్‌, వెంగళయ్య, స్వర్ణ, గంగాధర్‌, హరిసునిల్‌ తదితరులు పాల్గొన్నారు.

సోమ ఆశయసాధనకు కృషి

మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు

అరకులోయ, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆశయసాధనకు కృషి చేద్దామని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం పిలుపునిచ్చారు. సోమ 5వ వర్ధంతిని పురస్కరించుకొని అరకులోయలోని ఆయన సమాధి వద్ద శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అబ్రహం మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతానికి సోమ అందించిన సేవలు మరువరానివన్నారు. తుది శ్వాస వరకు ప్రజల కోసమే జీవించారన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సోమ మాదిరిగానే తాము పనిచేస్తున్నామన్నారు. తెదేపా ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దొన్ను దొర, నాయకులు శెట్టి బాబూరావు, బూర్జ లక్ష్మి, రెహమాన్‌, కమిడి సుబ్బారావు, బొరిబొరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


‘మేము సైతం’ అంటున్న దివ్యాంగులు

వారంతా దివ్యాంగులు. మూడు చక్రాల రిక్షాలపై అతికష్టం మీద అక్కడకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం స్థానిక నెహ్రూచౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై ‘నైను సైతం బాబు కోసం’ అంటు సంతకాలు చేసి సంఘీభావం ప్రకటించారు.

అనకాపల్లి, న్యూస్‌టుడే


చెడు వినం.. కనం.. మాట్లాడం
వినూత్నంగా నిరసన తెలిపిన తెదేపా

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా నాయకులు, కార్యకర్తలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. కె.కోటపాడు మండలం కూండ్రపువానిపాలెంలో చెడు వినం.. కనం.. మాట్లాడం అంటూ చెవులు, కళ్లు, నోరు మూసుకుని నిరసన తెలిపారు. నాయకులు కశిరెడ్డి అప్పలనాయుడు, కన్నూరు సూర్యనారాయణ, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, కె.కోటపాడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని