logo

గిరిజన విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు

జిల్లా పరిషత్‌ 1-7 స్థాయీ కమిటీ సమావేశాల్లో ఇద్దరు అధికారులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Updated : 24 Sep 2023 03:18 IST

విద్యాశాఖ అధికారిపై జడ్పీటీసీ సభ్యుల తీవ్ర ఆగ్రహం
వాడీవేడిగా జడ్పీ స్థాయీ కమిటీ సమావేశం

జడ్పీ స్థాయీ కమిటీ సమావేశంలో ఛైర్‌పర్సన్‌ సుభద్ర, సీఈఓ శ్రీరామమూర్తి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్‌ 1-7 స్థాయీ కమిటీ సమావేశాల్లో ఇద్దరు అధికారులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధికారుల వ్యాఖ్యలపై జడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. చివరికి ఇద్దరు అధికారులు క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగిన స్థాయీ కమిటీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. దేవరాపల్లిలో స్త్రీనిధి నిధుల దుర్వినియోగంపై జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం ప్రశ్నించారు. అనకాపల్లి డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి మాట్లాడుతూ విచారణ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో సత్యంతో పాటు మిగిలిన జడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి చెప్పినా చర్యలు తీసుకోరా అంటూ మండిపడ్డారు. తన మాటలు మరో విధంగా అర్థం చేసుకోవద్దని, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని లక్ష్మీపతి వివరణ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.

  • విద్యాశాఖపై జరిగిన చర్చలో అరకు జడ్పీటీసీ సభ్యురాలు రోషిణి మాట్లాడుతూ మన్యం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ కార్యాలయ పర్యవేక్షకులు చక్రధర్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విద్యార్థులు అలాగే ఉంటారంటూ వ్యాఖ్యానించారు. దీంతో గిరిజన ప్రాంత జడ్పీటీసీ సభ్యులు భగ్గుమన్నారు. విద్యార్థులను గాడిలో పెట్టాల్సింది పోయి తేలిగ్గా మాట్లాడతారా అంటూ నిలదీశారు. చివరకు విద్యాశాఖ అధికారి క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
  • జగనన్న ఇళ్ల నిర్మాణాలకు రూ.1.80లక్షలు సరిపోవడం లేదని, ఇసుక, సిమెంటు సరిగ్గా అందడం లేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు  తెలిపారు. గతంలో కూడా యూనిట్‌ ధర పెంచాలని తీర్మానం చేసినా ఫలితం లేదన్నారు. మినీ గోకులాలకు బిల్లుల మంజూరులో విశాఖ జిల్లా డ్వామా పీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భీమిలి జడ్పీటీసీ సభ్యుడు వెంకటప్పడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని పలువురు ఆరోపించారు. కొంతమంది సభ్యులు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో ప్రావీణ్యం పెంచాలన్నారు. ఉపాధ్యాయులు టీచింగ్‌ ప్లాన్‌ అనుసరించేలా చూడాలన్నారు.
  • జడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, మందుల కొరత లేకుండా చూడాలన్నారు. జగనన్న ఇళ్ల కాలనీల పనులను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కేటాయించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు, జడ్పీ సీఈఓ శ్రీరామమూర్తి, ఉప కార్యనిర్వాహణ అధికారి డి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు