Nadendla Manohar: మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు: నాదెండ్ల

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. దిశ చట్టం చేశాం..

Published : 28 Apr 2022 16:22 IST

అమరావతి: రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. దిశ చట్టం చేశాం.. గన్‌ కంటే ముందు జగన్‌ వస్తాడు లాంటి మాటలు చెప్పడం తప్ప వైకాపా పాలకులు యువతులకు, మహిళలకు ఇసుమంతైనా రక్షణ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. వైకాపా పాలనలో మాటలు తప్ప చేతలు లేకపోవడం వల్లే అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు.

‘‘గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసిన ఘటన బాధాకరం. కొల్లూరు మండలం చిలుమూరులోనూ పట్టపగలే ఓ మహిళ హత్యకు గురవ్వడం దురదృష్టకరం. విజయవాడలో మానసిక పరిపక్వత లేని యువతిపై సర్వజనాసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన, తిరువూరులో ఇంటర్‌ విద్యార్థినిపై వాలంటీరు భర్త వేధింపులు లాంటి ఘటనలు మరువక ముందే గుంటూరు జిల్లాలో హత్యలు, అత్యాచారాలు జరిగాయి. మహిళల రక్షణ విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లోపించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారికి భయం లేకుండా పోయింది. చట్టాలు చేశాం, యాప్ తెచ్చాం అని ప్రకటనలు మాత్రమే చేసే చేతగాని ప్రభుత్వం వల్ల ఆడబిడ్డలకు ధైర్యం కలగడం లేదు.

ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున గతేడాది జులైలో సామూహిక అత్యాచారం ఘటన జరిగితే ఇప్పటికీ నిందితుడిని పట్టుకోలేదు. గుంటూరు జిల్లా మేడికొండూరులో సామూహిక అత్యాచారం జరిగితే పోలీసుల స్పందన, నిందితులను అదుపులోకి తీసుకోవడంలో జాప్యం చూస్తే... వ్యవస్థను ఈ పాలకులు ఎలా గాడి తప్పించారో అర్థం అవుతోంది. వైకాపా ప్రభుత్వం పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతిభద్రతలు గాలికొదిలేసింది. వైకాపా ఫ్లెక్సీలు చిరిగితే స్కూలు పిల్లలను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే స్థితికి ఆ శాఖను దిగజార్చింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి అని చెప్పుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఆడబిడ్డలకు రక్షణ కల్పించి... అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేసినప్పుడు ఆ అవార్డులకు విలువ ఉంటుంది’’ అని నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని