logo

‘నిలదీతలు వాళ్లకు.. నీరాజనాలు మాకు’

తెదేపా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ప్రజలు నీరాజనాలు పలుకుతూ.. అధిక ధరలు, సమస్యలపై వైకాపాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా

Updated : 20 May 2022 06:06 IST

మాట్లాడుతున్న మాజీమంత్రి నక్కా ఆనందబాబు

అనంతవరం (కొల్లూరు), న్యూస్‌టుడే : తెదేపా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ప్రజలు నీరాజనాలు పలుకుతూ.. అధిక ధరలు, సమస్యలపై వైకాపాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. గురువారం కొల్లూరు మండలం అనంతవరంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైకాపా పాలన ఫలితంగా ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకునేందుకు తెదేపా ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాధితులుగా మారిన ప్రజలు తమకు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైకాపా నాయకులు వెళ్తుంటే.. పన్నులు, ధరల భారాలు మోయలేని ప్రజలు అడుగడుగునా వారిని నిలదీస్తున్నారని చెప్పారు. ఈ తీరును గమనిస్తే ప్రజాన్యాయస్థానంలో వైకాపా దోషిగా నిలబడిన వైనం కళ్లకు కడుతోందని పేర్కొన్నారు. తెదేపా- వైకాపా పాలనలో నిత్యావసరాల ధరల్లో అంతరాలను స్పష్టం చేసేలా నాయకులు ఫ్లెక్సీ ప్రదర్శించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆనందబాబు ఆవిష్కరించారు. నేతలు డాక్టర్‌ కనగాల మధుసూదన్‌ ప్రసాద్‌, మైనేని మురళీకృష్ణ, ఎంపీటీసీ సభ్యురాలు నాగళ్ల శిరీష, సర్పంచ్‌ అలపర్తి ఉషారాణి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని