logo

కొండ కరిగిపోతోంది..!

ప్రతి రోజు నందిగామ మీదుగా టిప్పర్లల్లో గ్రావెల్‌ అక్రమ రవాణా జరుగుతోంది. నందిగామలోనే ఆర్డీవో, ఏసీపీ, మైనింగ్‌ ఏడీ, పోలీసుస్టేషన్‌ సీఐ, రవాణా శాఖ అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న గ్రావెల్‌ టిప్పర్లు ఆయా

Updated : 25 May 2022 06:24 IST

రాఘవాపురం గట్టు గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు
కళ్ల ముందే జరుగుతున్నా పట్టించుకోని అధికారులు
నందిగామ, న్యూస్‌టుడే

ప్రతి రోజు నందిగామ మీదుగా టిప్పర్లల్లో గ్రావెల్‌ అక్రమ రవాణా జరుగుతోంది. నందిగామలోనే ఆర్డీవో, ఏసీపీ, మైనింగ్‌ ఏడీ, పోలీసుస్టేషన్‌ సీఐ, రవాణా శాఖ అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న గ్రావెల్‌ టిప్పర్లు ఆయా శాఖల అధికారుల కళ్ల ముందే  పగలు, రాత్రి తిరుగుతున్నాయి. టిప్పర్లను ఆపి అనుమతులు ఉన్నాయా.. లేదో సైతం ఆపి ప్రశ్నించట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేవనే విషయం కొందరికి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. సామాన్యుడు తన అవసరాలకు ఒక ట్రాక్టరు తోలితే మాత్రం వాహనాన్ని సీజ్‌ చేసి, క్రిమినల్‌ కేసులు నమోదు చేసే పరిస్థితి ఉంది. నందిగామ మండలం రాఘవాపురం గట్టు నుంచి గ్రావెల్‌ అక్రమ తవ్వరాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. యంత్రాలతో గట్టు తవ్వి, టిప్పర్లల్లో వందలాడి లోడ్లు గ్రావెల్‌ లోడింగ్‌ చేసి ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. దీనికి తవ్విన గట్టుయే ప్రత్యక్ష నిదర్శనమని, వైకాపా నాయకులు, అధికారుల అండదండలతోనే అక్రమరవాణా జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. ఆర్‌.ఎస్‌ నంబరు ఒకటిలో 203 ఎకరాల విస్తీర్ణంలో రాఘవాపురం గట్టు ఉంది. దీనిలో అనుమతులు లేకుండా పొక్లెయిన్‌లు, జేసీబీలతో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. దీంతో స్వరూపం కోల్పోతోంది. కొన్నాళ్లపాటు ఇదే విధంగా జరిగితే అక్కడ ఒక గట్టు ఉంది. దాని పేరు రాఘవాపురం గట్టు లేదా కొండ అనుకునే పరిస్థితి నెలకొంది. గ్రావెల్‌ తవ్వకాలకు ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదని మైనింగ్‌ శాఖ అధికారులు వెల్లడించారు. అయినా ఆ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఫిర్యాదు చేసినా స్పందన కరవు
కొన్ని రోజులుగా జరుగుతున్న అక్రమరవాణాపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మైనింగ్‌ శాఖ ఏడీ, తహసీల్దారు, సీఐలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆమె స్వయంగా సోమవారం రాత్రి గట్టు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అయిదు టిప్పర్లల్లో గ్రావెల్‌ వెళ్లిపోయింది. రెండు జేసీబీలు, రెండు టిప్పర్లు అక్కడే ఉన్నాయి. దీనిపై మైనింగ్‌ ఏడీ, తహసీల్దారుకు ఫోన్‌ చేసినా స్పందించలేదు. తెల్లవారుజామున మూడు గంటల వరకు అక్కడే బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకులను సీఐ, పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. ఏ శాఖ అధికారికి మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా తమకు సంబంధంలేదనే సమాధానం వస్తుండటంతో ఆమె సైతం విస్తుపోయారు. మైనింగ్‌ ఏడీ అసలు ఫోన్‌ తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్‌ తవ్వకాలకు మైనింగ్‌ శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. దాని తవ్వకాలకు ప్రభుత్వానికి తగిన సెస్సు చెల్లించాలి. ఇవేమి లేకుండా చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. రోజూ రూ.లక్షల్లో ఆదాయం పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని