logo

న్యాయం కోరుతూ దిల్లీ యాత్ర

అత్తింట్లో మోసపోయిన కుమార్తెకు న్యాయం జరగాలని కోరుతూ.. తన కుమారుడుతో కలిసి ఓ తల్లి దిల్లీకి ఎద్దుల బండిపై ప్రారంభించిన యాత్ర బుధవారం తెలంగాణలోని ఖమ్మం సమీపంలోని ధంసలపురం చేరుకుంది. చందర్లపాడు మండలం

Updated : 26 May 2022 06:18 IST


ధంసలపురం చేరుకున్న తల్లీ కుమారుడు

చందర్లపాడు, న్యూస్‌టుడే: అత్తింట్లో మోసపోయిన కుమార్తెకు న్యాయం జరగాలని కోరుతూ.. తన కుమారుడుతో కలిసి ఓ తల్లి దిల్లీకి ఎద్దుల బండిపై ప్రారంభించిన యాత్ర బుధవారం తెలంగాణలోని ఖమ్మం సమీపంలోని ధంసలపురం చేరుకుంది. చందర్లపాడు మండలం ముప్పాళ్లకు చెందిన నేలవెల్లి పూర్ణచంద్రరావు, జ్యోతిల కుమార్తె నవ్యతకు నందిగామ మండలం చందాపురానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌తో 2018లో వివాహమైంది. దాంపత్యంలో మనస్పర్థలు చోటు చేసుకోవటంతో 2020లో ఆమెను పుట్టింటికి తీసుకొచ్చారు. నాటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. గత నెలలో ఏటూరు సమీపంలోని కృష్ణానదిలో ఇసుక తిన్నెల్లో మండుటెండలో పూర్ణచంద్రరావు, జ్యోతి, కుమారుడు, కుమార్తె కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు అభ్యంతరం తెలపడంతో పాటెంపాడు సమీపంలోని తమ సొంత పొలంలో నిరసన తెలిపారు. అయినా న్యాయం జరగకపోవటంతో ఎలాగైన తమ కుమార్తెకు న్యాయం జరిగేలా చూడాలని భావించిన తల్లీకుమారులు దిల్లీలోని సుప్రీం కోర్టులో హెచ్‌ఆర్సీని ఆశ్రయించేందుకు ఈ నెల 23న ఎద్దుల బండిపై ముప్పాళ్ల నుంచి యాత్రగా బయలుదేరి వెళ్లారు. బుధవారం బోనకల్లులో బయలుదేరి ఖమ్మం సమీపానికి చేరుకొని యాత్రను నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎద్దుల బండిపైనే దిల్లీ చేరుకొని హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని