logo

సకాలంలో వైద్యం అందక ఉపాధి కూలీ మృతి

సకాలంలో వైద్యం అందక ఉపాధి హామీ కూలీ మృతి చెందిన ఘటన పామర్రు మండలం పసుమర్రులో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్రె కోటేశ్వరరావు(58) బుధవారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు.

Published : 26 May 2022 06:18 IST


కోటేశ్వరరావు (పాతచిత్రం)

పసుమర్రు(గ్రామీణ పామర్రు), న్యూస్‌టుడే : సకాలంలో వైద్యం అందక ఉపాధి హామీ కూలీ మృతి చెందిన ఘటన పామర్రు మండలం పసుమర్రులో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్రె కోటేశ్వరరావు(58) బుధవారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వెనుక భాగంలో పంటబోదె తవ్వకం పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన నోటి నుంచి నురగ వచ్చి పడిపోయి అపస్మాకర స్థితిలోకి వెళ్లారు. తోటి కూలీలు గమనించి వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. ఎంత సేపటికీ వాహనం రాకపోవడంతో స్థానికులు చేతులపై మోసుకుంటూ దాదాపు అరకిలోమీటరు మేర ప్రయాణించి ఇంటి వద్దకు చేర్చారు. అప్పటికీ 108 వాహనం రాలేదు. దీంతో బాధితుడిని ట్రక్కు ఆటోలో తరలిస్తుండగా జుఝువరం సెంటరు సమీపంలో 108 వాహనం ఎదురు వచ్చింది. సిబ్బంది కోటేశ్వరరావుని పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దాదాపు రెండు గంటలపాటు వాహనం రాకపోవడంతో వృద్ధుడు మృతి చెందాడని పలువురు ఆరోపించారు. కాగా వాహనం మరో ప్రాంతానికి వెళ్లడంతో రావడానికి ఆలస్యమైందని సిబ్బంది చెబుతున్నారు. విషయం తెలిసిన తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్ల కుమార్‌రాజా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు అశోక్‌కుమార్‌ స్థానిక ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు.

కోటేశ్వరరావుని మోసుకొస్తున్న గ్రామస్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని