Crime News: దేవాలయాల్లో ఉత్సవాలకు వెళ్లి 75 ఏళ్ల వృద్ధురాలి హస్తలాఘవం

దేవాలయాల్లో విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొని భక్తుల మెడల్లో బంగారం గొలుసులు చోరీకి పాల్పడుతున్న 75 ఏళ్ల వృద్ధురాలిని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పోలీసులు గుర్తించారు.

Updated : 29 May 2022 08:55 IST

నందిగామ, న్యూస్‌టుడే: దేవాలయాల్లో విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొని భక్తుల మెడల్లో బంగారం గొలుసులు చోరీకి పాల్పడుతున్న 75 ఏళ్ల వృద్ధురాలిని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన 75 ఏళ్ల జవంగుల సరోజిని పాత నేరస్థురాలు. నందిగామ మండలం చెర్వుకొమ్ముపాలెం, అంబారుపేట గ్రామాల్లో మార్చి 28, మే 7న నూతన దేవాలయాల్లో విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సరోజిని భక్తుల మెడల్లోని 99 గ్రాముల 3 బంగారు గొలుసులను చోరీ చేసింది. బాధితులు వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన భుదాటి లక్ష్మీబాయి, నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన బాణాల హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం నిందితురాలిని పట్టుకొని ఆమె నుంచి మూడు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. వృద్ధురాలు కావడంతో నిందితురాలికి 41 నోటీసు జారీ చేశారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన హెడ్‌కానిస్టేబుల్‌ నాగరాజు, కానిస్టేబుల్‌ కిషోర్‌బాబుకు సీఐ రివార్డులు అందజేశారు. ఎస్సై సురేష్, ఏఎస్సై నాగేశ్వరరావు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని