logo
Updated : 27 Jun 2022 09:22 IST

Vijayawada Benz Circle: సిగ్నల్‌ పడింది...

బెంజిసర్కిల్‌లో నాలుగేళ్ల తర్వాత ఏర్పాటు

ట్రయల్‌ రన్‌ పూర్తి కావడంతో అమల్లోకి..

ఈనాడు, అమరావతి

నగరంలోని కీలకమైన బెంజి సర్కిల్‌లో సిగ్నళ్లు ఏర్పాటయ్యాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత వచ్చాయి. పైవంతెనల నిర్మాణం కోసం గతంలో వీటిని తొలగించారు. ట్రయల్‌ రన్‌ అనంతరం ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో ఇవి వినియోగంలోకి వచ్చాయి. దీంతో ట్రాఫిక్‌ కష్టాలు కొంత వరకు తీరినట్లు అయింది. ఇటీవలి వరకు ట్రాఫిక్‌ పోలీసులే నియంత్రించేవారు. దీని వల్ల వదిలే సమయంలో హెచ్చుతగ్గులు ఉండేవి. సీపీగా కాంతిరాణా వచ్చిన తర్వాత నగరంలోని పలు కూడళ్లలో సిగ్నళ్లను ఆధునికీకరించారు. బెంజిసర్కిల్‌లో ఏర్పాటు కావడంలో బాగా ఆలస్యమైంది. సుమారు ఏడు నెలల సమయం పట్టింది.

సిగ్నళ్ల ఏర్పాటు వీఎంసీ చేపట్టింది. అంచనా వ్యయం రూ.18లక్షలు. బ్రహ్మ ఎలక్ట్రికల్స్‌ సంస్థ 19.3 శాతం లెస్‌కు టెండరు వేసింది. ఈ సంస్థకు, వీఎంసీ మధ్య పని ఒప్పందం కూడా పూర్తి అయింది. ఏప్రిల్‌, 1 నుంచి పనులు మొదలు కావాల్సి ఉంది. కానీ గుత్తేదారు పని మొదలు పెట్టలేదు. గిట్టుబాటు కాదని వెనక్కి వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వీఎంసీ అధికారులు గుత్తేదారుకు మూడు నోటీసులు ఇచ్చారు. ఎట్టకేలకు చివరి తాఖీదుకు దిగివచ్చి పని పూర్తి చేశారు.

* కూడలిలో నాలుగు వైపులా రెండేసి సిగ్నళ్ల చొప్పున మొత్తం ఎనిమిది బిగించారు. దూరంగా ఉన్నప్పుడు చూసేందుకు, దగ్గరకు వచ్చిన తర్వాత కనిపించేలా ఏర్పాటు చేశారు. పాదచారుల కోసం నాలుగు వైపులా ఎల్‌ఈడీ తెరలను కూడా బిగించాల్సి ఉన్నా ప్రస్తుతానికి మినహాయించారు. టెండరు షరతుల్లో నగరపాలక సంస్థ బోర్డులు అని మాత్రమే పేర్కొంది. స్పష్టత కొరవడడంతో వీటి ఖర్చు ఎక్కువ అవుతుందని గుత్తేదారు చేతులెత్తేశారు. దీంతో ఈ పనిని తొలగించారు.

* ఎటు వైపు నుంచి వాహన రద్దీ ఎలా ఉంది? ఎంత సమయం ఇవ్వాలి?, తదితర అంశాలపై ట్రాఫిక్‌ పోలీసులు నాలుగు రోజుల పాటు ట్రయల్‌ రన్‌, ఆడిట్‌ నిర్వహించారు. ఇందులో ఫకీర్‌గూడెం, పటమట వైపు నుంచి ఎక్కువ వాహన రద్దీ ఉంటోందని తేలింది. ఈ నేపథ్యంలో రోజులో మూడు రకాలుగా సమయాలను సెట్‌ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రద్దీ విపరీతంగా ఉంటుంది. ఉదయం 6 నుంచి 8 గంటలు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు తిరిగి రాత్రి 8 నుంచి 10 గంటల వరకు రద్దీ మోస్తరుగా ఉంటోంది. రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 12 వరకు సిగ్నళ్లకు సమయం కేటాయించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు సిగ్నళ్లను ఆపి, కేవలం బ్లింకర్లను మాత్రమే ఆన్‌ చేస్తారు. గరిష్ఠంగా 60 సెకన్ల నుంచి కనిష్ఠంగా 30 సెకన్ల వరకు సమయం ఇచ్చారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts