logo

అయ్యో రామా..!

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఈనెల 29న నిర్వహించనున్న తెదేపా మినీ మహానాడుకు వెళ్లే మార్గంలో బహిరంగ సభా ప్రాంగణానికి కూత వేటు దూరంలోని బొమ్ములూరులో గల మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి వైకాపా

Published : 28 Jun 2022 05:53 IST

ఎన్టీఆర్‌ విగ్రహ దిమ్మెకు వైకాపా రంగులు
మినీ మహానాడు వేదిక దారిలో కవ్వింపు చర్యలు
గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే


విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ మంత్రి పిన్నమనేని, ఎమ్మెల్సీ బచ్చుల తదితరులు

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఈనెల 29న నిర్వహించనున్న తెదేపా మినీ మహానాడుకు వెళ్లే మార్గంలో బహిరంగ సభా ప్రాంగణానికి కూత వేటు దూరంలోని బొమ్ములూరులో గల మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి వైకాపా నాయకులు తమ పార్టీ రంగులు వేయడం సోమవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మినీ మహానాడుకు రెండు రోజులుండగా బొమ్ములూరులోని మచిలీపట్నం రహదారి పక్కనే ఉన్న అన్న ఎన్టీఆర్‌ విగ్రహం దిమ్మెకు స్థానిక వైకాపా నాయకులు అధికార పార్టీ రంగులు వేశారు. విషయం తెలుసుకున్న తూర్పు కృష్ణా డెల్టా ప్రాజక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు గుత్తా శివరామకృష్ణ(చంటి), తెదేపా గుడివాడ మండల అధ్యక్షుడు వాసే మురళీతోపాటు మరి కొందరు వైకాపా నాయకుల్ని అడ్డుకున్నారు. వైకాపా నాయకులు గుత్తా నాని, యార్లగడ్డ సత్యభూషణ్‌ మరి కొందరు వారితో వాగ్వాదానికి దిగారు. ఇది తమ నాయకుడు కొడాలి నాని ఏర్పాటు చేసిన విగ్రహం అని.. దానికి తమ పార్టీ రంగులు వేస్తామని గొడవకు దిగారు. దానికి తెదేపా నాయకులు వారించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి నినాదాలు చేయడంతో వైకాపా నాయకులు అతనిపై దాడికి దిగారు. గుత్తా చంటి, మురళీ తదితరులు వైకాపా వారు వేసిన రంగులపై థిన్నర్‌ పోసి తొలగించి దిమ్మెకు పసుపు రంగులు వేయిస్తుండగా మళ్లీ వైకాపా వర్గీయులు వచ్చి పెయింటర్‌పై దాడికి దిగారు. ఈ క్రమంలో మహానాడు సభా ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, గుడివాడ సహకార పట్టణ బ్యాంకు ఛైర్మన్‌ పిన్నమనేని పూర్ణ వీరయ్య(బాబ్జి), పార్టీ కార్యకర్తల విభాగం రాష్ట్ర నేత శిష్ట్లా లోహిత్‌, తదితర నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది అప్రజాస్వామికమని ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు.


దిగజారుడు రాజకీయాలు మానండి

- పిన్నమనేని వెంకటేశ్వర రావు, మాజీ మంత్రి

రాష్ట్రంలో మూడేళ్లుగా హిట్లర్‌ పాలన కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాలను నోరెత్తనీయడంలేదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఎన్టీఆర్‌ విగ్రహానికి వైకాపా రంగులు వేయడం హేయం. ఇప్పటికైనా ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. గుడివాడ పట్టణంలో తెదేపా ఫ్లెక్సీలను తొలగించి వైకాపా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది మీ పార్టీ నీచ రాజకీయాలకు నిదర్శనం.


దౌర్జన్యాలకు భయపడం

- బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ

వైకాపా నాయకుల దౌర్జన్యాలకు భయపడేది లేదు. మహానాడుకు వెళ్లే దారిలో తెదేపా నాయకుల్ని రెచ్చగొట్టేందుకు వైకాపా నాయకులు నీతిమాలిన పనులు చేయడం ఆపాలి. రంగులు వేసి రచ్చ చేయాలని చూస్తే సహించేది లేదు. సిగ్గులేని రాజకీయాలు మానుకోవాలి. అన్న ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఇలాంటి పనికిమాలిన చర్యలు మాని శతజయంతి ఉత్సవాల పేరుతో ఊరూరా విగ్రహాలు ఏర్పాటు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని