logo

అత్యాచారం కేసులో నిందితునికి పదేళ్ల జైలు

అత్యాచారం కేసులో నిందితునికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం జి.కొండూరు మండల పరిధిలోని గురురాజుపాలెం గ్రామానికి చెందిన జి.నాగరాజు ఆగస్టు 25, 2017న

Published : 29 Jun 2022 04:51 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: అత్యాచారం కేసులో నిందితునికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం జి.కొండూరు మండల పరిధిలోని గురురాజుపాలెం గ్రామానికి చెందిన జి.నాగరాజు ఆగస్టు 25, 2017న అదే గ్రామానికి చెందిన ఓ వివాహితపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే ఊరుకోనంటూ బెదిరించి వెళ్లాడు. అతను మళ్లీ 27వ తేదీని ఇంటికి రావడంతో ఆమె ఎదిరించి కేకలు వేయడంతో అక్కడున్న కర్రతో దాడి చేసి పారిపోయాడు. ఈ సంఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. దీనిపై పోలీసులు విచారణ నిర్వహించారు. నిందితునిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ 9వ అదనపు జిల్లాసెషన్స్‌ జడ్జి డాక్టర్‌ షేక్‌ మహ్మద్‌ ఫజలుల్లా మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ భోగిరెడ్డి వెంకన్నబాబు వాదనలు వినిపించారు.

హత్యాయత్నం కేసులో..

మచిలీపట్నం కార్పొరేషన్‌: హత్యాయత్నం కేసులో నిందితునికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం పమిడిముక్కల మండలం, బొడ్డువానిగూడెంకు చెందిన వి.దావీదు.. మచిలీపట్నం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఓ దివ్యాంగురాలిని వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చి అత్తవారింటి వద్దే నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్ల తరువాత అతనికి ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. తర్వాత నుంచి భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో నవంబరు 30, 2017న ఆమె మెడకు చున్నీ బిగించి చంపడానికి యత్నించారు. దీనిపై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ నిర్వహించగా నిందితునిపై నేరం రుజువు కావడంతో, హత్యాయత్నం కేసులో మూడేళ్ల జైలుశిక్ష, రూ.1,000 జరిమానా, వేధింపుల కేసులో రెండేళ్ల జైలుశిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి అరుణ మంగళవారం తీర్పు చెప్పారు. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని పేర్కొన్నారు. ఏపీపీ అడపా మురళీ ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని