logo

ఉద్యోగాల పేరుతో వల.. యువత విలవిల

ప్రభుత్వ కొలువులకు ఉండే డిమాండే వేరు. అవకాశం ఉంటే వీటిల్లో చేరాలనుకునే వారు కోకొల్లలు. వీటికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అందినకాడికి దోచుకునే వారు ఎక్కువయ్యారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో స్మార్ట్‌గా మోసం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

Updated : 29 Jun 2022 06:23 IST

ఈనాడు - అమరావతి

ఉద్యోగ ప్రకటనల కోసం సంబంధిత శాఖల వెబ్‌సైట్లను తరచూ చేసే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో నకిలీ సైట్లు రూపొందించడం చాలా సులువు కావడంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మోసగాళ్లు తాము ఎంచుకున్న ప్రభుత్వ శాఖ, సంస్థను పోలి ఉండేలా రూపొందిస్తున్నారు. సైట్‌ చిరునామా కూడా ఇంచుమించు అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెబ్‌ను హోస్ట్‌ చేసే సంస్థలు చాలా వచ్చాయి. చాలా చౌకగా వెబ్‌సైట్లు రూపొందించుకునేందుకు సాయం చేస్తున్నారు. కేవలం రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలు లోపే తయారు చేసుకునే అవకాశం ఉంది. దీంతో కేటుగాళ్లు పెద్ద కష్టం లేకుండానే తక్కువ ఖర్చుతో మోసాలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వ కొలువులకు ఉండే డిమాండే వేరు. అవకాశం ఉంటే వీటిల్లో చేరాలనుకునే వారు కోకొల్లలు. వీటికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అందినకాడికి దోచుకునే వారు ఎక్కువయ్యారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో స్మార్ట్‌గా మోసం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వ శాఖలకు సంబంధించి నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి.. అచ్చు అసలుదే అని తలపించేలా భ్రమింపజేస్తున్నారు. ఇంకేం.. వీటిని అడ్డం పెట్టుకుని నిరుద్యోగులను మాయగాళ్లు మోసం చేస్తున్నారు. అప్పోసొప్పో చేసి ఇటువంటి వారికి సొమ్ము ధారపోస్తున్నారు.

ఉద్యోగాల పేరుతో వల...

* ఇటీవల రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వెబ్‌సైట్‌కు నకిలీ వచ్చింది. ఇందులో శాఖలో వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటన ఉంది. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. దీనికి క్యూఆర్‌ కోడ్‌ను ఇచ్చారు. దీనిని స్కాన్‌ చేసి రుసుము చెల్లించాలని సూచించారు. ఈ సైట్‌ నిజమే అని నమ్మి పలువురు దరఖాస్తు చేశారు. ఒక్కొక్కరు ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ. 950 చెల్లించారు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, ఆ సైట్‌ నకిలీదిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సైట్‌ను బ్లాక్‌ చేయించారు.

* సీఆర్‌డీఏ పేరున ఓ నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించి, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేసిన ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. నిందితుడు పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. సీఆర్‌డీఏలో పొరుగు సేవల పద్ధతిలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చాడు. దీనికి స్పందించి పలువురు నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. ఎంకిపైన వారికి ఇంటర్వ్యూలు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు సమాచారం పంపించాడు. వైబ్‌సైట్‌లోకి వెళ్లి రూ. 5 వేలు చెల్లించమని సూచించాడు. దీనికి స్పందించి ఒక్కొక్కరు రూ. ఐదు వేలు చొప్పున చెల్లించారు. కొందరు అనుమానంతో సీఆర్‌డీఏ కార్యాలయాన్ని సంప్రదించారు. విషయం తెలుసుకున్న అధికారులు వెబ్‌సైట్‌ చూడగా.. అది నకిలీదిగా గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిరుద్యోగ యువత పనే!

సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ ఉన్నతికి ఉపయోగించుకోవాల్సిన పలువురు యువకులు దారితప్పి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది. సీఆర్‌డీఏ సకిలీ సైట్‌ను పూర్వ ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు. ఇంజినీరింగ్‌ చదువుతూ మధ్యలో మానేశాడు. ఈ యువకుడు ఓ సంస్థకు చెందిన ఉచిత వెబ్‌సైట్‌లో సీఆర్‌డీఏ పేరుతో సైట్‌ రూపొందించాడు. పశుసంవర్ధక శాఖ నకిలీ సైట్‌ విషయంలోనూ రాయలసీమ ప్రాంతానికి చెందిన యువకుడి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. వేరొకరి బ్యాంకు ఖాతాను తీసుకుని, క్యూఆర్‌ కోడ్‌కు అనుసంధానం చేశాడు. దరఖాస్తు చేసే వారు చెల్లించే మొత్తం ఆ ఖాతాకు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు