logo

సామాజిక దొంగలు

హలో.. మీ పేరు రామారావండి.. అవును సర్‌ చెప్పండి..  ఒక బహుళ జాతి కంపేనీ వారు ఇటీవల తీసిన లాటరీలో మీ ఫోన్‌ నెంబరుకు కారు వచ్చిందండి. మీ బహుమతి కోసం దాని ధరలో 10 శాతం పన్ను చెల్లించాలి. ఫలానా నెంబరుకు ఫోన్‌ చేయండని చెప్తారు. అత్యాశతో మీరు వారి బ్యాంకు ఖాతాలో నగదు వేస్తే తర్వాత రోజు నుంచి ఆ ఫోన్‌ పని చేయదు. ప్రస్తుతం కొనసాగుతున్న సైబర్‌ నేరగాళ్ల అక్రమాలకు ఇదో చక్కని ఉదాహరణ.

Published : 29 Jun 2022 04:51 IST

సందేశాలు, లింకులు క్లిక్‌ చేస్తే ఖాతాలు ఖాళీ

పెరుగుతున్న సైబర్‌ నేరాలు 

 

న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం

హలో.. మీ పేరు రామారావండి.. అవును సర్‌ చెప్పండి..  ఒక బహుళ జాతి కంపేనీ వారు ఇటీవల తీసిన లాటరీలో మీ ఫోన్‌ నెంబరుకు కారు వచ్చిందండి. మీ బహుమతి కోసం దాని ధరలో 10 శాతం పన్ను చెల్లించాలి. ఫలానా నెంబరుకు ఫోన్‌ చేయండని చెప్తారు. అత్యాశతో మీరు వారి బ్యాంకు ఖాతాలో నగదు వేస్తే తర్వాత రోజు నుంచి ఆ ఫోన్‌ పని చేయదు. ప్రస్తుతం కొనసాగుతున్న సైబర్‌ నేరగాళ్ల అక్రమాలకు ఇదో చక్కని ఉదాహరణ.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చరవాణులు వినియోగిస్తుండడంతో సైబర్‌ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను మంచి సాధనంగా వాడుకుంటున్నారు. చరవాణి కలిగిన ప్రతి వ్యక్తికీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ ఖాతాలతోపాటు పలు రకాల యాప్‌లను వినియోగిస్తున్నారు. ఆయా మాధ్యమాల ద్వారా కొందరు నేరగాళ్లు వారితో పరిచయాలు పెంచుకొని మోసాలకు తెగబడుతున్నారు. ఫోన్‌ కాల్‌ లేదా మెసేజ్‌ లింక్‌తో మన బ్యాంకు ఖాతాలో నగదు మాయం చేసే ముఠాలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి.

కొన్ని ఉదంతాలు

* గుడివాడలో ఇటీవల అధికార పార్టీ నాయకుడు మట్టా జాన్‌ విక్టర్‌ పేరుతో నకీలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించి అతని స్నేహితులకు కష్టాల్లో ఉన్నాను.. అప్పు కావాలని సందేశాలు పంపించి అందినకాడికి దోచేశారు. ఓ వ్యక్తి నీ ఖాతాలో డబ్బులేశాను అందాయా అని విక్టర్‌ను అడిగే వరకూ అతనికి ఈ కేటుగాళ్ల పని తెలీయలేదు.

* గుడివాడలోని ప్రముఖ కళాశాలలో పని చేస్తున్న భౌతికశాస్త్ర అధ్యాపకురాలికి లాటరీ తగిలిందని చిన్న కవరులో స్క్రాచ్‌ కార్డు పంపారు. దాన్ని గీకగా.. మీకు కారు వచ్చింది, దానికి పన్ను కట్టాలని చెప్పి రూ.20 వేలకుపైగా దోచుకున్నారు.

* గుడివాడలోని ఒక కళాశాల అధ్యాపకుని ఏటీఎమ్‌ కార్డు వివరాలు తెలుసుకొని ఖాతా నుంచి రూ.50 వేలు దోచేశారు.

* బాలు అనే వ్యాపారికి చెందిన క్రెడిట్‌ కార్డును ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌కు జతచేయగా దాని నుంచి సూమారు రూ.లక్ష మాయమయ్యాయి.

జిల్లాలో ఈ ఏడాది 40కిపైగా ఘటనలు

కృష్ణా జిల్లాలో సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆన్లైన్‌ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వారిలో కొందరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇంత వరకూ పోలీసులకు ఫిర్యాదులు అందిన నేరాలను పరిశీలిస్తే.. సామాజిక మాధ్యమాల నేరాలు 11, వర్కు ఫ్రమ్‌ హోమ్‌ 2, లోన్‌ యాప్‌ల ద్వారా 6, ఓటీపీ పేరుతో 11, ఓఎల్‌ఎక్స్‌ 1తోపాటు మరో 10 ఆన్లైన్‌ మోసాలు నమోదయ్యాయి. కేసులు నమోదు కానివి చాలా ఉన్నాయి.

ఉపాధి, షాపింగ్‌ పేరుతో..

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న గుడివాడ మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన కె.మణి కుమార్‌ ఆన్‌లైన్‌లో ఉద్యోగాలను వెతకగా.. ఓ ఎయర్‌లైన్స్‌ కంపెనీ పేరుతో అతనికి కాల్‌ లెటర్‌ వచ్చింది. అందులో ఆకర్షణీయమైన జీతం ఉంది. సెక్యూరిటీ కింద కొంత నగదు జమ చేయాలని కోరగా వెంటనే అతడు తన తండ్రి ఖాతా నుంచి రూ.94,250 నగదు బదిలీ చేశాడు. అయితే అందులో రూ.42 వేలు మాత్రమే నేరస్థుడు బదిలీ చేసుకొని రెండో విడతలో విఫలమయ్యాడు. దీనిపై గుడివాడ తాలూకా పోలీసులు కేసు నమోదుచేశారు.

* గుడివాడ పట్టణం సత్యనారాయణపురంలో ఓ.లహరి అనే యువతి కూడా ఆన్లైన్‌లో షాపింగ్‌ చేస్తూ చరవాణికి వచ్చిన ఓ లింక్‌ను నొక్కింది.. అంతే గతంలో తను వస్తువులు కొనడానికి వాడిన తన తండ్రి బ్యాంకు ఖాతాలోని రూ.50 వేలను నేరగాళ్లు నొక్కేశారు. ఆమె టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించింది.

జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌ 1930

ప్రజలకు పూర్తి సహకారాన్ని అందించి ఆర్ధిక నేరాలను నిరోధించడానికి కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ 1930తో జాతీయ సైబర్‌ నేర నియంత్రణ హెల్ప్‌లైన్‌ నెంబరును ఏర్పాటు చేసింది. సైబర్‌ నేరాలపై ఫిర్యాదు చేయడానికి బాధితులు దీన్ని వాడుకోవచ్ఛు 1930కి డయిల్‌ చేసిన వెంటనే ప్రాథమిక వివరాలు అడిగి తర్వాత వారు ఎలా మోసపోయారు? నేరం ఎలా జరిగిందో తెలుసుకొని దొంగిలించిన నగదును తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తారు. బాధితులకు వెంటనే వారి ఫిర్యాదు రిఫరెన్స్‌ నెంబరు వారి ఫోన్‌కు పంపిస్తారు. కానీ బాధితుడు నేరం జరిగిన 24 గంటల్లోపే ఫిర్యాదు చేయాలి.

సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 91212 11100

సైబర్‌ క్రైమ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మిత్ర విభాగాన్ని ప్రారంభించింది. పోలీసు స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో బాధితులు తమ ఫిర్యాదులను నేరుగా వాట్సాప్‌ ద్వారా ఈ 91212 11100 నెంబర్‌లో నమోదు చేసుకోవచ్చు.

అవగాహనతోనే అడ్డుకట్ట

అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లు, లింక్‌లను తెరవొద్ధు వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పొందుపరచ రాదు. లాటరీలు పచ్చి మోసం. బహుమతుల కోసం ఆశపడి వాటికోసం పన్ను పేరుతో రూ.వేలల్లో చెల్లించొద్ధు అపరిచితులకు మీ బ్యాంకు పిన్‌, ఓటీపీ ఇవ్వొద్ధు మ్యాట్రిమనీ వెబ్‌ సైట్ల ద్వారా నకిలీ ఫొటోలతో మన వివరాలు సేకరించి మోసం చేస్తారు. అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్‌లో రుణం అందించే అన్ని కంపెనీలకు ఆర్‌బీఐ అనుమతి ఉండదు. అందువల్లే లోన్‌ యాప్‌లకు దూరంగా ఉండాలి.

- పి.జాషువా, ఎస్పీ

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని