logo

పేరుకే పెద్దాస్పత్రి

మత్తుపదార్థాలకు బానిసలు అయినవారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆసుపత్రిలో మత్తు విమోచన కేంద్రాన్ని 2019లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇప్పటివరకు 2,318 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించడంతోపాటు....

Published : 29 Jun 2022 04:51 IST

వసతులు లేవు.. అవసరమైన సిబ్బందీ లేరు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ఎటు చూసినా ఆధునిక భవంతులు, అందుబాటులో అనేక పరికరాలు.. ఇలా అన్నీ ఉన్నా రోగులకు సక్రమంగా వైద్యసేవలు అందని దయనీయ పరిస్థితి జిల్లా ఆసుపత్రిలో నెలకొంది. విభాగాలు ఉన్నాయన్న మాటేగానీ చాలావరకు అలంకారంగా మారిపోతున్నాయి. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మత్తు పదార్ధాల విమోచన కేంద్రం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల ఈ విభాగాన్ని పరిశీలించిన రాష్ట్రస్థాయి అధికారులే కేంద్రం నిర్వహణ పట్ల అసహనం వ్యక్తం చేశారు. అవసరమైన సిబ్బంది లేక మిగిలిన విభాగాల్లో కూడా సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదని రోగులు వాపోతున్నారు.

మత్తుపదార్థాలకు బానిసలు అయినవారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆసుపత్రిలో మత్తు విమోచన కేంద్రాన్ని 2019లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇప్పటివరకు 2,318 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించడంతోపాటు 214మందిని పొగాకు వ్యసనం నుంచి పూర్తిగా విముక్తులను చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ సేవలు పొందిన రోగులపై కూడా సరైన పర్యవేక్షణ ఉండటం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులే తమ పరిశీలనలో గుర్తించడం గమనార్హం. రోగులకు ప్రత్యేకమైన భోజనం అందించాల్సి ఉన్నా ఆ దిశగా కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విభాగంలో సేవలు పొందేవారి కోసం మెడికల్‌ వార్డులో ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేశారు. వీటిని కేవలం వారికోసమే వినియోగించాలని ఉన్నతాధికారులు చెప్పినా ఇప్పటికీ సాధారణ రోగులకు కూడా ఆ విభాగంలో పడకలు కేటాయించి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక వైద్యురాలు, పలువురు సిబ్బంది ఉన్నా ఇంకా అదనపు సిబ్బంది అవసరం ఉందని ఇప్పటికే నివేదించినా ఆదిశగా ఎలాంటి చర్యలు లేవు. కేవలం ఈవిభాగానికి ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయిస్తుంటారు. వాటిని సరిగా వినియోగించుకుంటున్న దాఖలాలు లేవు.

ఆసుపత్రిలో ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఉన్నవారిపై పనిభారం పడుతుండగా రోగులకు అందించే సేవలపై కూడా ప్రభావం చూపుతోంది. ఉన్న వాళ్లను సరు.బాటు చేసి సేవలు అందించాలని అధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఆదిశగా సాగడం లేదు. అన్ని విభాగాల్లో సిబ్బందిలేకుండా ఎలా సేవలు అందించగలమని పలువురు నేరుగా రికార్డులతో వచ్చి ఆర్‌ఎంవో ప్రశ్నించిన సంఘటనలు సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి.


మత్తువిమోచన విభాగంలో సేవలు పొందుతున్న సాధారణ రోగులు

హోమియో, ఆయుర్వేద విభాగాలూ అంతే

జిల్లా ఆసుపత్రిలో హోమియో వైద్యానికి 10బెడ్లు, ఆయుర్వేద విభాగానికి 10బెడ్లు చొప్పున కేటాయించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన పరికరాలు కూడా కేటాయించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రోగులు ఇక్కడ చేరి సేవలు పొందే వారు. ప్రస్తుతం ఈ విభాగాలు మూతపడ్డాయి. కేవలం సేవలు కేవలం ఓపీ వరకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో ఆ విభాగాలకు కేటాయించిన పరికరాలు అన్నీ మూలన పడేయడంతో పాడైపోతున్నాయి.


సమస్యల పరిష్కారానికి కృషి

ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. మత్తువిమోచన కేంద్రంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టాం. ఆ విభాగానికి కేటాయించిన నిధులు వినియోగించుకోకపోవడంతో కొంత వెనక్కువెళ్లిపోయాయి. అలాంటివి పునరావృతం కాకుండా అవసరమైన సేవలు అందించేందుకు కృషిచేస్తాం.

- డా.కృష్ణదొర, ఆర్‌ఎంవో జిల్లా ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని