logo

ముందే కొలువుల కూత

ఇంజినీరింగ్‌ విద్యార్థులు తక్కువ కాలంలో ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఇక రానుంది. రెండో ఏడాది పూర్తవగానే ప్రాంగణ ఎంపికలు నిర్వహించి కొలువులు అందించేలా బహుళజాతి సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి సీవోఈ(సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సు పద్ధతి) ద్వారా ఈ ప్రక్రియలు నిర్వహించనున్నాయి.

Updated : 29 Jun 2022 06:40 IST

4వ సెమిస్టర్‌ పూర్తవగానే ప్రాంగణ ఎంపికలు

కానూరు, న్యూస్‌టుడే

ఇంజినీరింగ్‌ విద్యార్థులు తక్కువ కాలంలో ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఇక రానుంది. రెండో ఏడాది పూర్తవగానే ప్రాంగణ ఎంపికలు నిర్వహించి కొలువులు అందించేలా బహుళజాతి సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి సీవోఈ(సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సు పద్ధతి) ద్వారా ఈ ప్రక్రియలు నిర్వహించనున్నాయి. గతంలో మూడో సంవత్సరం పూర్తవగానే 7, 8 సెమిస్టర్లలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించేవారు. రానున్న రోజుల్లో 5వ సెమిస్టర్‌లోనే జరగనున్న నేపథ్యంలో సాంకేతిక విద్యార్థులు అందుకు తగ్గట్టుగా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.

బహుళజాతి సంస్థలు ఈ తరహా ఎంపికలను అవగాహన ఒప్పందం చేసుకున్న కళాశాలల్లో చేపడుతున్నాయి. ఒప్పందంలో భాగంగా కళాశాలల విద్యార్థులకు తమ సంస్థకు కావాల్సిన అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని చదువుకునే సమయంలోనే అందించి.. 4 సంవత్సరం పూర్తవగానే నేరుగా సంస్థలో పనిచేసేలా శిక్షణ ఇస్తున్నారు.

* సీవోఈలో ఎంపికైన విద్యార్థులకు వార్షికవేతనం రూ.50 వేలు వరకు అదనంగా ఉంటుంది. ● కళాశాలలు బహుళజాతి సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం వల్ల కొత్త టెక్నాలజీలపై అటు అధ్యాపకులకు, విద్యార్థులకు పట్టు పెరుగుతుంది.

ప్రస్తుత ప్రక్రియ ఇలా.. రెండో ఏడాది పూర్తవగానే విద్యార్థులకు సీవోఈ విధానంలో ఎంపికలు నిర్వహిస్తారు. అంటే 5వ సెమిస్టర్‌లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎంపికైన విద్యార్థులకు 3వ ఏడాదిలోనే వారితో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్‌ పూర్తి చేయిస్తారు. అనంతరం 4వ ఏడాదిలోనే వారికి ఇంటర్న్‌షిప్‌ రూపంలో నెలకు రూ.20 వేలు నుంచి 40 వేలు వరకు చెల్లించి సంస్థల లైవ్‌ ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. తద్వారా బీటెక్‌ పూర్తవగానే వారిని సంస్థ శాశ్వత ఉద్యోగిగా నియమించుకుని వార్షిక వేతనం రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు వరకు ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం వర్యూసా, హెక్సావేర్‌, సీటీఎస్‌, విప్రో, ఈప్యాన్‌, హెచ్‌సీఎల్‌, వంటి సంస్థలు ఇప్పుడు జిల్లాలోని కొన్ని కళాశాలల్లో ఈ తరహా ప్రాంగణ ఎంపికలు ప్రారంభించాయి.


టెక్నాలజీకి అనుసంధానంగా అభ్యసనం

రెండో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికలు మొదలవడం వల్ల విద్యార్థులు టెక్నాలజీని అనుసంధానం చేసుకుని చదవాల్సిన అవసరం ఉంటుంది. వార్షిక వేతనం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కొత్త టెక్నాలజీలైన ఏఐఎంఎల్‌, పెగా వంటి వాటిపై పనిచేసే అవకాశం కలుగుతుంది. జిల్లాలో ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యింది.

- ఎన్‌వీ సురేంద్రబాబు, ఏపీటీపీవో సంఘం ప్రధాన కార్యదర్శి


చదువు పూర్తయ్యేలోగా ఉద్యోగం

5వ సెమిస్టర్‌లోనే విద్యార్థితో సర్టిఫికేషన్‌ పూర్తి చేయించడం వల్ల చదువు పూర్తయ్యే లోగా అతడు నైపుణ్యం పెంచుకుంటాడు. కళాశాలలో ఉన్న అధునాతన ప్రయోగ శాలలను మరింత అభివృద్ధి చేసుకోవచ్ఛు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను వారికి అందించే అవకాశం ఉంటుంది. వారికి నాల్గో ఏడాది నుంచే ఇంటర్న్‌షిప్‌ రూపంలో కొలువు సంపాదించే అవకాశం ఉంటుంది.

- కె.సాయిరోహిత్‌, ఎండీ, రామచంద్రా కళాశాల


శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం

నైపుణ్యం, శిక్షణ ఉన్న కొత్త విద్యార్థులకు సంస్థలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కళాశాలలో ఎంపిక చేసిన తరువాత వారికి శిక్షణకు ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు ఇంజినిరింగ్‌ చదువుతన్న సమయంలోనే సంస్థల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది.

- టెక్‌ మహీంద్ర హెచ్‌ఆర్‌ ప్రతినిధి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని