logo

జగనన్న కాలనీలో... రూ.లక్షకే సెంటు స్థలం

అతను దినసరి కూలీ. ఆయనకు జగనన్న కాలనీలో సెంటు ఇంటి స్థలం వచ్చింది. ఇంతవరకు ప్రభుత్వం ఇల్లు  కట్టించి ఇస్తుందని ఎదురు చూశారు. నిర్మాణం ప్రారంభించకపోతే పట్టా రద్దు చేసి స్థలం వెనక్కి తీసుకుంటామంటూ.. వాలంటీరు నుంచి...

Updated : 30 Jun 2022 09:42 IST

ఈనాడు, అమరావతి

అతను దినసరి కూలీ. ఆయనకు జగనన్న కాలనీలో సెంటు ఇంటి స్థలం వచ్చింది. ఇంతవరకు ప్రభుత్వం ఇల్లు  కట్టించి ఇస్తుందని ఎదురు చూశారు. నిర్మాణం ప్రారంభించకపోతే పట్టా రద్దు చేసి స్థలం వెనక్కి తీసుకుంటామంటూ.. వాలంటీరు నుంచి అధికారుల వరకు హెచ్చరికలు చేస్తున్నారు. వారుఉండే ప్రాంతం నుంచి ఆ లేఔట్‌కు వెళ్లేందుకే దారి ఖర్చులు లేని ఆ కుటుంబం ఇంటి నిర్మాణం చేయలేమని స్థలాన్ని బేరానికి పెట్టారు. మధ్యవర్తితో రూ.1.50లక్షలకు వేరే వ్యక్తులు కొనుగోలు చేశారు. ఆ ఇంటికి వచ్చే రూ.1.80లక్షల రాయితీ కొనుగోలు చేసిన వ్యక్తి తీసుకునేటట్లు ఒప్పందం. విజయవాడ గ్రామీణ మండలం నున్న లేఔట్‌లో జరిగిన సంఘటన.


నున్న కాలనీలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

గనన్న కాలనీలో నివేశన స్థలాలు క్రయ విక్రయాలు జరుగుతున్న విషయం అధికారుల దృష్టికి రావడంతో హెచ్చరికలు చేస్తూ బోర్డులు సైతం కాలనీలో ఏర్పాటు చేశారు. ఇలా స్థలాలు ఎవరైనా విక్రయిస్తే.. స్థలం రద్దు చేస్తామని తహసీల్దార్‌ హెచ్చరించారు.

జగనన్న కాలనీల్లో వందల సంఖ్యలో స్థలాలు  విక్రయించారు. కాలనీలే పూర్తి కాలేదు. మౌలిక వసతులు లేవు. విద్యుత్తు సౌకర్యం లేదు. మంచినీరు, రవాణా(రోడ్డు) లాంటి వసతులు రానేలేదు. జగనన్న కాలనీలో అమ్మకానికి ప్లాట్లు అంటూ.. స్థిరాస్తి వ్యాపారులు వాలిపోతున్నారు. ఇళ్లు కట్టుకోలేని నిరుపేదలు.. ఇంతకు ముందే స్థలం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ప్లాట్లు అమ్మేస్తున్నారు. కేవలం నోటరీ ద్వారా  ఒప్పంద పత్రాలు రాసుకుంటున్నారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని 9 గ్రామాల పేదల కోసం నున్న సమీపంలో లేఔట్‌ వేశారు. ఇక్కడ మొత్తం రెండు లేఔట్లలో 5,250 వరకు నివేశన స్థలాలు ఇచ్చారు. ప్రైవేటు భూమి సేకరించి జగనన్న లేఔట్‌ వేశారు. 73.35 ఎకరాల్లో మొత్తం 4,149 మందికి సెంటు చొప్పున పట్టాలు జారీ చేశారు. ఇక్కడ ఎకరం ప్రైవేటు భూమి రూ.60లక్షలు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరో లేఔట్లలో 20.4 ఎకరాల్లో 1105 మందికి స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఎకరం రూ.35లక్షల చొప్పున సేకరించింది. స్థోమత ఉన్నవారు ఇంటికి రూ.5లక్షల నుంచి రూ.9లక్షల వరకు వ్యయం చేసి ఇంటిని నిర్మించుకున్నారు స్థోమత లేని పేదలు, గతంలోనే ఇళ్లు ఉన్న వ్యక్తులు బేరాలు పెట్టారు. సహజంగా ఏజెంట్లు పుట్టుకొచ్చారు. విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. సెంటు స్థలం రూ.1.50లక్షలకు కొనుగోలు చేస్తున్నారు.  పక్కపక్కనే ఉన్న స్థలాలు కలిపి కొంతమంది కొనుగోలు చేస్తున్నారు.  విజయవాడ అర్బన్‌ పరిధిలో పేదలకు పెనమలూరు మండలం వణుకూరులో స్థలాలు కేటాయించారు. అధికారులు ఎంత వత్తిడి తెచ్చినా ఇక్కడి నుంచి వెళ్లి నిర్మాణం చేసుకోవడం కష్టమైపోతోందని వాపోతున్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన పేదలకు కేటాయించారు. దాదాపు 4వేల మందికి కొండను తొలిసి లేఅవుట్‌ వేశారు. అక్కడికి వెళ్లేందుకే రోజుకు రూ.200 ఖర్చు అవుతున్నాయని అక్కడ ఒక్క నిర్మాణం ప్రారంభం కాలేదు. వాటిని ముందే బేరాలకు పెడుతున్నారు.  


విజయవాడ అర్బన్‌ ప్రాంత వాసులకు వెలగలేరు వద్ద దాదాపు 6వేల మందికి లేఔట్‌ వేశారు. ఇక్కడికి వెళ్లి ఇళ్లు నిర్మాణం చేసుకోలేమంటూ.. అమ్మకానికి పెడుతున్నారు. పల్లవాని తిప్ప లేఅవుట్లలో ఇదే పరిస్థితి ఉంది. కొండపల్లి లేఅవుట్‌లో 1516 మందికి పట్టాలు ఇచ్చారు. ఇక్కడ రూ.1.50లక్షల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రూ.10స్టాంపు పత్రంపై ఒప్పందం రాసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పటికే 30 వరకు అమ్మకాలు జరిగాయి. ఇబ్రహీంపట్నంలో 1602 మందికి లేఅవుట్‌ వేశారు. ఇది సమీపంలో ఉండటంతో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు విక్రయిస్తున్నారు. 25 ప్లాట్లు వరకు విక్రయాలు జరిగినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని