logo

టెర్మినల్‌ పనుల్లో జాప్యం వాస్తవమే : ఎంపీ

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న శాశ్వత ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని విమానాశ్రయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌, ఎంపీ బాలశౌరి అన్నారు.

Updated : 02 Jul 2022 07:04 IST

- మనోహరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి

అధికారులతో చర్చిస్తున్న బాలశౌరి, పక్కన ఏపీడీ రామారావు తదితరులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న శాశ్వత ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని విమానాశ్రయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌, ఎంపీ బాలశౌరి అన్నారు. విమానాశ్రయం ఆవరణలో కొనసాగుతున్న పనులను డైరెక్టర్‌ పీవీ రామారావుతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నుంచి ఉపశమనం అనంతరం కూడా పనులు నత్తనడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమస్యను కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రస్తుతం 80శాతం పూర్తవ్వాల్సిన పనులు కేవలం 22శాతమే పూర్తయ్యాయన్నారు. సుమారు రూ.500కోట్లతో చేపట్టే టెర్మినల్‌ భవనం అందుబాటులోకి వస్తే దేశీయ, విదేశీ సేవలను ఒకే వేదికగా అందించేందుకు.. విమాన సర్వీసుల పెరుగుదలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. రానున్న జూన్‌, జులై నాటికి పూర్తిస్థాయిలో భవనాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారన్న ఎంపీ.. సమస్యను కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని పేర్కొన్నారు.
పనుల పురోగతికి ప్రణాళికలు
విదేశీ, స్వదేశీ సేవలు ప్రస్తుతం వేర్వేరు భవనాల్లో కొనసాగుతున్నాయి. నూతనంగా నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ భవనంతో ఆ రెండు సేవలు ఒకే భవనంలో ప్రయాణికులకు అందనున్నాయి. ఈ నేపథ్యంలో రూ.కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల పురోగతికి నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బాలశౌరి తెలిపారు. 14 ఇమ్మిగ్రేషన్‌, 4క్లస్టమ్స్‌ కౌంటర్లు, 24 చెక్‌ఇన్‌ పాయింట్లు, రాకపోక మార్గాల్లో బ్యాగేజీ కన్వేయర్లు, అంతర్జాతీయ స్థాయి బ్యాగేజీ వ్యాండ్లింగ్‌ వ్యవస్థతో కూడిన నూతన టెర్మినల్‌ నిర్మాణాన్ని ఎన్నిరోజుల్లో పూర్తిచేయగలమనే దానిపై ప్రణాళికలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం..
విమానాశ్రయంలో విమాన సర్వీసుల పెంపుదలపై దృష్టి సారించనున్నట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం దిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియాతో పాటు అదనంగా మరో సర్వీసు, వారణాసికి నూతన, బాంబే సర్వీసు పునరుద్ధరణ, నేరుగా విదేశాలకు నడిచే మస్కట్‌తో పాటు సింగపూర్‌ సర్వీసు పునరుద్ధరణ, దుబాయ్‌, ఇతర గల్ఫ్‌ దేశాలకు నేరుగా ప్రత్యేక సర్వీసులు నడిచే అంశంపై కేంద్రంలోని పెద్దలతో సంప్రదింపులు జరపనున్నట్లు ఎంపీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని