logo

Vijayawada : నడవలేరంటే... పరుగెత్తి చూపారు

జీవితంలో ఇంక నడవలేరంటూ వైద్యులు తేల్చేశారు. మంచానికే నెలల తరబడి పరిమితమయ్యారు. ఆరు పదుల వయసు కావడంతో మానసికంగా, శారీరకంగా తీవ్రంగా కుంగిపోయారు. ఆ సమయంలోనే పట్టుదలతో ప్రయత్నం చేస్తే జీవితం సరికొత్తగా ఆరంభించొచ్చని ఓ పుస్తకం ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన జీవితం

Updated : 01 Aug 2022 07:40 IST

ఆరు పదుల వయసులో వైద్యులకే షాక్‌

ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న రమేష్‌బాబు

ఈనాడు, అమరావతి

జీవితంలో ఇంక నడవలేరంటూ వైద్యులు తేల్చేశారు. మంచానికే నెలల తరబడి పరిమితమయ్యారు. ఆరు పదుల వయసు కావడంతో మానసికంగా, శారీరకంగా తీవ్రంగా కుంగిపోయారు. ఆ సమయంలోనే పట్టుదలతో ప్రయత్నం చేస్తే జీవితం సరికొత్తగా ఆరంభించొచ్చని ఓ పుస్తకం ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. వైద్యులే ఆశ్చర్యపోయేలా.. ప్రస్తుతం నడవడం కాదు.. ఏకంగా పరుగులు పెడుతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెంకు చెందిన ఆర్‌.రమేష్‌బాబు(62) జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.

రమేష్‌బాబుకు భార్య, కూతురు ఉన్నారు. రిటైల్‌ రంగంలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. 2010లో జరిగిన ఓ ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది. కొచ్చిలో ఓ సెమినార్‌కు హాజరైనప్పుడు దాదాపు 120 కిలోల బరువున్న ఓ భారీకాయుడు ఒక్కసారిగా రమేష్‌బాబుపై పడిపోయారు. దాంతో కుడి కాలుకు తీవ్ర గాయమైంది. వెన్నెముక దెబ్బతింది. ఆసుపత్రికి తరలించగా.. మూడు శస్త్ర చికిత్సలు చేశారు. నెలల పాటు మంచానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. వైద్యులు కూడా ఏం చేయలేమని, మిగిలిన జీవితం చక్రాల కుర్చీపైనే ఉండాల్సి వస్తుందని తేల్చేశారు. ఆ సమయంలో పరామర్శించడానికి వచ్చిన తన స్నేహితుడు ‘హీల్‌ ది బాడీ.. హీల్‌ ది మైండ్‌’ అనే పుస్తకాన్ని ఇచ్చి చదవమని చెప్పారు. ఆ పుస్తకం చదివిన తర్వాత రమేష్‌బాబులో నిరాశ, నిస్రృహలు పూర్తిగా తొలగిపోయాయి. ప్రయత్నం చేస్తే.. ఇది అసాధ్యం కాదని నిర్ణయంతో ముందుకు సాగారు.

కనీసం నిలబడలేని స్థితి నుంచి..

కనీసం ఏదైనా ఆధారం పట్టుకుంటే తప్ప నిలబడే పరిస్థితి కూడా లేదు. ముందుగా తన మానసిక స్థితిని దృఢంగా మార్చుకున్నారు. ఏదో ఒక ఆధారం పట్టుకుని నిలబడి.. నెమ్మదిగా ఒక్కో అడుగు వేయడం ఆరంభించారు. క్రమంగా ఏ ఆధారం లేకుండా నిలబడడం, అడుగులు వేయడం ఆరంభించారు. అలా ఆరు నెలలు ప్రయత్నించాక.. నెమ్మదిగా నడవ గలిగారు.  ఆ తర్వాత మాత్రం ఆరు గంటల్లోనే 40 కిలోమీటర్లు నడిచారు. తన శరీరాన్ని తాను చెప్పినట్టు వినేలా మార్చుకున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి తిరుపతికి కాలినడకన వెళ్లి వచ్చేయగలరు. 2015లో అమరావతి రన్నర్స్‌ అనే సంస్థను కూడా స్థాపించారు. రన్‌ మైల్స్‌.. స్ప్రెడ్‌ స్మైల్స్‌ అనే నినాదంతో తన జీవితాన్నే ఓ ఉదాహరణగా ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతున్నారు.

చదువు కొనసాగిస్తూ..

ఏ వయసు వారైనా ఏ పనీ చేయకుండా ఉండటం వల్లే సమస్యలన్నీ మొదలవుతాయనేది ఆయన అభిప్రాయం. అందుకే వయసుతో సంబంధం లేకుండా గతేడాది సిద్ధార్థ కళాశాల నుంచి న్యాయవిద్యను పూర్తిచేశారు. ఎంబీఏలో రెండు కోర్సులు చదివి డబుల్‌ పీజీ అందుకున్నారు.


మానసికంగా, శారీరకంగా దృఢంగా..

వ్యాధులన్నింటికీ మూలం ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అతిగా ఆలోచించడమే. వందేళ్ల పాటు నిశ్చింతగా బతికే సామర్థ్యాన్ని ఆ భగవంతుడు అందరికీ ఇస్తాడు. దానిని సంపూర్ణంగా జీవించగలిగే బాధ్యత మనదే. అలాగని నోరుకట్టుకుని కూర్చోనవసరం లేదు. ఏం తిన్నా మితంగా తినాలి. ఎప్పుడూ మనల్ని మనం ఏదో ఒక పనిలో తీరిక లేకుండా ఉంచుకోవాలి. ఈ వయసులో మన పిల్లలకు మనమిచ్చే గొప్ప బహుమతి మనం ఆరోగ్యంగా ఉండడమే. నా కూతురు అమెరికాలో పెద్ద స్థాయి ఉద్యోగంలో ఉంది. ఇక్కడ మనం బాగున్నాం అనే భరోసా ఇస్తేనే వాళ్ల ఎదుగుదలకు తోడ్పడినవారమవుతాం. మనో బలంతో ఏ అనారోగ్యాన్నైనా నయం చేసుకోగలం.  

- రమేష్‌బాబు, విజయవాడ


సైకిల్‌పై సుదీర్ఘ యాత్ర..

కొవిడ్‌ సమయంలో సైకిల్‌ తొక్కడాన్ని ఆరంభించారు. ఆ తర్వాత సైకిల్‌ యాత్రలతో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం మొదలుపెట్టారు. సైకిల్‌పై 200 కిలోమీటర్లతో మొదలై 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. సూపర్‌ రాండరర్‌ అనే టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక పోటీల్లో పాల్గొని పతకాలు అందుకున్నారు. ప్యారిస్‌లో నాలుగేళ్లకు ఓసారి నిర్వహించే పోటీల్లో వచ్చే ఏడాది పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. 2018లో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ వరకూ వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని అనుకున్నట్టే వెళ్లి వచ్చారు. ఎవరెస్ట్‌పై 20,700 అడుగుల వరకూ వెళ్లి వచ్చారు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని పూర్తిగా అధిరోహించడమే తన తర్వాత లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని