logo

Andhra news : 30 కిలోమీటర్లు..ముచ్చెమటలు..

ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన గుడివాడ- విజయవాడ రహదారి పూర్తిగా పాడైంది. పలు చోట్ల కుంగిపోయి.. మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది.

Updated : 05 Aug 2022 07:12 IST

వానపాముల వద్ద కుంగిపోయిన రహదారి

ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన గుడివాడ- విజయవాడ రహదారి పూర్తిగా పాడైంది. పలు చోట్ల కుంగిపోయి.. మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. చాలా ప్రదేశాల్లో రహదారి అంచులు కాల్వలో కలిసిపోయాయి. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఒకే మార్గం కావడంతో రెండు వైపులా పంట కాల్వలతో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పెను ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి. గత రెండేళ్లలో వందల సంఖ్యలో వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. ఆర్టీసీ బస్సులు, ఆటోలు తరచూ అదుపు తప్పి పంటకాల్వలోకి దూసుకెళ్తున్నాయి. ఈ రహదారి గుడివాడ, పామర్రు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో సుమారు 30 కిలోమీటర్ల మేర విస్తరించింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా విజయవాడ, అమరావతివైపు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కైకలూరు, కలిదిండి, భీమవరం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రహదారిపైనే రాకపోకలు సాగిస్తారు. వెంట్రప్రగడ వద్ద దోసపాడు కాల్వపై ప్రధాన వంతెన శిథిలావస్థకు చేరింది. ఈ కూడలి ప్రమాదాలకు కేంద్రంగా మారింది. ఆయా గ్రామాల అడ్డరోడ్ల వద్ద అంచులు ఆక్రమణకు గురయ్యాయి. ఈ రహదారిని రెండు వరుసలుగా విస్తరించి అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ పనులపై దృష్టి సారించలేదు. దీనిపై ఆర్‌ అండ్‌బీ ఏఈఈ సీహెచ్‌.కిషోర్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా గుడివాడ నుంచి కంకిపాడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణ, అభివృద్ధికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు.

- న్యూస్‌టుడే, పెదపారుపూడి


ఎదురెదురుగా వాహనాలు వచ్చిన సమయంలో
దాటాలంటే ఇబ్బందులే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని