logo
Updated : 06 Aug 2022 05:28 IST

నడిరోడ్డుపై యువకుల హల్‌చల్‌

మద్యం మత్తులో వీరంగం
డప్పు కళాకారులతో వివాదం

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైకి దూసుకొచ్చిన యువకులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: నడిరోడ్డుపై యువకులు వీరంగం సృష్టించిన సంఘటన చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గన్నవరం వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఏటా శ్రావణమాసంలోని రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని పాతగన్నవరంలో కొలువైన శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి వార్షిక సంబరాల్లో భాగంగా పట్టణంలోని వివిధ కులాలు, ప్రాంతాలకు చెందిన సంఘాలు విడివిడిగా ప్రభలు ఏర్పాటుచేసి ఆలయానికి మేళతాళాలతో ప్రదర్శనగా తరలివస్తాయి. ఈ క్రమంలో శుక్రవారం ప్రభలు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా ప్రదర్శనగా వస్తున్న తరుణంలో చెంచులపేటకు చెందిన యువ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ప్రభ ముందు డప్పు వాయిస్తున్న ఓ కళాకారుడు స్థానిక గౌడపేటకు చెందిన పటమట మహేష్‌ అనే యువకుడు అడ్డుగా వచ్చాడంటూ అతని తలపై చేతిలోని డప్పు, వాయిద్య కర్రతో  బాదాడు. దీంతో యువకుడి తలకు స్వల్ప గాయమవ్వగా అప్రమత్తమైన యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి డప్పుకళాకారులపైకి దూసుకొచ్చారు. ఒక్కసారిగా వందమందికి పైగా యువకులు హైవే పైకి దూసుకురావడంతో అసలేం జరిగిందో స్థానికులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆవేశంతో ఊగిపోయిన యువకులు డప్పు కళాకారుల చేతిలోని వాయిద్య పరికరాలను ధ్వంసం చేశారు. తొలుత గాంధీబొమ్మ కూడలి సమీపంలో మొదలైన వివాదం ప్రదర్శన జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు ప్రభలు చేరుకొనేవరకు సాగింది. యువకుల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన డప్పువాయిద్య  కళాకారుల్లో కొందరు పారిపోగా.. మిగిలిన ఇద్దరు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో తలదాచుకున్నారు. దీంతో డప్పుకళాకారులను తమకు అప్పగించాల్సిందే అంటూ యువకుడు మహేష్‌ సామాజిక వర్గంవారు హైవేపై ఆందోళన చేపట్టారు. ఘటనపై ముందు యార్లగడ్డ, ఎమ్మెల్యే వంశీ వర్గీయుల మధ్య వివాదం అంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. తర్వాత పూర్తి విషయం తెలుసుకోవడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. ఎట్టకేలకు సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్‌, రమేష్‌ బృందం ఇరువర్గాలను అదుపులోకి తీసుకొని వివాదం సద్దుమణిగేలా చర్యలు చేపట్టారు.

పోలీసుల వైఫల్యంతోనే.. 

సుమారు పది ప్రభలు స్థానిక జాతీయ రహదారి మీదుగా తరలివెళ్తున్న సమయంలో పోలీసులు కనీసం ట్రాఫిక్‌ చర్యలు చేపట్టకోవడంతో పాటు యువకులను అదుపు చేయలేకపోవడం గమనార్హం. ముందస్తుగా ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టక పోవడంతోనే యువకులు ఒక్కసారిగా వందమందికి పైగా జాతీయ రహదారిపైకి దూసుకొచ్చారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన కొంత సమయానికే అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దామని సీఐ శివాజి తెలిపారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని