logo

Vijayawada News : చెత్తపన్ను తెస్తేనే జీతం..!

‘విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మేస్త్రీలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, వార్డు హెల్త్‌ సెక్రటరీలు, వార్డు శానిటరీ సెక్రటరీలు, అడ్మిన్‌లు అందరూ డివిజన్లలో యూజర్‌ ఛార్జీలు(చెత్తపన్ను) చెల్లించిన

Updated : 07 Aug 2022 10:20 IST

సిబ్బందికి వీఎంసీ అధికారుల నోటీసులు
ఈనాడు, అమరావతి

‘చెత్త పన్ను చెల్లించేందుకు కొంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని నేను, పేర్ని నాని సీఎం దృష్టికి తీసుకెళ్లాం..! చెత్త పన్ను మున్సిపాలిటీకి కూడా పెద్ద ఆదాయం కాదు..!’
- ఇటీవల గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని చెప్పిన మాటలు ఇవి.
వాస్తవానికి గడపగడపకు కార్యక్రమంలో ఆయన దృష్టికి ప్రజలు చెత్త పన్ను విషయాన్ని తీసుకురాగా.. వసూలు చేయవద్దంటే ఎందుకు చేస్తున్నారంటూ కమిషనర్‌ను ప్రశ్నించారు. అనంతరం మరో మాజీ మంత్రికి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళదామంటూ చెప్పారు.

‘విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మేస్త్రీలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, వార్డు హెల్త్‌ సెక్రటరీలు, వార్డు శానిటరీ సెక్రటరీలు, అడ్మిన్‌లు అందరూ డివిజన్లలో యూజర్‌ ఛార్జీలు(చెత్తపన్ను) చెల్లించిన రశీదులు పొందని పక్షంలో ఆగస్టు నెల వేతనం చెల్లించబోమంటూ వీఎంసీ ప్రజారోగ్య శాఖ ప్రధాన వైద్యాధికారి నోటీసు జారీచేశారు.

చెత్తపన్ను చెల్లించమంటే ప్రజలకు కోపం... జమ చేయలేదంటే అధికారులకు కోపం.. ఆడకత్తెరలో పోక చెక్కలా తయారైంది ఉద్యోగుల పరిస్థితి. పలు పురాల్లో ప్రజాప్రతినిధులే అనధికారికంగా చెత్తపన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ సెలవిస్తున్నారు. విజయవాడలో చెత్తపన్ను పేరుతో ప్రజలనుంచి ఇప్పటికే రూ.3కోట్లవరకు ముక్కుపిండి వసూలు చేశారు. రోడ్డు పక్కన తినుబండారు అమ్ముకునే బడ్డీవ్యాపారుల నుంచి వాణిజ్యం కేటగిరి కింద భారీగా వసూలు చేస్తున్నారు. కానీ గృహయజమానులకు, ఇతర వర్తకులకు చెత్త పన్ను చెల్లించాలని డిమాండ్‌ నోటీసు మాత్రం ఇవ్వలేదు. విజయవాడలో నెలకు రూ.4 కోట్ల వరకు చెత్తపన్ను డిమాండ్‌ ఉంది. గత ఏడాది ఆక్టోబరు నుంచి వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎవరూ చెత్తపన్ను చెల్లించడం లేదు. స్వయంగా వైకాపా కార్పొరేటర్లు చెత్తపన్ను చెల్లించవద్దని సూచిస్తున్నారు. ఇటీవల ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు యూజర్‌ ఛార్జీలపై నిరసన తెగ తగిలింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను పశ్చిమ నియోజకవర్గంలో ఒక యువకుడు ప్రశ్నిస్తే.. అతనిపై కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.

తిరువూరు మున్సిపాలిటీలో 8,18 డివిజన్లలో కేవలం రెండు వార్డుల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తే డిమాండ్‌ రూ.4.90లక్షలు వచ్చింది. వసూలు రూ.2.30లక్షలు వసూలు అయింది. తాడిగప పరిధిలో యనమలకుదురులో అసలు వసూలు చేయడం లేదు. కానూరు, పోరంకి మాత్రమే వసూలు చేస్తున్నారు. పెడనలో పూర్తిగా నిలిపివేశారు.  

యూజర్‌ ఛార్జీలు వసూలు చేయడం చట్టవ్యతిరేకమని ఏపీ పట్టణ పౌరసమాఖ్య కన్వీనర్‌ చిగురుపాటి బాబూరావు మండిపడ్డారు.  ఆస్తిపన్నులోనే చెత్తసేకరణకు కలిపి పట్టణవాసులు పన్నులు చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. నోటీసులు ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

వీఎంసీ పరిధిలో చెత్త పన్ను ఒక్క పోర్షన్‌కు రూ.120 చొప్పున విధిస్తున్నారు. ఒక ఇంటిలో ఎన్ని పోర్షన్లు ఉంటే.. అంత చెల్లించాల్సిందే. అద్దెకు ఇవ్వకుండా ఖాళీగా ఉన్నా సరే తప్పదు.

మురికివాడల్లో పోర్షన్‌కు రూ.60 వసూలు చేస్తున్నారు. దీనికి కొన్ని ప్రాంతాల్లో బుట్టలు సరఫరా చేశారు. కొన్ని డివిజన్లలో బుట్టలు ఇవ్వలేదు.  

పట్టణాల్లో కొన్ని చెత్త వాహనాలు మూలన పడ్డాయి. గృహ యజమానులు చెత్తను తీసుకెళ్లి వీధుల్లోని చెత్త కుండీల్లోనే వేస్తున్నారు. నందిగామ, తిరువూరు, తాడిగడప, ఉయ్యూరు, పెడన, కొండపల్లి లాంటి పట్టణాల్లో ఇంకా ఇదే పద్దతి అమలులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని