logo

ఎన్ని దసరాలు వెళుతున్నా..!

ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు జారిపడకుండా ఉండేందుకు చేపట్టే పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021 దసరా వేడుకలకు ముందే శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. కానీ.. 2022 దసరా వేడుకలు సైతం

Published : 08 Aug 2022 03:37 IST

కొండరాళ్ల సమస్యకు ఏదీ శాశ్వత పరిష్కారం

ఇంద్రకీలాద్రిపై మళ్లీ హడావుడి పనులు

ఈనాడు, అమరావతి

2020 దసరా వేడుకల సమయంలో జారిపడిన కొండ చరియలు

ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు జారిపడకుండా ఉండేందుకు చేపట్టే పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021 దసరా వేడుకలకు ముందే శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. కానీ.. 2022 దసరా వేడుకలు సైతం వచ్చే నెలలో ఆరంభం కానున్నా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినా ఇంతవరకు అధికారులు అమలు చేయలేకపోయారు. కేవలం నాలుగైదు నెలల్లో పూర్తిచేయాల్సిన పనులను కనీసం ఈ వర్షాకాలానికి ముందైనా.. ముగించి ఉంటే బాగుండేది. ఒకవైపు అల్పపీడనాలతో వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు ఇంద్రకీలాద్రి కొండరాళ్లకు మరమ్మతు పనులను ప్రస్తుతం చేపడుతున్నారు. ఘాట్‌రోడ్డుపై రాకపోకలను నిలిపేసి మరీ వర్షాకాలంలో రాక్‌మిటిగేషన్‌ పనులు చేపట్టడం దుర్గగుడి అధికారుల ప్రణాళికా లోపానికి ప్రత్యక్ష నిదర్శనం.

దుర్గగుడిలో 2020 అక్టోబరు 21న దసరా ఉత్సవాలు జరుగుతుండగా.. ఒక్కసారిగా కొండరాళ్లు జారి పడ్డాయి. భక్తులు క్యూలైన్ల సమీపంలోని సమాచార కేంద్రం వద్దే ఈ ఘటన చోటుచేసుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ రావడానికి కొద్దిసేపటి ముందే ఈ ప్రమాదం జరిగింది. తర్వాత అక్కడు చేరుకున్న సీఎం వచ్చే దసరా నాటికి కొండరాళ్లు జారిపడకుండా శాశ్వతంగా పరిష్కరిస్తామని ప్రకటించారు. దీంతో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.70 కోట్లను ప్రభుత్వం తరఫున మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. రెండేళ్లయినా కనీసం పనులను కూడా ఆరంభించలేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన డబ్బులు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఈ పనులను పట్టాలెక్కించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో గత దసరా ముందు హడావుడిగా దుర్గగుడి డబ్బులతోనే రాక్‌ మిటిగేషన్‌ పనులను ఆరంభించారు. కొద్దిగా పనులు చేపట్టేలోగా.. దసరా వచ్చేయడంతో మధ్యలోనే ఆపేశారు. వేడుకల తర్వాత ఓ మూడు నాలుగు నెలల్లో పూర్తిస్థాయిలో దృష్టిసారించి ఉంటే పూర్తయిపోయి ఉండేవి. కానీ.. నిధులు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో పాటు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి అలాగే ఉంది.

వేసవికాలంలో వదిలేసి...
ప్రస్తుతం వర్షాలు పడుతుండడం, వచ్చే నెలలో దసరా ఉత్సవాల నేపథ్యంలో మిగిలిపోయిన రాక్‌మిటిగేషన్‌ పనులు ఇప్పుడు చేపడుతున్నారు. 2020లో కొండరాళ్లు పడిన కొద్దిరోజులకు ఓ ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ కూడా వచ్చి ఇంద్రకీలాద్రిని పరీక్షించింది. కొండ రాళ్ల మధ్య ఉన్న మట్టిలోకి నీళ్లు చేరడమే కారణమని గుర్తించింది. శాశ్వత పరిష్కారానికి సూచనలు చేసింది. కమిటీ వచ్చి వెళ్లిన ఏడాది వరకూ పనులు కూడా ఆరంభించకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇస్తామన్న రూ.70 కోట్లలో రూ.6.5 కోట్లను కొండ రాళ్ల సమస్యకు కేటాయించాలని నిర్ణయించారు. నిపుణుల కమిటీ ఇచ్చిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం.. 2020 డిసెంబర్‌ నెలలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత మూడు నాలుగు నెలల్లోనే అన్నీ చేస్తామన్నారు. కానీ.. ఇప్పటికి ఏడాదిన్నర దాటుతోంది.. ఇంకా రాక్‌ మిటిగేషన్‌ పనులే సాగుతున్నాయి.

కొండపైన కాలువ నిర్మించాలని..
కొండపై నుంచి రాళ్లు జారిపడకుండా శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలంటే.. మూడు పద్ధతుల్లో చర్యలు చేపట్టాలని నిపుణుల కమిటీ సూచించింది. వర్షపు నీరు మధ్యలోకి చేరి మట్టి కరిగిపోవడంతో రాళ్లు జారిపడిపోతున్నాయి. మట్టి కరగకుండా ఉండాలంటే కొండ పైభాగంలో ఓ కాలువను నిర్మించి వర్షం నీరు నేరుగా వెనుక వైపు నుంచి కిందకు వచ్చేలా ఏర్పాటు చేయాలి. కొండను పట్టి ఉంచేలా.. ఆలయం, ఘాట్‌రోడ్డు వైపు డబల్‌ ట్విస్టెడ్‌ మెష్‌ను ఏర్పాటు చేయాలి. మొత్తం హైడ్రోసీడింగ్‌ చేయాలి. దానివల్ల పచ్చదనం పెరిగి.. మట్టి జారిపోకుండా పట్టి ఉంటుంది. ఈ మూడు పక్కాగా చేస్తే.. కొండ రాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నిపుణుల కమిటీ సూచించింది. రాష్ట్ర దేవాదాయశాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు ఆధ్వర్యంలో ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మాధవ్‌, బెంగళూరులోని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్‌ శివకుమార్‌, భూ భౌతిక నిపుణులు త్రిమూర్తిరాజుతో కూడిన నలుగురు సభ్యుల బృందం ఆలయం చుట్టూ ఉన్న కీలకమైన 600మీటర్ల కొండను పరిశీలించి మరీ ఈ మూడంచెల ప్రణాళిక అవసరమని సూచించింది. గత దసరా ముందు నుంచీ రాక్‌ మిటిగేషన్‌ పనులనే చేపడుతున్నారు. కొండ పైభాగంలో కాలువ నిర్మాణం, హైడ్రో సీడింగ్‌ పనులు ఎంతవరకు వచ్చాయనేది అధికారులకే తెలియాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని