logo

రూ.57.25 కోట్లు ఏమయ్యాయి..?

కవుతవరం - నిడుమోలు - ఐలూరు(కేఎన్‌ఐ) రహదారి విస్తరణ, అభివృద్ధి ప్రహసనంగా మారింది. పనులు ప్రారంభించి 16 నెలలు దాటినా ఎలాంటి పురోగతి లేకపోవటంతో ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల

Published : 08 Aug 2022 03:37 IST

ముందుకు సాగని కేఎన్‌ఐ రహదారి విస్తరణ
న్యూస్‌టుడే, కూచిపూడి

కవుతవరం - నిడుమోలు - ఐలూరు(కేఎన్‌ఐ) రహదారి విస్తరణ, అభివృద్ధి ప్రహసనంగా మారింది. పనులు ప్రారంభించి 16 నెలలు దాటినా ఎలాంటి పురోగతి లేకపోవటంతో ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల పరిధిలోని మొవ్వ, పమిడిముక్కల, తోట్లవల్లూరు, పామర్రు, గుడ్లవల్లేరు మండలాలను కలుపుతూ వెళ్తున్న ఈ రహదారి దాదాపు 15.5 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉంది. పరిసర మండలాలకు చెందిన వేలాది మంది ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరం. ఈ మార్గంలో .000 నుంచి 11.790 (నిడుమోలు-కౌతవరం) కిలోమీటర్ల వరకు, కూచిపూడి నుంచి ఐలూరు రహదారిలో 24.700 నుంచి 29.440 వరకు రహదారిని విస్తరించడంతోపాటు అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పథకం (ఏపీఆర్‌బీఆర్‌పీ) కింద రూ.57.25 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో గత ఏడాది మార్చి 24న పామర్రు శాసనసభ్యుడు కైలే అనిల్‌కుమార్‌ అధ్యక్షతన అప్పటి మంత్రి కొడాలి నాని పనులు ప్రారంభించారు. ఆ సమయంలో నిడుమోలు నుంచి కౌతవరం వరకూ రెండు వరుసల రోడ్‌గా విస్తరణ చేపట్టి మొదటి పొరగా భూమి పనులు చేశారు. దానికి సంబంధించిన బిల్లు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఆర్‌అండ్‌బీ శాఖ ప్రభుత్వానికి పంపినా ఇంతవరకూ స్పందన లేకపోవడంతో గుత్తేదారు పనులు పూర్తిగా నిలిపేశారు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. అప్పటి నుంచి అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు గానీ పట్టించుకోకపోవటంతో రహదారి మొత్తం భారీ గుంతలు పడ్డాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాటిల్లో నీరు చేరి అగాధాలుగా మారాయి. ఎక్కడ ఎంత లోతుందో తెలియక చోదకులు బిక్కుబిక్కుమంటూ వాహనాలు నడుపుతూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూచిపూడి నుంచి దాదాపు 4.5 కిలో మీటర్ల రహదారి అభివృద్ధిలో భాగంగా మొదటి పొర పనులు కూడా జరగలేదు. ఈ మేరకు మంజూరైన నిధులు ఏమయ్యాయంటూ ప్రయాణికులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


శంకుస్థాపనకే పరిమితమా?
- కోనేరు అజయ్‌బాబు, బార్లపూడి

నిధులు మంజూరై ఏడాదిన్నరవుతోంది. ఇంతవరకూ పనులు చేపట్టలేదు. కూచిపూడి నుంచి బార్లపూడి మధ్య తట్టెడు మట్టి కూడా పోయలేదు. దీంతో అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడ్డాయి. ప్రజలు కనీసం సైకిల్‌పై కూడా ప్రయాణించలేని దుస్థితి నెలకొంది. ఈ రహదారి విస్తరణకు మంజూరైన నిధులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.


నిధులు మంజూరు కాలేదు...
- హరీష్‌, అర్‌అండ్‌బీ జేఈ

తొలి విడత పనులకు సంబంధించిన బిల్లును మంజూరు కోరుతూ ప్రభుత్వానికి సమర్పించాం. ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. గత ఏడాది వర్షాలు కురవడం వల్ల పనులు ఆపాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని