logo

కాసులు కురిపిస్తున్న నిషేధిత భూములు..!

అవి నిషేధిత జాబితాలో ఉన్న భూములు. కానీ అప్పటికే వాటిలో క్రయ విక్రయాలు జరిగాయి. ఎకరం రూ.20కోట్లు వరకు మార్కెట్‌ విలువ ఉన్నవి వదులుకుంటారా..? అందరూ సిండికేట్‌గా మారారు. భారీగా ఖర్చు చేశారు. అంతే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ..

Published : 09 Aug 2022 05:24 IST

అవి నిషేధిత జాబితాలో ఉన్న భూములు. కానీ అప్పటికే వాటిలో క్రయ విక్రయాలు జరిగాయి. ఎకరం రూ.20కోట్లు వరకు మార్కెట్‌ విలువ ఉన్నవి వదులుకుంటారా..? అందరూ సిండికేట్‌గా మారారు. భారీగా ఖర్చు చేశారు. అంతే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రెవెన్యూ వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది.

కానూరు, పోరంకి సర్వేనెంబర్ల పరిధిలో 23.79 ఎకరాలు బ్రిటిష్‌ సంస్థానంలో పనిచేసిన వ్యక్తులకు ఉదారంగా అప్పట్లో బహుమతిగా ఇచ్చారు. దీనికి గిప్టుడీడ్‌లు పురాతన కాలం నాటివి. వీటితో లావాదేవీలు జరిగాయి. వీటిని గమనించిన ఓ రెవెన్యూ అధికారి కన్నేసి అడిగినంత ఇవ్వలేదన్న కారణమో.. ఇతర కారణాలో కానీ 2016లో వీటిని నిషేధిత(22ఏ) జాబితాలో చేర్చారు. అప్పటికే వెంచర్లు వేసి క్రయవిక్రయాలు జరిగాయి. మొత్తానికి రూ.లక్షల్లో ఖర్చు చేసి పైరవీలు చేసి నిషేధం తొలగించారు. ఇప్పుడు ఇక్కడ గజం రూ.50వేల నుంచి 75వేలు ధర పలుకుతోంది.

ఈనాడు, అమరావతి

రాష్ట్ర ప్రభుత్వం నిషేధ భూములపై ప్రకటన చేయడంతో మండలాల్లో పైరవీలు ప్రారంభమయ్యాయి. కొంతమంది నేతలు ఈ వివాదస్పద భూములపై దృష్టిపెట్టారు. భూమి విస్తీర్ణం, మార్కెట్‌ విలువను బట్టి కమిషన్లు మాట్లాడుతున్నారు. సాధారణంగా పట్టాలకే రెవెన్యూ అధికారులకు మామూళ్లు సమర్పించుకునే రైతులు, ప్రస్తుతం నిషేధిత జాబితా భూముల పరిష్కారం అంటే.. మూటలు సమర్పించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

పైలట్‌ ప్రాజెక్టు ఏమైంది...?
‘ముందుగా రెండు మండలాలు ఎంపిక చేసి పరిష్కారం కనుగొంటాం. దస్త్రాలు అన్నీ సవ్యంగా ఉంటే చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పిస్తాం. ఏపరిస్థితుల్లో చుక్కలు పెట్టారో..? నిషేధిత జాబితాలో చేర్చారో విచారణ జరిపిస్తాం..!’ అని నాటి సంయక్త కలెక్టర్‌ కె.మాధవీలత వెల్లడించారు. నాగాయలంక, కోడూరు పైలట్‌ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అంతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. నాగాయలంక మండలంలో మొత్తం 28235 ఎకరాలు ఉంటే.. 5,926 ఎకరాలు నిషేధిత జాబితాలోనే చేర్చారు.  ఈమండలంలో చోడవరం గ్రామంలో 95.56 ఎకరాలు ఉంది. వీటి దస్త్రాలను పరిశీలించారు. కానీ ఇంతవరకు ఫలితం బయటకు రాలేదు. బందరు డివిజనులో  చుక్కల భూములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 1411 ఫిర్యాదులు అందింతే కేవలం 77 మాత్రమే అనుమతించారు. 912 దరఖాస్తులను తిరస్కరించారు. జిల్లాల విభజనతో మళ్లీ ఇవి తెరమీదకు వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 22ఏ భూముల విషయంలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. గత నెలలో వారం రోజులుపాటు దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో కలెక్టర్‌ నేతృత్వంలో 25 సమస్యలకు పరిష్కారం లభించింది. ఈ ఒక్క జిల్లాలోనే అత్యధికంగా 1473 దరఖాస్తులు అందాయి. ఎక్కువగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తులే. .

* ఇబ్రహీంపట్నం పరిధిలో 22 దరఖాస్తులు అందితే వాటిలో 16 దేవాదాయ శాఖకు చెందిన భూములు తమవిగా దరఖాస్తులు అందించారు. పాత దస్త్రాలు, సేల్‌డీడ్‌లు సృష్టించి  దరఖాస్తులు చేశారు. వీటిని పరిష్కరించేందుకు కొంతమంది దళారులు రంగంలోకి దిగారు. దేవదాయ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
* బందరు మండలంలో షరతులతో కూడిన పట్టాలను గతంలో ఇచ్చారు. ప్రస్తుతం వాటిలో చేపలచెరువులు తయారయ్యాయి. వీటికి పట్టాలు ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకు రుణాలు రావడంలేదు. అధికార పార్టీ నాయకుడిని ఆశ్రయించి వీటికి పట్టాలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఎకరానికి భారీగా ముడపులు చేతులు మారుతున్నాయి.
* గుడివాడలో వేణుగోపాలస్వామి భూములకు రెవెన్యూ శాఖ ఇప్పటికే క్లియరెన్సు ఇచ్చింది. ఇక దేవదాయ శాఖ క్లియరెన్సు లభిస్తే.. రూ.200కోట్ల ఆస్తి పరుల పాలే.
* విజయవాడ నగరం గుణదల ప్రాంతంలో కొన్ని సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో చేర్చారు. ఎందుకు చేర్చారో ఎవరికి అంతుపట్టడం లేదు. వాటిని మార్చేందుకు ఓ ప్రజాప్రతినిధి లాబీయింగు చేస్తున్నారు.
* పశ్చిమ మండలం పరిధిలో ఓ నేతకు సంబంధించిన భూమి క్రమబద్దీకరణకు పైరవీలు చేస్తున్నారు. రికార్డుల పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఈ భూములు తన ఆధీనంలో ఉన్నాయి. ప్రైవేటు పట్టాగా దస్త్రాలను చూపిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పైరవీలు చేస్తున్నారు.

అన్నీ సవ్యంగా ఉంటేనే..!
నిషేధిత జాబితాలో  ఉన్న భూములపై ప్రత్యేక దృష్టి సారించాం. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా అన్నీ దస్త్రాలు సక్రమంగా ఉండి, హక్కులు కలిగి ఉంటే పరిష్కరిస్తున్నాం. కొన్ని తహశీల్దారు పరిధిలో, మరికొన్ని రెవెన్యూ డివిజనల్‌ అధికారుల పరిధిలో, ఇంకొన్ని జిల్లా స్థాయిలో పరిష్కరిస్తున్నాం. వాస్తవంగా ప్రభుత్వ భూములు  ఆక్రమణలు ఉంటే తిరస్కరిస్తున్నాం. కొన్ని పొరపాటున సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలోకి వెళ్లి ఉండవచ్చు. దీనిలో పైరవీలకు ఆస్కారం లేదు. అలా ఎవరైనా ప్రవర్తించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

- ఎస్‌ డిల్లీరావు, కలెక్టర్‌, ఎన్టీఆర్‌ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని