logo

నాడు-నేడు బడులపై విద్యుత్తు బిల్లుల భారం

పెంచిన విద్యుత్తు ఛార్జీల భారంతో ప్రభుత్వ పాఠశాలలు నలిగిపోతున్నాయి. నాలుగు నెలల క్రితం ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచింది. ఈ భారం సాధారణ ప్రజానీకంతోపాటు సర్కారు బడులపై కూడా పడింది.

Published : 10 Aug 2022 05:58 IST

కొక్కిలిగడ్డ ప్రాథమికోన్నత పాఠశాల

న్యూస్‌టుడేే, చల్లపల్లి గ్రామీణం, అవనిగడ్డ గ్రామీణం: పెంచిన విద్యుత్తు ఛార్జీల భారంతో ప్రభుత్వ పాఠశాలలు నలిగిపోతున్నాయి. నాలుగు నెలల క్రితం ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచింది. ఈ భారం సాధారణ ప్రజానీకంతోపాటు సర్కారు బడులపై కూడా పడింది. ముఖ్యంగా నాడు-నేడు మొదటి విడతలో అభివృద్ధి చేసిన పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మిగిలిన వాటిపై పడినా ‘నాడు-నేడు’తో పోలిస్తే కొంత ఉపశమనమే.

* నాడు - నేడు పథకం కింద అవిభక్త కృష్ణా జిల్లాలో మొదటి విడతలో 1,125 పాఠశాలల్ని అభివృద్ధి చేశారు. అందులో భాగంగా ప్రతి తరగతి గదిలో పంకాలు, ట్యూబ్‌ లైట్లు ఏర్పాటు చేశారు. నీటి నిల్వ చేసే ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించారు. ఆ నీటిని మళ్లించేందుకు మోటార్లు, చల్లని నీటి కోసం ఫ్రిజ్‌లు కూడా బిగించారు. వాటి ఫలితంగా విద్యుత్తు వినియోగం పెరిగింది. పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇస్తున్న గ్రాంటు విద్యుత్తు బిల్లులకు చాలకపోవడంతో ఆ భారం ప్రధానోపాధ్యాయులపై పడుతోంది.

* పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సమగ్ర శిక్ష ఏటా నిర్వహణ గ్రాంటు విడుదల చేస్తుంది. రెండేళ్లుగా ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ గ్రాంటు మాత్రం పెంచలేదు. బహిరంగ మార్కెట్లో ధర పెరగని వస్తువంటూ లేదు. ఇచ్చే గ్రాంటు కొసరంత అయితే ఖర్చు కొండంత అవుతోంది. దీంతో నాడు-నేడు పాఠశాలల్లో పెరిగిన విద్యుత్తు బిల్లుల భారం ప్రధానోపాధ్యాయులతో పాటు సహోపాధ్యాయులూ మోయాల్సి వస్తోంది.

* మ్యాపింగ్‌ పేరుతో ఇటీవల 3, 4, 5 తరగతులను జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రాథమిక బడుల్లో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది.

* ప్రభుత్వ పాఠశాలలకు కేటగిరి-4 కింద విద్యుత్తు సరఫరా ఇస్తారు. ఈ విభాగంలో ధరలు పెంచక ముందు యూనిట్‌ రూ.4 ఉండేది. పెంచిన తర్వాత ధర రూ.7 అయ్యింది. ఒక్కో యూనిట్‌పై అదనంగా రూ.3 భారం పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని