logo

రాబడిపై ఆర్టీసీ గంపెడాశలు

అసలే నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీ, ఆ లోటు పూడ్చుకునేందుకు రాబడిపై దృష్టి పెట్టింది. కేవలం ప్రయాణికుల చేరవేత ద్వారానే కాకుండా వాణిజ్యపరంగానూ ఆదాయం సమకూర్చుకునేలా మార్గాలు అన్వేషిస్తోంది. అందులో భాగంగా విజయవాడ పీఎన్‌బీఎస్‌లోని

Published : 10 Aug 2022 05:58 IST

ఖాళీ దుకాణాల వేలంపై దృష్టి

ఈనాడు - అమరావతి: అసలే నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీ, ఆ లోటు పూడ్చుకునేందుకు రాబడిపై దృష్టి పెట్టింది. కేవలం ప్రయాణికుల చేరవేత ద్వారానే కాకుండా వాణిజ్యపరంగానూ ఆదాయం సమకూర్చుకునేలా మార్గాలు అన్వేషిస్తోంది. అందులో భాగంగా విజయవాడ పీఎన్‌బీఎస్‌లోని ఖాళీ దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ-టెండర్లు పిలిచింది. ఈనెల 22వ తేదీతో గడువు ముగియనుంది. గతంలో పిలిచిన వాటికి పెద్దగా స్పందన కనిపించలేదు. ఈసారి ఈ-టెండర్లకు ఆర్టీసీ వెళ్లింది. ఈసారైనా స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు. రూ.50 లక్షల మేర ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు.

పెరిగిన రద్దీ

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడలిగా విజయవాడ ఎదిగింది. నగరం అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండడమే ఇందుకు కారణం. ఒకప్పుడు ఆసియాలోనే కీలకమైన బస్టాండుగా వెలుగొందిన బెజవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌.. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత కీలకంగా మారింది. ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు, తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి ఇక్కడికి సర్వీసులు నడుస్తున్నాయి. ఇసుక వేస్తే రాలనంత రద్దీగా ఉంటోంది. ఇక్కడికి నిత్యం దాదాపు 3,000 బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో 450 సర్వీసులు తిరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 1.50 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. ఇందులో సిటీ బస్‌ పోర్టు నుంచి దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తారు. రద్దీగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ఆదాయం కోసం వాణిజ్య దుకాణాలను నిర్మించారు. ఎరైవల్‌, డిపార్చర్‌ బ్లాక్‌లతో పాటు సిటీ టెర్మినల్‌లో 146 వరకు గదులు కట్టారు.

* ఏటీఎం కేంద్రాలు, హోటళ్లు, నిరీక్షణ గదులు, డార్మిటరీలు, చిరుతిళ్లు, శీతలపానీయాలు, ఇంటర్నెట్‌, సినిమా హాలు, టీ స్టాళ్లు, ఫ్యాన్సీ తదితరాలకు అద్దెకు ఇచ్చారు. విస్తీర్ణానికి అనుగుణంగా అద్దె నిర్ణయించారు. కనిష్ఠంగా రూ. 15 వేలు నుంచి గరిష్ఠంగా రూ. 6.5 లక్షల వరకు నెలవారీ అద్దె ఉంది. వాటన్నింటి ద్వారా దాదాపు రూ. 1.50 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. కరోనాతో పరిస్థితులు తల్లకిందులయ్యాయి. చాలా రోజులు లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ కారణంగా వ్యాపారాలు సాగక దుకాణాలు మూతపడ్డాయి. ప్రస్తుతం 30 షాపులు చాలా కాలం నుంచి ఖాళీగా ఉన్నాయి. మహమ్మారి ప్రభావం నామమాత్రంగా ఉండడం, జన జీవనం సాధారణ స్థితికి చేరడంతో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. వ్యాపారాలు పుంజుకోవడంతో ఖాళీ షాపులకు టెండర్లు పిలిచారు. గతంలో పలు దఫాలు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. రెండు సార్లు వ్యాపారులతో ఆర్టీసీ అధికారులు సమావేశాలు నిర్వహించారు. వారి నుంచి సలహాలు స్వీకరించి, ఆ మేరకు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేశారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని