logo

త్వరలో సరకు రవాణా రైల్వే లైను

విజయవాడ కేంద్రంగా వస్తు రవాణా నిమిత్తం ఎన్టీఆర్‌ జిల్లాలోని పలు గ్రామాల మీదుగా మధ్యప్రదేశ్‌లోని ఇటార్సి వరకు ‘కొత్త ప్రత్యేక వస్తు రవాణా కారిడార్‌’ (న్యూ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌) ఏర్పాటుపై రైల్వే శాఖ అధ్యయనం ప్రారంభించింది.

Published : 10 Aug 2022 05:58 IST

రైతులతో సమావేశాలు ప్రారంభం


చండ్రగూడెంలో వివరాలు సేకరిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, మైలవరం: విజయవాడ కేంద్రంగా వస్తు రవాణా నిమిత్తం ఎన్టీఆర్‌ జిల్లాలోని పలు గ్రామాల మీదుగా మధ్యప్రదేశ్‌లోని ఇటార్సి వరకు ‘కొత్త ప్రత్యేక వస్తు రవాణా కారిడార్‌’ (న్యూ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌) ఏర్పాటుపై రైల్వే శాఖ అధ్యయనం ప్రారంభించింది. ఇప్పటికే ప్రాథమిక అలైన్‌మెంట్‌ పూర్తిచేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) కోసం ఇంజినీరింగ్‌ కన్సల్టింగ్‌ సంస్థలకు అప్పగించింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా జిల్లాలో రైలు మార్గం వెళ్లే గ్రామాల్లోని రైతులతో రెవెన్యూ శాఖ సహకారంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగర సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషనుకు అనుసంధానిస్తూ గూడ్సు లైను ప్రతిపాదనకు తుదిరూపు ఇచ్చేందుకు ‘అర్వీ అసోసియేట్స్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌.’ సంస్థ ఆధ్వర్యంలో కసరత్తులు వేగవంతమయ్యాయి. కొత్త కారిడార్‌గా రూపుదిద్దుకునే రైల్వేలైన్‌ను జిల్లాలోని విజయవాడ రూరల్‌, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లోని 28 గ్రామాల మీదుగా సాగేలా ప్రాథమిక అలైన్‌మెంట్‌ సిద్ధం చేశారు. దీనికి ఆమోదం తెలుపుతూ తుది మెరుగులు దిద్దేందుకు ‘డెెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ డీపీఆర్‌ బాధ్యతలను ఆర్వీ సంస్థకు అప్పగించగా, ప్రస్తుతం సెంటర్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ రీసెర్చి సంస్థ సమావేశాలు జరుపుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని విజయవాడ రెవెన్యూ డివిజన్‌, తిరువూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, సంస్థ ప్రతినిధులు కలిసి భూములివ్వాల్సిన రైతులతో సమావేశాలు ప్రారంభించారు. కాగా ఆయా గ్రామాల్లో ఎక్కువమంది రైతులు ప్రాథమికంగా తమ భూములివ్వడానికి అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ వారంలోనే సమావేశాలు ముగించి డీపీఆర్‌కు తుది రూపునివ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రెండు చోట్ల హైవే క్రాసింగ్‌: ఇప్పటికే రూపొందించిన ప్రాథమిక అలైన్‌మెంట్‌ మేరకు రాయనపాడు నుంచి జి.కొండూరు బైపాస్‌నకు తూర్పుగా వెళ్లే మార్గం, అదే మండలం కుంటముక్కల వద్ద జాతీయ రహదారి 30ను క్రాస్‌ చేసి, రహదారికి పడమరగా వెళుతోంది. మైలవరానికి పడమరగా వచ్చే లైను మైలవరం దాటాక హైవే క్రాస్‌ చేసి, జంగాలపల్లి మీదుగా తిరువూరు వైపునకు వెళుతోంది.


గ్రామాల్లో వివరాల సేకరణ జరుగుతోంది 
-ఎం.శ్రీనివాసు, తహసీల్దార్‌, మైలవరం

కొత్త రవాణా కారిడార్‌ నిమిత్తం సర్వే సంస్థ ద్వారా ప్రతిపాదిత మార్గంలోని గ్రామాల్లో వివరాల సేకరణ జరుగుతోంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఆ సంస్థకు సహకారం అందిస్తున్నాం. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనలో భాగంగా ఆయా గ్రామాల్లో సివిల్‌, ఎలక్టిక్రల్‌, పర్యావరణ, సామాజిక ప్రభావాలపై పరిశీలన చేస్తున్నారు. తుది నివేదికకు ఆమోదనంతరం భూసేకరణకు రైతులతో సమావేశాలు, ధరల నిర్ణయం తదితర అంశాలపై చర్చలుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు