logo

టోల్‌ కట్టినా.. గుంతల రోడ్లే దిక్కు!

జగదల్‌పూర్‌ వెళ్తున్న ఓ భారీ వాహనం అక్కడ మలుపు తిరగలేక ఇరుక్కుపోయింది. అంతే.. ఇరువైపులా ట్రాఫిక్‌ దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. దీన్ని అక్కడి నుంచి తప్పించడానికి పోలీసులు క్రేన్లు దాదాపు 6గంటలవరకు శ్రమించాయి.

Published : 11 Aug 2022 06:28 IST

జాతీయ రహదారుల పరిస్థితి

రామచంద్రాపురం వద్ద జాతీయ రహదారి ఇలా!

ఈనాడు, అమరావతి: జగదల్‌పూర్‌ వెళ్తున్న ఓ భారీ వాహనం అక్కడ మలుపు తిరగలేక ఇరుక్కుపోయింది. అంతే.. ఇరువైపులా ట్రాఫిక్‌ దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. దీన్ని అక్కడి నుంచి తప్పించడానికి పోలీసులు క్రేన్లు దాదాపు 6గంటలవరకు శ్రమించాయి. వాహనాలు వెళ్లేందుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో 6 గంటలు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విజయవాడ-జగదల్‌పూర్‌ ఎన్‌హెచ్‌- 30 రహదారిపై ఈ సంఘటన జరగడం  విశేషం. రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ 630 దాదాపు పూర్తయింది.  కానీ ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద సమస్య ఏళ్లతరబడి పరిష్కారం కావడవం లేదు. మరోవైపు గుత్తేదారు తనకు సంబంధం లేదని కాంట్రాక్టు ముగించారు. తుది బిల్లు తీసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా టెండర్లు పిలిచి రహదారి నిర్మాణం చేయాలన్న ఎన్‌హెచ్‌ఏఐ ప్రయత్నాలు నెరవేరడం లేదు. ప్రయాణీకులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

ఎందుకిలా..?
ఎన్‌హెచ్‌ 30 ఇబ్రహీంపట్నం నుంచి జగదల్‌పూర్‌ వరకు నిర్మాణం చేస్తున్నారు. దీనిలో భాగంగా గోదావరి నదిపై భద్రాచలం వద్ద రెండో వంతెన నిర్మాణం చేస్తున్నారు. ఏపీకి సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లాలో మాత్రమే 80 కిలోమీటర్లదూరం నిర్మాణం చేయాలి. ఈ జాతీయ రహదారిలో రెండు ప్రాంతాల్లో నిర్మాణం వదిలివేశారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద, ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద మిగిలిపోయింది. రామచంద్రాపురం వద్ద కిలోమీటరు విస్తరణ వదిలివేశారు. ఇక్కడ గ్రామం మధ్యలో నుంచి నిర్మాణం చేయాల్సి ఉంది. గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు. బైపాస్‌ కోసం న్యాయస్థానానికి వెళ్లారు. ఇక్కడ కీలక మలుపు ఉంటుంది. ఇటీవల ఓ భారీ వాహనం అడ్డంతిరిగి ఇరుక్కుపోయింది. తరచూ ఇక్కడ రహదారి మరమ్మతులకు గురవుతుంది. కనీసం వీటిని మరమ్మతులు చేయటంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీనికి పరిఆరం చెల్లింపులు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా టెండర్లు పిలిచారు. కొన్ని ఇళ్లను కూల్చివేశారు. ఈలోగా ప్రవాసాంధ్రులు ఒకరు తనకు పరిహారం అందలేని న్యాయస్థానానికి వెళ్లారు. దీంతో పనులు మళ్లీ ఆగిపోయాయి. ఇది తేలేవరకు అక్కడ రహదారి నిర్మాణం నిలిచిపోవాల్సిందే. అసలు గుత్త సంస్థ దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ దీన్ని వదిలేసింది. ప్రత్యేకంగా టెండర్లు పిలిచి అప్పగించినా పనులు ముందుకు సాగడం లేదు. కానీ ఈ గ్రామానికి ముందు బాడవ వద్ద టోల్‌ వసూలు చేస్తున్నారు. ఇటీవల టోల్‌రేట్లు పెంచారు. కనీసం రోడ్డు నిర్మాణం చేయకుండా టోల్‌ వసూలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదే రహదారిపై తెలంగాణలో గౌరవరం వద్ద టోల్‌ వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్‌ రహదారిపై కూడా..!
హైదరాబాద్‌ జాతీయ రహదారి అంబారుపేట క్రాస్‌ రోడ్డు వద్ద అసంపూర్తిగా వదిలేశారు. భూసేకరణ కోసం ఎదురు చూస్తున్నారు. నందిగామ వద్ద ఏడు కిలోమీటర్లు జాతీయ రహదారి విస్తరణ చేపట్టారు. ఆరు కిలోమీటర్లు నిర్మాణం పూర్తయింది. ఒక కిలోమీటరు ఆగిపోయింది. రెండేళ్లు గడిచాయి. నందిగామ పట్టణంలోకి వెళ్లేందుకు అండర్‌ పాస్‌ ఏర్పాటు చేయాలి. అక్కడే ఒక బస్‌బే, బస్‌స్టాప్‌ ఏర్పాటు చేయాలి. దీనికి భూసేకరణ కావాలి. రెవెన్యూ అధికారులు రేపు మాపు అంటున్నారు. ఇక్కడ రాకపోకలకు జాతీయ రహదారిపై డివైడర్‌లు అడ్డదిడ్డంగా ఏర్పాటు చేశారు. వీటిని అంచనా వేయని వాహనదారులు  వేగంతో వచ్చి ఢీకొడుతున్నారు. కొన్ని సంఘటనలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని సంఘటనల్లో గాయాలతో బయటపడుతున్నారు. రోజుకు రెండు మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనాసాగర్‌ వద్ద సర్వీసు రోడ్డు పరిస్థితి అదే విధంగా ఉంది. త్వరలోనే పూర్తి చేయిస్తామని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెబుతున్నారే తప్ప ఖచ్చితమైన గడువులు ప్రకటించడంలేదు..

బందరుకు చేయిచ్చారు..!
విజయవాడ- బందరు జాతీయ రహదారి 64 కిలోమీటర్లు నాలుగు వరసలుగా విస్తరించారు. రూ.800 కోట్ల ప్రాజెక్టు. దీనిలో భాగమే బెంజి పైవంతెన నిర్మాణం. ఏడాది కిందట పూర్తి చేశారు. దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ కాంట్రాక్టు. కానీ మధ్యలో కొన్ని పనులు వదిలివేశారు. బెంజి సర్కిల్‌ సెంటర్‌ నుంచి నిర్మాణం చేయాల్సి ఉంటుంది.  కానీ బెంజి సర్కిల్‌ నుంచి ఆటోనగర్‌ గేట్‌ వరకు వదిలివేశారు. కారణం కొన్ని భవనాలను కూల్చివేయాల్సి ఉంది. దీనికి వీఎంసీ ముందుకురాలేదు. దీంతో గుత్త సంస్థ ఈ భాగాన్ని కాంట్రాక్టు నుంచి మినహాయించింది. ప్రస్తుతం వీఎంసీ నిర్వాసితులకు టీడీఆర్‌ బాండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 168 భవనాలను కూల్చివేయాల్సి ఉంది. ట్రాఫిక్‌ పెద్ద సమస్యగా మారింది. కంకిపాడు మండలం కొణతనపాడు వద్ద రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అయిదు ప్రాంతాల్లో గుత్తేదారు పనులు వదిలివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని