logo

32 నెలలుగా వేతనాల్లేవ్‌

విద్యతోనే అభివృద్ధి సాధ్యం. దానిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంతోమంది పిల్లలు ఆశ్రయం పొందుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఓ మంచి లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినా,

Published : 12 Aug 2022 05:48 IST

పోస్టుమెట్రిక్‌ ఎస్సీ వసతి గృహాల్లో సిబ్బంది ఇక్కట్లు

విజయవాడ సిటీ, పటమట, న్యూస్‌టుడే

సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం

విద్యతోనే అభివృద్ధి సాధ్యం. దానిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంతోమంది పిల్లలు ఆశ్రయం పొందుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఓ మంచి లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినా,  విధానపరమైన లోపాలతో కొన్ని సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్న పిల్లలకు అన్నం, కూరలు వండే కుక్‌లు, వంటకు సాయం చేయడం, భోజనం వడ్డించే హెల్పర్లు, వసతిగృహానికి రక్షణగా ఉండే కాపలాదారులకు వేతనాలు ఇవ్వడం లేదు. దాదాపు 32 నెలల నుంచి వారికి  అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను పరిష్కరించమని ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులను కలిసిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయారు. మరికొందరు ఉన్న వేరే దారి లేక, సర్వీస్‌ పోతుందనే భయంతో విధులు నిర్వహిస్తున్నారు. బయట నుంచి అప్పులు తీసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని వారు వాపోతున్నారు. తమకు వేతన బకాయిలు ఇవ్వాలని, ఆప్కాస్‌లో విలీనం చేయాలని వారు కోరుతున్నారు.

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఇంటర్మీడియట్‌ నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థుల కోసం సుమారు 27 పోస్టు మెట్రిక్‌ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి భోజనం వండడానికి కుక్‌, వడ్డించడం, పరిశుభ్రత పనులకు సహాయకుడు, రాత్రి సమయంలో కాపలాదారు ఇలా 81 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీళ్లకు రెండున్నరేళ్ల నుంచి వేతనాలు రావడం లేదు.  

ఎందుకీ వివక్ష

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ప్రీమెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌ వసతి గృహాల్లో దాదాపు 13 ఏళ్ల నుంచి చాలామంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.  పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో చేస్తున్న వారిని కొంత కాలం ఆపేశారు.  ప్రీమెట్రిక్‌ హాస్టళ్లలో   వారిని మాత్రం ఆప్కాస్‌లో విలీనం చేశారు. వీరికి ప్రతి నెల వేతనాలు వస్తున్నాయి. ‘పోస్టుమెట్రిక్‌’ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని 1.12.2019న మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఈసారి ఔట్‌సోర్సింగ్‌లో కాకుండా వివిధ కాంట్రాక్టు ఏజన్సీల ద్వారా నియమించారు. అప్పటి నుంచి పనిచేస్తున్నా ఇంతవరకు వేతనాలు ఇవ్వడం లేదు. తమతో పాటు విధులు నిర్వహించిన ‘ప్రీˆమెట్రిక్‌’ వారిని ఆప్కాస్‌లో తీసుకుని, తమపై మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఔట్‌సోర్సింగ్‌ కింద తీసుకున్నారని, కృష్ణా జిల్లాలో ఇంకా అమలు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం

పనిచేసిన వేతనాలు రాకపోవడంతో 32 నెలల నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కుటుంబ నిర్వహణకు బయట నుంచి అప్పులు తీసుకొస్తున్నాం.  వడ్డీలు ఆర్థిక భారంగా మారాయి. వెంటనే బకాయిలు మంజూరు చేయాలి. విద్యార్థుల సంఖ్యను బట్టి వేతనాలు ఇచ్చే విధానాన్ని విరమించాలి. అప్కాస్‌లో విలీనం చేసి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి.

- చిన్నం సుశీల, అధ్యక్షురాలు, ఎస్సీ వసతి గృహాల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం, ఎన్టీఆర్‌ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని