logo

మన నేలపై కొలువుదీరాలి..!

హైదరబాద్‌లో పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులు మన రాష్ట్రం వారే.. మనప్రాంతం వారే.. ఇక్కడ అవకాశాలు లేక అక్కడికి వెళ్లి వారి మేథస్సును వినియోగిస్తున్నారు. సాంకేతిక విద్య చదివిన విద్యార్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలు మనవి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అత్యధికంగా విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్నారు. వీరే కాకుండా కృష్ణా జిల్లా నుంచి డిగ్రీ, పీజీ విద్యను ఏటా 30వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరంతా అటు ప్రభుత్వ కొలువుల వైపు లేదా ప్రాంగణ నియామకాల్లో ఎంపికై పక్క రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్నారు.

Updated : 13 Aug 2022 05:46 IST

వంద మంది యువతతో సర్వే
న్యూస్‌టుడే, విజయవాడ విద్య

దేశంలో ప్రతి ముగ్గురు ఐటీ ఉద్యోగుల్లో ఒక్కరు తెలుగువారు.. వారంతా హైదరబాదులో ఉన్నారు.

- ఇది ఓ సర్వే నివేదిక

హైదరబాద్‌లో పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులు మన రాష్ట్రం వారే.. మనప్రాంతం వారే.. ఇక్కడ అవకాశాలు లేక అక్కడికి వెళ్లి వారి మేథస్సును వినియోగిస్తున్నారు. సాంకేతిక విద్య చదివిన విద్యార్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలు మనవి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అత్యధికంగా విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్నారు. వీరే కాకుండా కృష్ణా జిల్లా నుంచి డిగ్రీ, పీజీ విద్యను ఏటా 30వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరంతా అటు ప్రభుత్వ కొలువుల వైపు లేదా ప్రాంగణ నియామకాల్లో ఎంపికై పక్క రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. కొత్త రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లయింది. ఇక్కడకు బహుళ జాతి సంస్థలు వస్తే.. పక్క రాష్ట్రాల వైపు మన విద్యార్థులు వెళ్లే అవసరమే ఉండదు. వచ్చే 25 ఏళ్లలో మన ప్రాంతంలోనే మన విద్యార్థులు ఉపాధి అవకాశాలు లభించాలని కోరుకుంటున్నారు. అలాగే పరిశ్రమలు రావాలి, యువతరం స్టార్టప్‌లతో ముందడుగు వేసేలా శిక్షణ ఇవ్వాలి.


ఐటీ సంస్థలు ఇక్కడే నెలకొల్పాలి

ఎస్‌.గీతిక, బీటెక్‌ విద్యార్థిని

ప్రస్తుతం మన ప్రాంతంలో విద్యార్థులు అత్యధిక వార్షిక వేతనంతో  ఎంపికవుతున్నారు. కానీ కొలువులు చేయటానికి పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. వచ్చే 25 ఏళ్లలోనైనా హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు దీటుగా తయారవ్వాలి.


అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు రావాలి

-బీఎస్‌ఎన్‌ దుర్గాప్రసాద్‌,  ఐఏఎస్‌ అకాడమీ

ఈ ప్రాంతంలో పేరున్న అంతర్జాతీయ సంస్థలు లేవు. మన ప్రాంతానికి సెంట్రల్‌ యూనివర్సటీ కావాలి. బిజినెస్‌ స్కూల్‌ ఇక్కడ లేదు. ఐఎస్‌బీ (ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌), ఐఎస్‌ఐ (ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌), ఐఐఎస్‌సీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌) సీసీఎంబీ, ఐఐసీటీ లాంటి సంస్థలు ఇక్కడ రానున్న రోజుల్లో ఏర్పాటు చేయాలి. ఇక్కడ పరిశోధనా సంస్థలను నెలకొల్పాలి. స్థానిక విద్యార్థులకు అవకాశాలు కల్పించాలి. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇతరులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక వనరులు పెరుగుతాయి.


నైపుణ్య శిక్షణ కేంద్రాలు అవసరం

-కోటంరాజు శరత్‌కుమార్‌, డైరెక్టర్‌, కేఎల్‌ విశ్వవిద్యాలయం

గ్రామీణ యువత ఎక్కువగా ఉన్న జిల్లాలు మనవి. వీరికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.  మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా నినాదంతో రానున్న రోజుల్లో ఎక్కువగా వస్తువుల ఉత్పత్తి మన దగ్గరే జరిగే అవకాశం ఉంది. వీటికి తగినట్టుగా యువతలో నైపుణ్యాలు పెంపొందించాలి. ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ మన విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇక్కడే బహుళజాతి సంస్థలు వచ్చేలా కృషి చేయడం ద్వారా మన యువతకు మన దగ్గరే ఉద్యోగాలు వస్తాయి.


పరిశ్రమల ఏర్పాటే ప్రధానం

ఎ.చరణ్‌, బీటెక్‌ విద్యార్థి

మన ప్రాంతంలోని పారిశ్రామికవాడలలో పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. పరిశ్రమలు ఉన్నప్పుడే విద్యార్థులకు, యువతకు ఉపాధి దొరుకుతుంది. ఉన్న ఎంఎస్‌ఎంఈలు కూడా కరోనా కారణంగా మూతపడేస్థితిలో ఉన్నాయి. రానున్న రోజులలో ఇండస్ట్రియల్‌ జోన్లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలి. ప్రైవీటీకరణ ఊపందుకున్న నేపథ్యంలో పారిశ్రామీకరణను, అంకురాలను ప్రోత్సహించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని