logo

పల్లెల్లో వెలుగులేవీ..!

పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పటికే విద్యుత్తు బిల్లుల బకాయిలు భారంగా మారగా దీపాల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Published : 13 Aug 2022 05:43 IST

పంచాయతీలకు భారంగా వీధిదీపాల నిర్వహణ

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పటికే విద్యుత్తు బిల్లుల బకాయిలు భారంగా మారగా దీపాల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణకు రెండు గుత్తేదారు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం అర్ధంతరంగా రద్దుచేసుకుని ఆ బాధ్యతను నిధుల కొరతతో సతమతమవుతున్న పంచాయతీలపై మోపడంతో పూర్తి స్థాయి వెలుగులు పంచలేని దుస్థితి కొనసాగుతోంది.

క్రమంగా ఆదాయ వనరులు కోల్పోతూ వస్తున్న గ్రామ పంచాయతీలకు సమకూరే ఆదాయంలో అధిక శాతం వీధి దీపాలు, రక్షిత మంచినీటి పథకాల వినియోగానికి సంబంధించి వచ్చే విద్యుత్తు బిల్లులకే ఖర్చవుతుంటుంది. సక్రమంగా బిల్లులు చెల్లించలేదన్న కారణంగా సంబంధిత శాఖ తరచూ చాలా పంచాయతీలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసిన సందర్భాలున్నాయి. ఇది కాకుండా వీధిదీపాల నిర్వహణలో భాగంగా మాడిపోయిన బల్పులు, చౌక్‌లు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు నిమిత్తం ఆయా పంచాయతీల స్థాయిని బట్టి ఏడాదికి రూ. లక్షల్లోనే ఉంటుంది. మొత్తం మీద వీధి దీపాల నిర్వహణ, కరెంటు బిల్లుల చెల్లింపు అంశం ప్రతి పంచాయతీకి ఆర్థిక గుదిబండలా ఉంటుంది.

అర్ధంతరంగా ముగిసిన ఒప్పందం
గ్రామాల్లో విద్యుత్తు సంబంధిత ఖర్చులు తగ్గించడంతో పాటు మెరుగైన వీధిదీపాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో 2018లో అప్పటి ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వీధిదీపాల నిర్వహణ ఖర్చు సున్నా చేయడంతో పాటు కరెంటు వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలకు అప్పగించారు. జిల్లాలో ఎల్‌ఈడీల నిర్వహణ బాధ్యతలను నెడ్‌క్యాప్‌, ఈఎస్‌ఎస్‌ఎల్‌ సంస్థలు దక్కించుకున్నాయి. ఒక్కో ఎల్‌ఈడీ బల్బు ఇన్‌స్టలేషన్‌ ఛార్జి నిమిత్తం రూ.150రూలు, నిర్వహణ కోసం ప్రతి బల్బుకు నెలకు రూ.50 చొప్పున చెల్లించేలా పది సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అనుగుణంగా అన్ని పంచాయతీల్లో బల్బులు ఏర్పాటు చేసిన సంస్థలు వాటి నిర్వహణ విషయంలో చూపుతున్న నిర్లక్ష్యం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమైనా పంచాతీయలకు విద్యుత్తు దీపాల నిర్వహణ పరంగా ఎటువంటి ఆర్థికభారం లేకపోవడంతో కాస్త ఉపశమనం దక్కినట్టయ్యింది. బల్బులు మాడిపోవడం, కనెక్టర్లు, ఎడాప్టర్లు వంటివి పాడైన సందర్భాల్లో అవసరాన్ని బట్టి స్థానిక ఎలక్ట్రీషియన్లతో సరిచేయించుకున్నా అందుకు చేసిన ఖర్చును గుత్తేదారు సంస్థలే భరించేవి. ఏడాదిన్నర క్రితం గుత్తేదారు సంస్థలకు పంచాయతీలు చెల్లించాల్సిన ఇన్‌స్టలేషన్‌, ఐడీసీ ఛార్జీలు, నిర్వహణ బిల్లుల మొత్తం దాదాపు రూ.25కోట్ల మేర పేరుకుపోవడంతో సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి చేశాయి. స్పందించిన ఉన్నతాధికారులు తక్షణం బిల్లు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించడంతో యుద్ధప్రాతిపదికన ఇన్‌స్ట్టలేషన్‌ ఛార్జీలు పూర్తిగా, సగం వరకూ నిర్వహణ ఛార్జీలను చెల్లించారు. ఇక ఇబ్బందులు తొలిగాయని భావిస్తున్న సమయంలో కొన్ని నెలల క్రితం ప్రభుత్వం ఎల్‌ఈడీల నిర్వహణ బాధ్యతను గుత్తేదారు సంస్థల నుంచి రద్దు చేసి పంచాయతీలకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

సర్దుబాటులతో సతమతం
ప్రభుత్వ చర్యలతో ఖాళీ ఖజానాలతో ఉన్న పంచాయతీలకు ప్రస్తుతం ఎల్‌ఈడీల నిర్వహణ మరింత భారంగా మారింది. వర్షాకాలం దృష్ట్యా చేపట్టాల్సిన మెరుగైన పారిశుద్ధ్య చర్యలతో పాటు అందుకు తగ్గ విధంగా వీధిదీపాల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతోంది. తరచూ మాడిపోయే బల్బులు, చోక్‌ల కొనుగోలుకు సగటున ప్రతి మేజర్‌ పంచాయతీకి నెలకు రూ.15 వేల వరకూ ఖర్చవుతోంది. మైనర్‌ పంచాయతీలకు ఎల్‌ఈడీ బల్బులు అందుబాటులో లేకపోవడంతో పోయినస్థానంలో కొత్తవి వేసేందుకు వారాల పాటు ఎదురుచూడాల్సి వస్తోందన్న ఆరోపణలున్నాయి. కొన్ని పంచాయతీల్లోని అంతర్గత రహదారుల్లోని దీపాలు మాడిపోయినా వెంటనే కొత్తవి వేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, ఘంటసాల, కోడూరు, గూడూరు, బందరు మండలం తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వీధిదీపాలు వెలగని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. స్థానిక వార్డు సభ్యుల ఒత్తిళ్లు ఉన్న చోట్ల కార్యదర్శులే భారం భరిస్తూ నాలుగైదు అవసరం ఉన్న చోట్ల ఒకట్రెండుతో సరిపెడుతున్నారు. ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు లేకుండా వీధి దీపాల నిర్వహణ కోసం సతమతమవ్వాల్సి వస్తోందని పలువురు కార్యదర్శులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని