logo

ఉద్యమానికి వెన్నుదన్నుగా... సుజ్ఞానప్రద మాసపత్రిక

భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామంలో 1910లోనే స్వాతంత్య్ర సమరానికి తొలి అడుగు పడింది.

Published : 13 Aug 2022 05:43 IST

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే

భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామంలో 1910లోనే స్వాతంత్య్ర సమరానికి తొలి అడుగు పడింది. అప్పటి నుంచి బ్రిటిష్‌ పాలకులు దేశాన్ని విడిచి వెళ్లే వరకు పోరాటం కొనసాగించారు. ఉద్యమంలో ఎందరో కీలకంగా పని చేశారు. ప్రజలకు అక్షర జ్ఞానం నేర్పితే ఉద్యమ స్ఫూర్తి మరింత రగులుతుందనే భావనతో 1916 జులై 18న బాలభక్త పుస్తక భాండాగారం పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించారు. అందులో 80 మందితో రాత్రి పాఠశాల నిర్వహించారు. ఉదయం పనులు చేసుకొని రాత్రికి పాఠశాలకు వచ్చి అక్షరాలు నేర్చుకున్నారు. గ్రామస్థులు కొణకంచి చక్రధరరావు, సీతారామయ్య, పురుషోత్తమరావు, కాకుమాను పిచ్చయ్య, నరిరికంటి వెంకయ్య తదితరులు గ్రంథాలయం ఏర్పాటుకు విశేష కృషి చేశారు. కాలక్రమంలో శ్రీరామచంద్ర బాలభక్త గ్రంథాలయంగా నామకరణం చేశారు.

చేతి రాతతో...
1929 అక్టోబరులో ‘సుజ్ఞాన ప్రద’ అనే చేతిరాత మాస పత్రికను స్థాపించి గ్రంథాలయం నుంచి విజయవంతంగా నడిపించారు. రేపాల బుచ్చిరామయ్య శ్రేష్ఠి ఆధ్వర్యంలో కొణకంచి చక్రధరరావు సంపాదకుడిగా 1945 వరకు పత్రిక కొనసాగించారు. విద్యావంతులు విలేకరులుగా పనిచేశారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రగిలించేలా కథనాలు, ప్రత్యేక వార్త విశేషాలతో పత్రికను తీర్చిదిద్దారు. ‘నా దేశయాత్ర’ సీరియల్‌కు విశేష ఆదరణ లభించింది. ఆ మాస పత్రిక ప్రతులు ఇప్పటికీ గ్రంథాలయంలో భద్రంగా ఉన్నాయి. గ్రంథాలయ నిర్వహణ గురించి తెలుసుకున్న జవహర్‌లాల్‌ నెహ్రూ అభినందిస్తూ ప్రత్యేకంగా లేఖ రాశారు. గ్రంథాలయం స్థాపించి 2016కు వందేళ్లు పూర్తి కావడంతో స్వాతంత్య్ర సమరయోధుడు రేపాల బుచ్చిరామయ్య శ్రేష్ఠి కుమారుడు రేపాల మోహన్‌రావు ఆధ్వర్యంలో వారం పాటు ఉత్సవాలు నిర్వహించారు. గ్రంథాలయంలో ప్రస్తుతం 21 వేల పుస్తకాలు ఉన్నట్లు గ్రంథాలయ అధికారి షేక్‌ కరీముల్లా తెలిపారు.


పత్రికలో చేతిరాత కథనాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని