logo

సాంకేతిక ఆధారాలతో ఛేదించారు

నిండా 22 ఏళ్లు కూడా లేని యువకులు ముఠాగా ఏర్పడి అతి కిరాతకంగా ఆరుగురిని హత్య చేశారు. మరో 12 మందిని చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంతలో వారి పాపం పండి ఏటీఎం చోరీ యత్నం కేసులో పోలీసులకు దొరికిపోయారు.

Published : 13 Aug 2022 06:09 IST

నరహంతక ముఠా కేసులో పరిశోధనకు ప్రతిభకు పురస్కారాలు

శ్రీనివాస్‌, సత్యనారాయణలకు కేంద్ర హోం మంత్రి పతకాలు


కొల్లి శ్రీనివాసరావు            సత్యనారాయణ

ఈనాడు - అమరావతి: నిండా 22 ఏళ్లు కూడా లేని యువకులు ముఠాగా ఏర్పడి అతి కిరాతకంగా ఆరుగురిని హత్య చేశారు. మరో 12 మందిని చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంతలో వారి పాపం పండి ఏటీఎం చోరీ యత్నం కేసులో పోలీసులకు దొరికిపోయారు. తీగలాగితే వారి నేర చరిత్ర అంతా బయటకు వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన ఏడీసీపీ కొల్లి శ్రీనివాస్‌, సీఐ ముత్యాల సత్యనారాయణలకు శుక్రవారం ప్రకటించిన జాబితాలో కేంద్ర హోం మంత్రి పతకాలు వరించాయి. ప్రస్తుతం శ్రీనివాస్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తుండగా, సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ సీఐగా పనిచేస్తున్నారు.

పోరంకిలోని ఓ బ్యాంకు ఏటీఎంలో గత ఏడాది జూన్‌లో చోరీ యత్నం జరిగింది.  సీసీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా అనుమానంపై తాడిగడపకు చెందిన ఆటోడ్రైవర్‌ చక్రవర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.  అనంతరం ముఠాలోని మిగిలిన వారిని కూడా అరెస్టు చేశారు. మొదట్లో వీరు గతంలో చేసిన హత్యల గురించి బయటకు రాలేదు. నిందితుల వేలిముద్రలను విశ్లేషించగా కంచికచర్లలో 2020, డిసెంబరులో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితుల వాటితో సరిపోయాయి. పోరంకి, తాడిగడప, కామయ్యతోపు ప్రాంతాలకు చెందిన ప్రభుకుమార్‌, గోపీ రాజు, చక్రవర్తి అలియాస్‌ చక్రి, నాగదుర్గారావు అలియాస్‌ చంటి ఆటో డ్రైవర్లుగా పనిచేస్తుంటారు. ఫణీంద్ర కుమార్‌ పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. నేరాలు చేయడం ద్వారా సులువుగా డబ్బు సంపాదన కోసం గ్యాంగుగా ఏర్పడ్డారు. పగటి పూట ఆటోలు నడుపుకునే వారు. కూరగాయలు అమ్మేవారు. జనావాసాలకు దూరంగా ఉన్న ఇళ్లల్లో ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకునే హత్యలకు పాల్పడే వారు. పోరంకి విష్ణుపురం కాలనీలో నళిని, తూముల సెంటర్‌లో సీతామహాలక్ష్మి, పాత పోస్టాఫీసు సమీపంలో పాపమ్మ, తాడిగడపలో కట్టపై ఒంటరిగా ఉంటున్న ధనలక్ష్మి, కంచికచర్లలో నాగేశ్వరరావు, ప్రమీలారాణి దంపతులను వారి ఇళ్లల్లోకి ప్రవేశించి హతమార్చి ఆభరణాలను దోచుకెళ్లారు. నిందితుల నుంచి రూ. 9.60 లక్షల విలువైన ఆభరణాలు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని