logo

హాజరు క్షోభ..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ పాఠశాలలోనూ ఉపాధ్యాయులు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ముఖ ఆధారిత యాప్‌లో పూర్తి స్థాయిలో హాజరు వేయలేక పోయారు.  తొలిరోజే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యాయులు అందరూ ఆందోళన చెందుతున్నారు.

Published : 17 Aug 2022 04:56 IST

యాప్‌తో ఉపాధ్యాయుల ఆపసోపాలు
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే


బందరు: హాజరు వేసేందుకు ఫోన్‌తో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు

మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాలలలో 28 మంది ఉపాధ్యాయులు ఉంటే మంగళవారం కేవలం ఇద్దరు మాత్రమే యాప్‌ ఆధారిత ముఖ చిత్ర హాజరు వేయగలిగారు. అది కూడా ఉదయం 8 గంటల సమయంలో చరవాణితో కుస్తీ పడితే నమోదైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మిగిలిన ఉపాధ్యాయులు నిర్దేశించిన సమయానికి వచ్చినా హాజరు వేయలేకపోయారు.


గూడూరు మండలం మల్లవోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో 23 మంది వరకు ఉపాధ్యాయులు ఉంటే ఇక్కడ కూడా ఇద్దరు మాత్రమే యాప్‌ ద్వారా హాజరు వేశారు. గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో కూడా 27 మంది గురువులకు గాను ముగ్గురు ఉదయం పూట హాజరు వేశారు.


ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ పాఠశాలలోనూ ఉపాధ్యాయులు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ముఖ ఆధారిత యాప్‌లో పూర్తి స్థాయిలో హాజరు వేయలేక పోయారు.  తొలిరోజే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యాయులు అందరూ ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో 5,748 మంది, ఎన్టీఆర్‌ జిల్లాలో 4,988 మంది చొప్పున మొత్తం 10,736 మంది  ఉపాధ్యాయులు రెండు జిల్లాలో విధులు నిర్వహిస్తుండగా.. అందరూ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ శాతం మంది తమ ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నా ఫ్యాప్టో పిలుపు మేరకు అన్‌ఇన్‌స్టాల్‌ చేసిన వారు కూడా ఉన్నారు. అధికారుల ఆదేశాలతో ఉపాధ్యాయులు ముఖ ఆధారిత యాప్‌లో హాజరు వేయడానికి ప్రయత్నించినా.. పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, చల్లపల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో చాలా మంది ఉపాధ్యాయుల చరవాణిలు యాప్‌ డౌన్‌ లోడ్‌కు సపోర్టు చేయడం లేదని సంఘ నాయకులు చెబుతున్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌ అయినా లాగిన్‌ కాకపోవడం, ఉపాధ్యాయులు నమోదు డేటా కనిపించకపోవడం, చిత్రం కోసం వెతుకుతున్నట్లు సందేశాలు వస్తున్నాయే కానీ ముఖచిత్ర హాజరు వేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. తొలి రోజు మొత్తం ఉపాధ్యాయుల్లో ఒక వంతు కూడా హాజరు వేయలేక పోయారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. విద్యార్థుల హాజరు కూడా ఈ యాప్‌లోనే వేయాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది. కృష్ణా జిల్లాలో 1801 పాఠశాలలకు గాను 1280 పాఠశాలల్లో మాత్రమే హాజరు వేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఎన్నిసార్లు ప్రయత్నించినా ‘ప్లీజ్‌ ట్రై ఎగైన్‌ లేటర్‌’ దర్శనం  

ధ్యాస అంతా చరవాణిపైనే...

ఉపాధ్యాయులు చరవాణులు పట్టుకుని హాజరుపై దృష్టి సారించడంతో ఆ ప్రభావం బోధనపై పడుతోంది. యాప్‌ ఎప్పుడు పనిచేస్తుందో తెలియక ఉపాధ్యాయులు సరిగా తరగతులకు కూడా హాజరు కాలేకపోతున్నారు. హాజరు సమస్యపై జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఎక్కువమంది ఫిర్యాదు చేశారు. హాజరు వేయలేకపోతే లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కొంతమంది ఎంఈవోలు ఆదేశించడం, సెలవు కింద పరిగణిస్తామని ఇంకొందరు చెప్పడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సమయానికి వచ్చినా యాప్‌ పనిచేయకపోతే ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

‘ప్లీజ్‌ వెయిట్‌’ అని...

యాప్‌లో హాజరు వేయం - లెనిన్‌బాబు, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

యాప్‌లో హాజరు వేయడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా లేరు. ఆ విషయాన్ని సంఘ పరంగా ఇప్పటికే  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమయానికి వచ్చినా యాప్‌ పనిచేయకపోతే ఉపాధ్యాయులు  ఎందుకు బాధ్యులు కావాలి. ప్రభుత్వం పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయకుండా యాప్‌లతో నియంత్రించాలంటే కుదరదు. ఇప్పటికే ఇన్‌స్టాల్‌ చేసుకున్నవారు కూడా బయటకు వచ్చేశారు.

బోధనకు ఆటంకం: అంబటిపూడి సుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్‌(257)జిల్లా కార్యదర్శి

యాప్‌ల వల్ల బోధనకు ఆటంకం కలుగుతుంది. కేవలం హాజరు వేస్తే సరిపోతుందా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తగిన సాంకేతిక పరికరాలు ఇస్తే వారు చెప్పినట్లు యాప్‌లో హాజరువేయడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలు పరిష్కరించకుండా హెచ్చరికలు జారీ చేయడం సరికాదు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలి.

కృష్ణా జిల్లాలో
మొత్తం ఉపాధ్యాయులు 5,748
యాప్‌లో నమోదైన వారు 5,071
తొలిరోజు హాజరు వేసింది 1650

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని