logo

చెత్త పన్ను వసూలు చేయకుంటే సస్పెన్షనే

‘నగరంలో ఇంటింటా చెత్తపన్ను వసూలు చేయండని అనేక సార్లు చెబుతున్నా.. నిరంతరం ఫాలోప్‌ చేస్తున్నా, మీలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఇకపై వసూళ్లను మెరుగుపర్చకపోతే బాధ్యుల జీతాల్లో కోత పెడతాం..

Published : 17 Aug 2022 04:56 IST

టెలీ కాన్ఫరెన్సులో నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదేశం

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ‘నగరంలో ఇంటింటా చెత్తపన్ను వసూలు చేయండని అనేక సార్లు చెబుతున్నా.. నిరంతరం ఫాలోప్‌ చేస్తున్నా, మీలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఇకపై వసూళ్లను మెరుగుపర్చకపోతే బాధ్యుల జీతాల్లో కోత పెడతాం.. అవసరమైతే ఒకరిద్దరిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తా’ అని ప్రజారోగ్య విభాగం అధికారులు, క్షేత్రస్థాయి, సచివాయల ఉద్యోగులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తీవ్రంగా హెచ్చరించారు. వారితో ఆయన మంగళవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్సులో చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. చెత్తపన్ను వసూళ్లు ఇటీవల కాలంలో పూర్తిగా మందగించాయి. దీంతో రోజువారీ, నెలవారీ వసూళ్ల నివేదికలను పరిశీలిస్తున్న కమిషనర్‌.. బాధ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తూనే ఉన్నారు.. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో చీఫ్‌ మెడికల్‌ అధికారి, సహాయవైద్య అధికారులు, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయపు శానిటరీ సెక్రటరీలతో ఆకస్మికంగా టెలీకాన్ఫరెన్సు నిర్వహించి హెచ్చరికలు జారీచేశారు.

కఠిన చర్యలు తప్పవు

ఇకపై చెత్తపన్ను సక్రమంగా వసూలు చేయనివారిపై కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్‌ హెచ్చరించారు. ఇందుకోసం సిబ్బంది కచ్చితంగా ఈపాస్‌ యంత్రాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. మరోవైపు చెత్తపన్ను కింద చెక్‌ తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇక నుంచి రోజూ ఉదయం 9-10 మధ్య ఒక అర గంట దీనిపై సమీక్షిస్తానని తెలిపారు. ఇందుకు సంబంధించి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, శానిటరీ సెక్రటరీ పూర్తిగా బాధ్యత తీసుకుని బకాయిలు వసూలు చేయాలని ఆదేశించారు.  
అనంతరం సచివాలయ ముఖ్య అధికారిణిని కమిషనర్‌ టెలీ కాన్ఫరెన్సులోకి తీసుకున్నారు. ఆమె నుంచి చెత్తపన్నుపై వివరాలు సేకరించారు. మీకు ఈ పాస్‌ యంత్రాలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. అందరికీ అందాయని, కానీ సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని,  వసూలు చేసినా సైట్‌లో కనిపించడంలేదని ఆయన దృష్టికి తెచ్చారు. తర్వాత చీఫ్‌ మెడికల్‌ అధికారి బాబూ శ్రీనివాస్‌ను లైన్లోకి తీసుకున్నారు. ‘ఏమయింది? బాబూ? కలెక్షన్‌ అంతా తగ్గిపోయింది?’ ఏంటంటూ ప్రశ్నించారు. సెలవులు వచ్చాయని,  అయినా.. 3 రోజులకు రూ.3 లక్షలు వసూలు చేసినట్లు ఆయన బదులిచ్చారు. తక్కువ వసూలు చేస్తున్నవారందిరికీ మెమోలు ఇచ్చానని తెలిపారు. దీనిపై కమిషనర్‌ స్పందిస్తూ తక్కువ వసూళ్లు చేస్తున్న వారిని గుర్తించి ఆఫీసుకు పిలిపించండని సూచించారు. కావాలంటే ఇద్దరు ముగ్గురిని సస్పెండ్‌ చేయండని చెప్పారు. ఇకపై నిత్యం రూ.7 లక్షల వసూళ్ల లక్ష్యం చేరుకోవాలని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని