logo

బుట్టలో పడుతున్న విద్యావంతులు

ఎలక్ట్రికల్‌ వాహనాల డీలర్‌షిప్‌, మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌ డీలర్‌ షిప్‌... ఇలా అధిక ఆదాయం వచ్చే డీలర్‌షిప్‌లు ఇస్తామంటూ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇస్తారు. దీనిపై నమ్మకంతో ఎవరైనా ముందుకు వస్తే.. వారికి అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు.

Updated : 17 Aug 2022 05:37 IST

మోసాలకు తెగపడుతున్న సైబర్‌ నేరగాళ్లు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే

ఎలక్ట్రికల్‌ వాహనాల డీలర్‌షిప్‌, మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌ డీలర్‌ షిప్‌... ఇలా అధిక ఆదాయం వచ్చే డీలర్‌షిప్‌లు ఇస్తామంటూ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇస్తారు. దీనిపై నమ్మకంతో ఎవరైనా ముందుకు వస్తే.. వారికి అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు. పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని నమ్మిస్తారు. స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులతో దశ తిరిగిపోతుందంటారు. రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టిస్తారు. ఆ తర్వాత నుంచి ఆ వెబ్‌సైట్‌ పనిచేయదు. వారి చరవాణులు బంద్‌ అవుతాయి. ఇలా బి.టెక్‌. వంటి ఉన్నత చదువులు చదివిన వారే లక్ష్యంగా ఇటీవల సైబర్‌ నేరగాళ్లు మోసాలకు తెరతీశారు. ఈ నెలలో విజయవాడ నగరంలో ఇద్దరు బి.టెక్‌. యువకులు సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.

భవానీపురం పీఎస్‌ పరిధిలోని గొల్లపూడిలో ఉండే బి.టెక్‌. చదివిన యువకుడు(28) ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. ఇటీవల ఆయన ‘క్లిక్‌ ఇండియా’ అనే వెబ్‌సైట్లో యాడ్స్‌లో చూస్తుండగా.. ‘బగ్గీ ఈ మార్ట్‌ కంపెనీ’లో మెడికల్‌ డీలర్‌షిప్‌ ప్రకటన చూశారు. దీనిపై ఆసక్తితో కంపెనీ జోనల్‌ మేనేజర్‌ రాహుల్‌ అగర్వాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ డీలర్‌షిప్‌ కోసం రూ.5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టమనటంతో ఆ సొమ్మును ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. డీలర్‌షిప్‌కు సంబంధించిన కాగితాలను యువకుడికి పంపించారు. అప్పటి నుంచి సదరు కంపెనీ కొన్ని ఆర్డర్లు మాత్రమే అప్పుడప్పుడు పంపిస్తుండటంతో అనుమానం వచ్చింది. ఆ యువకుడు ఇండోర్‌లోని కంపెనీ చిరునామాకు వెళ్లారు. అక్కడ మార్కెటింగ్‌ మేనేజర్‌ రాజీవ్‌ సక్సేనాతో మాట్లాడారు. వారు యువకుడు కట్టిన సొమ్మును 45 రోజుల్లో చెల్లిస్తామని చెప్పి రూ.60వేలు మాత్రమే పంపించారు. మిగిలిన సొమ్ము గురించి సరైన సమాధానం చెప్పకపోవటంతో మోసపోయినట్లు గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
‌పటమట పీఎస్‌ పరిధిలోని శ్రీరామచంద్రనగర్‌కు చెందిన బి.టెక్‌. చదివిన యువకుడు (25) పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలో 2022, ఏప్రిల్‌ 24న ఎ.శ్రావణి అనే టెలిగ్రామ్‌ ఎకౌంట్‌ నుంచి మేసెజ్‌ వచ్చింది. యువకుడు ఆమెతో చాటింగ్‌ చేస్తున్నాడు. ఆమె తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం డబ్బులు పంపించమనటంతో.. 2022, ఏప్రిల్‌ 24 నుంచి మే 1వ తేదీ మధ్య కాలంలో రూ.60,700లు పంపించారు. అనంతరం ఆమె స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే.. పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని చెప్పటంతో నమ్మారు. విడతల వారీగా ఆమెకు రూ.4.04 లక్షలు పంపించాడు. ఆమెకు రూ.94వేలు ఆదాయం రాగా వాటిలో రూ.36,500లు మాత్రమే యువకుడికి పంపారు. ఆ తర్వాతి నుంచి సరైన సమాధానం లేకపోవటంతో తాను రూ.4,27,300లు మోసపోయినట్లు గుర్తించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నమ్మకంగా మాట్లాడుతూ...

సైబర్‌ నేరగాళ్లు నమ్మకంగా మాట్లాడుతూ బురిడీ కొట్టించేస్తున్నారు. పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందనటంతో చదువుకున్న వారు సైతం నమ్మేస్తున్నారు. అపరిచితులు చెప్పినట్లు డబ్బులు కట్టేసి, మోసపోయాక లబోదిబోమంటున్నారు. తాము మోసపోయినట్టు గుర్తించి సైబర్‌ పోలీసులను ఆశ్రయించేసరికి సైబర్‌ నేరగాళ్ల ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. వారు ఆ డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించేస్తున్నారు. మోసపోయిన వెంటనే గంటల వ్యవధిలో ఫిర్యాదు చేస్తే.. సొమ్ము బదిలీ అయిన ఖాతాలను స్తంభింపచేసి సదరు సొమ్మును వెనక్కి తీసుకురావచ్చని పోలీసులు అంటున్నారు. బాధితులు అప్రమత్తంగా లేకపోవటంతో నష్టపోతున్నారు.

పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే...

సైబర్‌ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు ముందుగా నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తారు. దాని ద్వారా లావాదేవీలు నిర్వహించి నకిలీ కంపెనీలు పెడతారు. దాని నిమిత్తం డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాత వెబ్‌సైట్‌ మూతపడిపోతుంది. సదరు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉండవు. ఒక వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్రకటన లేదా డీలర్‌షిప్‌ ప్రకటన వస్తే.. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. సదరు కంపెనీ చిరునామా పరిశీలించాలి. అక్కడకు వెళ్లి కంపెనీ ఉందని నిర్ధారించుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టటం ఉత్తమం. అదే విధంగా స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే ఆర్థిక రంగ నిపుణుల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లటం మేలు. ఇలా చేస్తే సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని